సినిమాయే ఆయన జీవితం

Apr 30,2024 05:48 #Articles, #edite page

సినిమాను వ్యాపారంగా చూసి ఉంటే దాదాసాహెబ్‌ ఫాల్కే ఆనాడే కోటీశ్వరుడుగా ఉండేవాడు. కానీ సినిమా రంగాన్ని, సినిమాను విపరీతంగా ప్రేమించి దెబ్బ తిని, తను మాత్రం కటిక దరిద్రంతో, కడు పేదవాడిగా మరణించాడు. ఒక ఆశయం కోసం మాత్రమే జీవించిన మంచి వ్యక్తిగా చరిత్రకెక్కిన దాదా సాహెబ్‌ ఫాల్కే జయంతి నేడు.
ప్రపంచంలోనే అతి పెద్ద పరిశ్రమలలో ఒకటి సినిమా ప్రపంచం. భారతీయ సినిమా పరిశ్రమ ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందిస్తున్న ఒక కళారంగం సినిమా రంగం. ఇటువంటి భారత సినీ పరిశ్రమకు ఆరాధ్యునిగా, ఎందరికో ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు దాదా సాహెబ్‌ ఫాల్కే.
ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్‌ గోవింద్‌ ఫాల్కే. మహారాష్ట్ర లోని నాసిక్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వర్‌లో 1870 ఏప్రిల్‌ 30న జన్మించాడు. బొంబాయి లోని జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, బరోడాలోని కళాభవన్‌లలో విద్యాభ్యాసం చేశాడు. తండ్రి గోవింద్‌ సదాశివ్‌ ఫాల్కే సంస్కృత పండితుడు, పూజారిగానూ పనిచేశారు. తల్లి ద్వారక బాయి సామాన్య గృహిణి. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు. తండ్రి బొంబాయిలోని విల్సన్‌ కళాశాలలో సంస్కృత ప్రొఫెసర్‌గా నియమితులైనప్పుడు, కుటుంబం మొత్తం నివాసాన్ని బొంబాయికి మార్చింది.
ఫాల్కే తన ప్రాథమిక విద్యను త్రయంబకేశ్వర్‌లో పూర్తి చేసి, బొంబాయిలో మెట్రిక్యులేషన్‌ ముగించాడు. ఫాల్కే 1885లో బొంబాయిలోని సర్‌ జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చేరి డ్రాయింగ్‌లో ఒక సంవత్సరం కోర్సు పూర్తి చేశాడు. 1886 ప్రారంభంలో అతను తన అన్నయ్య శివరంపంత్‌తో కలిసి బరోడాకు వెళ్ళాడు. బరోడా మహారాజా సయాజిరావ్‌ విశ్వవిద్యాలయంలో ఫైన్‌ ఆర్ట్స్‌ ఫ్యాకల్టీ అయిన కళా భవన్‌లో చేరి 1890లో ఆయిల్‌ పెయింటింగ్‌, వాటర్‌ కలర్‌ పెయింటింగ్‌లో కోర్సు పూర్తి చేశాడు. ఆర్కిటెక్చర్‌, మోడలింగ్‌లో కూడా ప్రావీణ్యం పెంపొందించుకున్నాడు. అదే సంవత్సరంలో ఫాల్కే ఒక ఫిల్మ్‌ కెమెరాను కొనుగోలు చేసి, ఫోటోగ్రఫీ, ప్రాసెసింగ్‌, ప్రింటింగ్‌పై ప్రయోగాలు చేయసాగాడు. 1892లో అహ్మదాబాద్‌లో జరిగిన పారిశ్రామిక ప్రదర్శనలో ఆదర్శవంతమైన థియేటర్‌ నమూనాను రూపొందించినందుకు అతనికి బంగారు పతకం లభించింది. ఓ అభిమాని ఆయనకు బహుమతిగా ఇచ్చిన ఖరీదైన కెమెరాను ఉపయోగిస్తూ, స్టిల్‌ ఫోటోగ్రఫీలో మరింతగా రాణించడానికి ప్రయత్నించాడు. 1891లో, ఫాల్కే సగం-టోన్‌ బ్లాక్స్‌, ఫోటో-లిథియో, మూడు-రంగుల సిరామిక్‌ ఫోటోగ్రఫీని తయారుచేసే పద్ధతులను తెలుసుకోవడానికి ఆరు నెలల కోర్సు చేశాడు.
1896లో బొంబాయిలోని వాట్సన్‌ హోటల్‌లో ప్రదర్శించబడిన సినిమాను చూసి, సినిమాలు తీయాలని భావించి, 1913లో తొలి చిత్రం ”రాజా హరిశ్చంద్ర”ను రూపొందించాడు. ఈ సినిమానే మొట్టమొదటి భారతీయ చిత్రంగా, భారతదేశ మొట్టమొదటి పూర్తి నిడివి చలన చిత్రంగా పేరుగాంచింది. కానీ ఈ చిత్రం రూపొందడానికి వారి కుటుంబ సభ్యులు పడ్డ కష్టాలు మాత్రం మరువలేనివి. సినిమా నిర్మాణానికి ఎలాంటి ఏర్పాట్లు లేని ఆ కాలంలో ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఫాల్కే తొలి సినిమా తీశాడు. ఫాల్కే భార్య సరస్వతి బాయి ఫాల్కే భారతీయ తొలి సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఆమెనే తొలి భారతీయ సినిమా టెక్నీషియన్‌. ఆమె తన బంగారు ఆభరణాలనన్నింటినీ అమ్మి డబ్బు సమకూర్చడం వల్లనే ‘రాజా హరిశ్చంద్ర’ సినిమాను పూర్తిచేయగలిగారు.
