ప్రజాస్వామ్య ఆకాంక్ష

Apr 2,2024 06:25 #edit page, #Editorial

ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో ‘ఇండియా’ బ్లాక్‌ పార్టీలు ఆదివారం నిర్వహించిన మహార్యాలీ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. బిజెపి పదేళ్ల ఏలుబడిలో ప్రజాస్వామ్యం కొడిగట్టుకుపోయేదశలో పయనిస్తున్న ఈ ప్రమాద సమయంలో, ప్రజాస్వామ్యం కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరిలో ‘ఇండియా’ ప్రజా ప్రదర్శన ఆశలు చిగురింపజేసింది. ఒకే వేదికపై ఎన్‌డిఎ యేతర ప్రతిపక్ష పార్టీల యోధానుయోధులు కొలువుదీరడంతోపాటు వచ్చే ఎన్నికల్లో బిజెపి, ఎన్‌డిఎలను ఓడించాలని ప్రజలకు పిలుపునివ్వడం ఆహ్వానించదగిన పరిణామం. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, ఖర్గె, రాహుల్‌, వామపక్ష నాయకులు ఏచూరి, రాజా, దీపాంకర్‌ భట్టాచార్య, డిఎంకె, ఎస్‌పి, ఆర్‌జెడి, ఆప్‌, జెఎంఎం, టిఎంసి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పిడిపి, పవార్‌, ఉద్ధవ్‌, తదితర నాయకులు ఒకే చోట చేరిస సన్నివేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆవిష్కరించింది. బిజెపిని ఐక్యంగానే ఎదుర్కొనగలమన్న తత్వాన్ని బలోపేతం కావించింది. ఎన్నికల ముంగిట జార్ఖండ్‌, ఢిల్లీ సిఎంలు హేమంత్‌ సోరెన్‌, కేజ్రీవాల్‌ను మోడీ సర్కార్‌ కక్ష పూరితంగా ఇ.డి. కేసుల్లో ఇరికించి జైలుకు పంపింది. విపక్షాలపై బిజెపి ప్రభుత్వ దుర్మార్గపూరిత విధానాన్ని ‘ఇండియా’ సభ ముక్తకంఠంతో గర్హించింది. వ్యవస్థలను గుప్పెట పెట్టుకొని, ప్రతిపక్షాలపై అనైతిక దాడులకు పాల్పడుతున్న బిజెపిని గద్దె దించి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ‘ఇండియా’ దిశా నిర్దేశంపై యావత్‌ దేశ ప్రజానీకం ఆలోచిస్తోంది.
‘ఇండియా’ సభ జయప్రదం కావడంపై బిజెపి గుండెల్లో రైళ్లుపరిగెత్తుతున్నాయని ఆ పార్టీ నేతల చేష్టల్లో తెలిసిపోతోంది. పైకి ‘ఇండియా’ పని అయిపోయిందని చెబుతూనే మరో వైపు విపక్షాలపై ఇ.డి, ఐ.టి, సిబిఐ వంటి వాటి ప్రయోగ ఫలితమే కేజ్రీవాల్‌, సోరెన్‌ అరెస్టులు. కాంగ్రెస్‌కు ఐ.టి నోటీసుల ప్రహసనం, కేరళ సిఎం పినరరు కుమార్తెపై ఇ.డి కేసు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎన్‌డిఎ కి 400 సీట్లంటున్న బిజెపి, విపక్షాలను అంతగా వేటాడి వేధించడం చూస్తుంటే ఆ పార్టీలో భయాందోళనల స్థాయేమిటో అర్థమవుతుంది. అవినీతిపరులను శిక్షించడం ‘ఇండియా’కు ఇష్టం లేదంటున్న మోడీ, అవినీతిని, క్విడ్‌ప్రోకోను, క్రోనీ కేపిటలిజాన్ని ఎలక్టోరల్‌ బాండ్లతో చట్టబద్ధం చేసి, సుప్రీం కోర్టులో అభిశంసనకు గురికావడంపై ఏం సమాధానం చెబుతారు? యుపి, బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ, హర్యానా వంటి ప్రధాన రాష్ట్రాల్లో ‘ఇండియా’ పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కుదిరాయి. మహారాష్ట్రలో కూడా అదే దిశగా వెళుతున్నాయి. దేశ వ్యాప్తంగా 300 పైగా సీట్లలో ఎన్‌డిఎను, ఇండియా నేరుగా ఎదుర్కొంటోంది. ఇదే బిజెపికి కంటగింపుగా మారింది.
ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక యుపిలోని మీరట్‌లో మోడీ తొలి ఎన్నికల సభలో తమ అసలు సిసలు భవిష్యత్‌ కార్యాచరణేమిటో తేల్చేశారు. పదేళ్లలో చూపింది ట్రయల్‌ మాత్రమేనని వచ్చే ఐదేళ్లలో అసలు సినిమా చూపిస్తామన్నారు. 400 సీట్లు కనుక వారికి వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారని, నియంతృత్వాన్ని పాదుకొల్పుతారన్న భయాందోళనలకు మోడీ వ్యాఖ్యలు బలం చేకూరుతున్నాయి. ఎప్పుడో 1974లో తమిళనాడు సమీపంలోని ‘కచ్చతీవు’ దీవిని ఇందిరాగాంధీ శ్రీలంకకు ఇచ్చేశారంటూ కొత్త వివాదం లేవనెత్తడం విద్వేష వ్యాప్తి, తద్వారా ఓట్ల లబ్ధి కోసమే. గతంలోనూ రామసేతు వివాదం ఇలాగే లేవదీశారు. ఇప్పటికే బిజెపి దశాబ్ద జమనాలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరలు, ఆకలి పెరిగాయి. మానవాభివృద్ధి సూచిలన్నింటిలో మనదే అధమ స్థానం. ఈ భ్రష్టత్వాలకు అదనం రాజ్యాంగ ధ్వంసం, ప్రజాస్వామ్య హననం, మతతత్వము. నియంతృత్వ దిశలోకి దేశం జారే ప్రమాదం ఏర్పడుతోంది. ‘నాడు 1975లో కాంగ్రెస్‌ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో లోకనాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నేతృత్వంలో పెద్ద ర్యాలీ జరిగింది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వ అప్రకటిత ఎమర్జెన్సీకి ప్రతిఘటనగా ర్యాలీ జరుగుతోంద’ని సిపిఎం నేత సీతారాం ఏచూరి చరిత్రను గుర్తు చేయడం సందర్భోచితం. ఇండియా బ్లాక్‌ ఆ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రజల విశాల మద్దతు సాధించాలి.

➡️