నిఘా నేత్రం

  • కౌంటింగ్‌ అనంతరం ఘర్షణలు జరగకుండా చర్యలు
  • క్రిమినల్స్‌, నేరస్తులపై పిడి యాక్ట్‌
  • స్ట్రాంగ్‌ రూమ్స్‌ ప్రాంతాలకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌జోన్‌ అమలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింస, అల్లర్లు జరిగిన నేపథ్యంలో అటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్‌ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దయెత్తున వినియోగించుకునేలా అడుగులు ముందుకేస్తోంది. ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరగనుండగా, ఫలితాల అనంతరం పలు ప్రాంతాల్లో అల్లర్లు, హింస ప్రజ్వరిల్లే అవకాశాలున్నాయని కేంద్ర ఇంటెలిజెన్సీశాఖ అలెర్ట్‌ మెసేజ్‌ ఇచ్చిన నేపథ్యంలో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. డివిజన్లు, సర్కిల్స్‌, పోలీస్‌ స్టేషన్ల వారీ అల్లర్లు, దౌర్జన్యాలు జరిగే గ్రామాలు ఏమున్నాయి? ఆయా గ్రామాల్లో ఏమే వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండొచ్చు? అనే అంశాలపై పోలీస్‌శాఖ ఆరా తీస్తోంది.
ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనల్లో పాల్గొన్న వారిపై పిడి యాక్ట్‌ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పదే పదే కేసుల్లో ఇరుక్కుంటున్న వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే గ్రామాల వారీ చాలా మందిని స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వడం, బైండోవర్‌ చేసుకునే ప్రక్రియను ఆ శాఖ ప్రారంభించింది. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అల్లర్లు జరుగుతాయని ప్రాథమికంగా పోలీస్‌శాఖ గుర్తించిన జంక్షన్స్‌లో సిసి కెమెరాలను ఏర్పాటుచేసే ప్రక్రియను వేగవంతం చేసే పనిలో ఆ శాఖ నిమగమైనట్లు సమాచారం.
మీడియా సమావేశాల ద్వారా సందేశాలు!
క్షణికావేశంలో ఉద్రిక్తతలకు పోయి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తు కోల్పోవాల్సి వస్తుందనే విషయాన్ని యువతకు తెలిపేందుకు ఈ వారంలో జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ అధికారులు సంయుక్తంగా మీడియా సమావేశాల ద్వారా సందేశాలను ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే గ్రామాల్లో పర్యటించి అవగాహన కల్పించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమైనప్పటికీ గెలిచిన అభ్యర్థి వర్గం.. ఓడిన అభ్యర్థి తాలూకా అనుచరులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పోలీస్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఇవిఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్స్‌కు 2 కిలోమీటర్ల వరకు రెడ్‌జోన్‌ (నో ఫ్లయింగ్‌ జోన్‌)గా పోలీస్‌శాఖ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో డ్రోన్స్‌, బెలూన్స్‌ ఎగురవేయడాన్ని నిషేధించినట్లు విజయవాడ పోలీస్‌ కమిషనరు పిహెచ్‌డి రామకృష్ణ సోమవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని ఆ శాఖ అనుసరిస్తున్నట్లు సమాచారం. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలతోపాటు విజయవాడ సెంట్రల్‌, తూర్పు నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశమున్నట్లు ఇంటెలిజెన్స్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ ఇప్పట్నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

➡️