‘రాజా హరిశ్చంద్ర’ చిత్రంతో మొదలైన ఫాల్కే సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే-రచయితగా 95 చిత్రాలను, 26 లఘు చిత్రాలను రూపొందించాడు. సినిమా రంగంలో ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా ఆయన సినీపరిశ్రమ అభివృద్ధికి, నూతన ప్రయోగాలకు తిరిగి ఖర్చు చేశాడు. భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఫాల్కే ఎంతో కృషి చేశాడు. ఫాల్కే నుండి వెలువడిన ఆణిముత్యాలుగా 1913లో మోహిని భాస్మసుర్‌, 1914లో సత్యవన్‌ సావిత్రి, 1917లో లంకా దహన్‌, 1918లో శ్రీ కృష్ణ జన్మ, 1919లో కాలియా మర్దన్‌ లాంటివి మేటి చిత్రాలుగా పెరుగాంచాయి. సినీ పరిశ్రమలో వున్నన్నాళ్లు ఫాల్కే శ్రమను ఆ పరిశ్రమ గుర్తుంచుకోవలసిందే. అలాంటి బలమైన పునాది వేశాడు ఫాల్కే.
భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష కృషి చేసి, ప్రపంచానికి భారతీయుల గొప్పదనాన్ని తెలియచేసిన దాదా సాహెబ్‌ ఫాల్కే 1944 ఫిబ్రవరి 16న నాసిక్‌లో…ఒక పేదవాడుగా, కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టిన వాడుగా, కేవలం తనకు ఇష్టమైన సినిమా ప్రపంచం కోసమే బతికినవాడుగా, సినిమా రంగంలోని వారు ”మరిచిపోయిన” ఒంటరివాడుగా మరణించడం దురదృష్టకరం.
భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్‌ ఫాల్కే శతజయంతి సందర్భంగా 1969లో ”దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని” భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతీయ చిత్ర నిర్మాణ ప్రగతిలో ఎంతో కృషి చేసి, అద్భుత ప్రతిభాపాటవాలను కనబరిచే అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే లభించే గౌరవం ఈ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు.
నటీనటులు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, గాయనీ గాయకులు, పాటల రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఇలా చలన చిత్రాభివృద్ధికి విశిష్టంగా కృషి చేసిన ఎవరైనా ఈ అవార్డుకు అర్హులే. అందుకే చాలా అరుదైన వ్యక్తులు, ప్రతి క్షణం సినిమా పరిశ్రమ కోసం ఆలోచించే వారు, తమ జీవితాంతం పరిశ్రమనే నమ్ముకొని ఉన్నవారు మాత్రమే పొందే విశిష్ట పురస్కారమే ఈ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు. మొట్టమొదటి సారిగా 1969లో ప్రకటించిన ఈ పురస్కారాన్ని దేవికా రాణికి అందచేశారు.
1938లో భారతీయ సినిమా రజతోత్సవ వేడుకల్లో దాదా సాహెబ్‌ ఫాల్కే ఒక అనామకుడిగా ప్రజల్లో కూర్చోవడం చూసిన శాంతారాం ఆయన్ని గుర్తించి వేదికపైకి తీసుకు పోయి, అప్పటికప్పుడు వేదికపై ఐదు వేల రూపాయల పర్స్‌ అందజేశారు. ఆ డబ్బుతో అందరి ఒత్తిడి వల్ల నాసిక్‌లో ఒక ఇంటిని కొన్నాడు ఫాల్కే. అప్పటి వరకు ఫాల్కేకు సొంత ఇల్లు కూడా లేదు. ఆ ఇంటిలోనే తుది శ్వాస విడిచారు. భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తిప్రదాత.

-వ్యాసకర్త రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గడప రఘుపతిరావు

సెల్‌ : 9963499282 /

➡️