బూటకపు మాటలు

బిజెపి, టిడిపి, జనసేన ఆదివారం చిలకలూరిపేటలో ఆర్భాటంగా నిర్వహించిన ఉమ్మడి ఎన్నికల సభకు ముఖ్యాతిధిగా విచ్చేసిన ప్రధాని మోడీ తన ప్రసంగం యావత్తూ ఊక దంచారు. మోడీ ఉత్తుత్తి మాటలకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధిపతి పవన్‌ కళ్యాణ్‌ సభాముఖంగా మహదానందం పొందారు. ఆనక మోడీ స్తుతిలో ఉబ్బితబ్బిబ్బయ్యారు. రానున్న ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీలూ పొత్తు కుదుర్చుకున్నాక మొదటి సభ అని, మోడీ రాష్ట్రానికి ఎనలేని హామీలిస్తారని టిడిపి, జనసేన ఊదరగొట్టాయి. కాగా కేంద్రంలో పీఠమెక్కాక పదేళ్లలో ఎ.పి.కి ఏం చేశారు, వచ్చే ఐదేళ్లలో ఏం చేయబోతున్నారో మోడీ మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పిఎం కిసాన్‌, పక్కా ఇళ్లు, జల్‌జీవన్‌ మిషన్‌, ఆయుష్మాన్‌ భారత్‌, వంటి పథకాలను ఏకరువు పెట్టారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ అన్యాయం చేసిందన్న ప్రధాని, నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చిందేమిటో, విభజన చట్టంలోని హామీలెందుకు ఇవ్వలేదో చెప్పకుండా దాట వేశారు. 11 కేంద్ర సంస్థలను నెలకొల్పామని గొప్పగా పేర్కొనగా, నేటికీ వాటి భవనాలు మొండి గోడల దశలోనే ఉన్నాయన్న వాస్తవాన్ని కావాలనే దాచి పెట్టాలని చూశారు. మోడీ ప్రసంగం ఆద్యంతం దగా, ద్రోహం, వంచన అని ప్రజలకు అర్థమైంది.
ప్రజాగళం పేరిట నిర్వహించిన సభలో ఎక్కడా ప్రజల ప్రస్తావన లేదు. అధికారం తప్ప జనం సమస్యలు మూడు పార్టీలకూ పట్టలేదు. ఎన్‌డిఎ కి 400 సీట్లు, రాష్ట్రంలో ఎన్‌డిఎ సర్కారు… ఇవే కూటమి లక్ష్యాలుగా నేతలు ప్రకటించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తే వికసిత భారత్‌, వికసిత ఎ.పి. అన్నారు. పదేళ్లలో మొదటి నాలుగేళ్లూ రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వమే ఉంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌లో రాష్ట్రానికి బిజెపి ఏం చేసింది? ప్రత్యేక హోదా, విభజన హామీలు ఎందుకు అమలు కాలేదు? అవి ఇవ్వలేదనేగా ఎన్‌డిఎ నుంచి టిడిపి నిష్క్రమించి, కేంద్రంపై, మోడీపై బాబు ఆందోళనలు, దీక్షలు చేసింది! బిజెపి పాచిపోయిన లడ్డూలిచ్చిందని పవన్‌ సైతం బిజెపిని దుమ్మెత్తి పోయలేదా? గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి బిజెపి ఏం ఒరగబెట్టిందని మళ్లీ ఆ పార్టీతో టిడిపి, జనసేన అంటకాగేది? పొత్తు పెట్టుకున్నాక నిర్వహించిన తొలి సభలోనైనా ప్రధానితో రాష్ట్రానికి ఏం చేయిస్తారో స్పష్టంగా చెప్పించకుండా పొత్తు రాష్ట్రాభివృద్ధి కోసమనడం ఎంతమాత్రం నప్పదు. ఈసారి ఎన్‌డిఎకి ఓటేస్తే అభివృద్ధికి పునాది పడుతుందన్నారు మోడీ. పదేళ్లలో పునాది వేయకుండా మోసగించి, మళ్లీ ఓట్లేస్తే పునాది వేస్తామంటే ప్రజలు నమ్మేదెలా? పార్టీల పునర్‌ కలయిక రాష్ట్ర పునర్నిర్మాణానికనడం ఒట్టి బూటకం.
వైసిపి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, జగన్‌ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది, ప్రజలు ఆ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు, ఎన్‌డిఏని గెలిపించేందుకు సంకల్పం తీసుకోవాలన్నారు మోడీ. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడానికి జగన్‌ దోషి అయితే, ఇస్తామన్న హోదా, విభజన హామీలు ఇవ్వని బిజెపి అంతకంటే పెద్ద దోషి. చిన్న చిన్న అవినీతి కేసుల్లోనే ఇ.డి, సిబిఐ వస్తుండగా, అవినీతిలో మునిగిందంటున్న జగన్‌పై ఎందుకు రాలేదు? జగన్‌పై మోడీ ఆచితూచి విమర్శించారని అర్థమవుతుంది. జగన్‌ ప్రభుత్వానికి అండగా నిలబడిన బిజెపితో టిడిపి, జనసేన ఎందుకు పొత్తు పెట్టుకున్నట్లు? జగన్‌ కూడా ప్రధాని విమర్శలపై జవాబివ్వాలి. ఆంధ్రాకొచ్చి మోడీ ‘ఇండియా’ బ్లాక్‌పై విమర్శలు చేయడం వ్యూహాత్మకమే. మోడీ తెలుగులో కొన్ని పదాలు పలికి ప్రజలను ఆకట్టుకోవాలని యత్నించారు. ఎన్‌టిఆర్‌ సినిమాల్లో రాముడు, కృష్ణుడు పాత్రల్లో జీవించిన విషయం అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సమయంలో తనకు గుర్తుకొచ్చిందంటూ మత ఎజెండా ప్రయోగించారు. కోటప్పకొండ ప్రస్తావనా అందులో భాగమే. కాగా ఎన్‌టిఆర్‌ బాబ్రీ మసీదు కూల్చివేతను వ్యతిరేకించిన విషయం, ఫెడరలిజం పరిరక్షణకు ఆయన చేసిన పోరాటాన్ని ఉద్దేశపూర్వకంగానే మోడీ విస్మరించారు. పదేళ్లుగా రాష్ట్రానికి ద్రోహం చేసి, ఇప్పుడు ఏదో చేస్తామంటే ప్రజలు విశ్వసించరు. అటు వైసిపిని ఇటు టిడిపిని తమ చెప్పుచేతల్లో బంధించడమే మోడీ ఎజెండా. బిజెపికి టిడిపి, జనసేన లొంగుబాటు, వైసిపి పాదాక్రాంతం రాష్ట్రానికి వినాశకరం. ప్రజలు విజ్ఞత చూపాల్సిన సమయమిది.

➡️