విత్తుకై వెతుకులాట

May 21,2024 08:15 #Farmer, #rythu, #Searching, #Seeds
  •  అందని పంటల బీమా
  •  తొలకరితో సాగుకు సమాయత్తమవుతున్న‘అనంత’ రైతన్న

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి
తొలకరి పలకరించడంతో అనంత రైతన్న సాగుకు సమాయత్తమవుతున్నాడు. ఖరీఫ్‌ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈలోపు విత్తనాలు సిద్ధం చేసుకోవడం, దుక్కులు దున్నుకోవడం వంటి పనులకు సిద్ధమవుతున్నాడు. ప్రభుత్వం సబ్సిడీ వేరుశనగ విత్తనకాయల పంపిణీకి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది. ఈ నెల 24 నుంచి విత్తనకాయల పంపిణీని చేపట్టనున్నట్లు ప్రకటించింది. విత్తనాలు తీసుకునేందుకు ముందుగా రిజిస్ట్రేషన్‌తోపాటు నాన్‌ సబ్సిడీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దుక్కులకు డబ్బులు అవసరమవుతాయి. గతేడాది వర్షాభావంతో పంటలు పండక రైతులు పూర్తిగా నష్టపోయారు. చేతిలో చిల్లిగవ్వలేక డబ్బుల కోసం వెతుకులాట మొదలు పెట్టారు. బ్యాంకుల్లో రుణాలు ఇస్తున్నా అవి గతేడాది రుణాలు చెల్లించి పాతవి రెన్యువల్‌ చేసుకోవడానికి సరిపోతున్నాయి. కొత్తగా పెట్టుబడికి చేతిలో డబ్బుల్లేక బయట వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

అందని పంటల బీమా, రైతు భరోసా
2023 ఖరీఫ్‌లో వర్షాభావంతో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లాలో 29 మండలాల్లో పంట నష్టం జరిగింది. కేంద్ర కరువు బృందంతోపాటు, జిల్లా అధికార యంత్రాంగం రూపొందించిన పంట నష్టం అంచనాలే 4.34 లక్షల ఎకరాల్లో గతేడాది ఉంది. ఇందుకు సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రభుత్వం రూ.251.20 కోట్లు మంజూరు చేసింది. పంటల బీమాపై ఇప్పటి వరకు ప్రకటన వెలువడలేదు. ఇది ఇప్పటికైనా వస్తే రైతులకు పెట్టుబడికి ఉపయోగపడుతుందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. 2024కు సంబంధించి మేలో ఏటా ఇస్తున్న రైతు భరోసా కూడా ఇప్పటి వరకు ఏమిటన్న స్పష్టత అధికారులకే లేదు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో దీనిపై ఎటువంటి మార్గదర్శకాలూ లేవు. ఏటా మేలో ఆన్‌లైన్‌లో రైతు భరోసా నమోదుకు ఆప్షన్‌ ఇవ్వగానే అధికారులు నమోదు చేసే వారు. ఈసారి ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ ఓపెన్‌ అవలేదని అధికారులు చెబుతున్నారు.

ఖరీఫ్‌ అంచనా 8.66 లక్షల ఎకరాలు
ఈ ఏడాది ఖరీఫ్‌లో అనంతపురం జిల్లాలో 8.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశముందని అంచనా వేశారు. వేరుశనగ పంట 4.94 లక్షల ఎకరాల్లో సాగుకు వీలుందని, పత్తి 1.12 లక్షల ఎకరాలు, కంది 9,233 ఎకరాలు, ఆముదం 40,376 ఎకరాలు, మొక్కజొన్న 28,549 ఎకరాలు, నీటి వసతి కింద 1,13,040 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశముందని అంచనా వేశారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతు భరోసా ఇవ్వాలి :చంద్రశేఖర్‌, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి
ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. రైతులు సాగుకు సమయత్తమవుతున్నారు. పెట్టుబడులకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం 2023 ఖరీఫ్‌ పంట నష్టానికి సంబంధించి పంటల బీమాను వెంటనే మంజూరు చేయాలి. ఎప్పటిలాగానే ఈసారీ రైతు భరోసా డబ్బులు జమచేయాలి.

➡️