పెనం నుండి పొయ్యిలోకి

పింఛన్‌దారులు ఒక ఇబ్బందిని తీర్చమంటే వంద ఇబ్బందులు తెచ్చిపెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం (ఇ.సి.). రాష్ట్రంలో ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్ల పంపిణీపై ఇ.సి. జారీ చేసిన మార్గదర్శకాలు లబ్ధిదారులకు ఎనలేని కష్టాలు తెచ్చిపెట్టాయి. వాటిని పరిష్కరించాలని పింఛన్‌దారులు, పలు రాజకీయపార్టీలు చేసిన విజ్ఞప్తులతో ఇ.సి. మే నెల పెన్షన్ల పంపిణీపై సరికొత్త గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. పింఛన్‌ లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది. వయోవృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారు, మంచం పట్టినవారు, వికలాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి మాత్రమే సర్కారీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పెన్షన్‌ ఇవ్వాలని సూచించింది. ఇ.సి. నిర్ణయం లక్షలాది పింఛన్‌దారుల్లో కొత్త ఆందోళనలకు కారణమైంది. ఏప్రిల్‌ పింఛన్ల పంపిణీ సందర్భంగా ఎదురైన ఇబ్బందులను తలచుకొని ఆవేదన చెందుతున్నారు. పెన్షన్‌ అందదన్న భయంతో వేసవి మండుటెండల్లో వయోభేదం లేకుండా పేదలు కార్యాలయాలకు పరుగులు తీయాల్సి వచ్చింది. దాంతో 30 మందికిపైగా వృద్ధులు మరణించారు. పేదల క్షోభకు ఇ.సి, ప్రభుత్వ వైఫల్యమే కారణం. గుణపాఠం తీసుకోకుండా, బ్యాంక్‌ ఖాతాల్లో పింఛన్‌ వేసే కాఠిన్యానికి పాల్పడటం పేదల ఉసురు తీయడమే కాగలదు.
రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో పెన్షన్‌ పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య 65 లక్షలకు పైచిలుకని, వారిలో 48 లక్షల మందికి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయని, అకౌంట్లు లేని వారు 16 లక్షలని సర్కారు లెక్కలు తీసింది. బ్యాంక్‌ ఖాతాల్లేని వారికి సిబ్బంది ఇంటికెళ్లి నగదు అందిస్తారని చెబుతున్నారు. అలాగే వయోవృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారికి కూడా ఇంటికెళ్లి పెన్షన్‌ ఇస్తామంటున్నారు. ఈ ఫార్మూలా వినడానికి బాగానే ఉన్నా అమలు అంత సులభం కాదు. లబ్ధిదారుల అకౌంట్‌లో అమౌంట్‌ పడాలంటే నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ)తో, ఆధార్‌తో తప్పనిసరిగా లింక్‌ కావాలి. లబ్ధిదారులు తమ అకౌంట్‌ ఉన్న బ్యాంక్‌ బ్రాంచికెళ్లి నగదు డ్రా చేయడం వ్యయ, ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాలకే ఈ మలమల మాడే ఎండల్లో వెళ్లలేని స్థితి ఉండగా, ఎక్కడో మండల కేంద్రంలో కిలోమీటర్ల దూరం వెళ్లి, ఓచర్లు రాయించుకొని, బ్యాంకుల వద్ద లైన్లలో నిలబడి, డబ్బు తీసుకోవడం ఎంత కష్టమో చెప్పతరం కాదు. ఇ.సి, ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలతో పింఛనుదారుల్లో 70 శాతం మందికి ఈ దుస్థితి అనివార్యత ఎదురు కావడం ఆందోళనకరం.
ఎ.పి.లో ఉన్న పెన్షన్‌ లబ్ధిదారుల్లో సగం మంది వృద్ధులేనన్నది ఒక లెక్క. వారూ బ్యాంకులకెళ్లి గంటల కొలదీ పడిగాపులు పడాలి. ఎటిఎంలు ఇచ్చామంటున్నా కొన్నేళ్లుగా నేరుగా చేతికి నగదు ఇస్తున్నందున అకౌంట్లు, ఎటిఎం కార్డులు వర్కింగ్‌లో లేవు. వృద్ధులు, నిరక్షరాస్యులు వాటిని వాడలేరు. పెన్షన్ల కోసం ఒకేసారి గుంపుగా బ్యాంకులకు వెళితే ఎంత అలజడి అవుతుందో మోడీ ప్రభుత్వం రాత్రికి రాత్రి పెద్ద నోట్లు రద్దు చేసిన విపత్కర రోజులు గుర్తుకు తెచ్చుకోవాలి. పింఛన్‌ వస్తుందన్న ఆశతో పేదలు పప్పు, ఉప్పు వంటి దైనందన అవసరాలకోసం, అనారోగ్యంతో బాధ పడేవారైతే మెడిసిన్స్‌ కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు. సమయానికి పింఛన్‌ అందకపోతే వారి జీవితచక్రం చిందరవందరవుతుంది. ఈ పరిస్థితులను ఇ.సి, సర్కారు పరిగణనలోకి తీసుకోలేదని అర్థమవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ స్కీం వర్కర్లు లక్షల సంఖ్యలో ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండగా, గతంలో మాదిరి ఇంటింటికి పింఛన్లు ఇవ్వకుండా ఎందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నారో ఒక పట్టాన అంతుబట్టదు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున రాష్ట్రంలో రాజకీయ ప్రభుత్వం ఉండదు. ఇ.సి. నియంత్రణలో అధికార యంత్రాంగం పరిపాలన చేస్తుంది. కొత్త నిబంధనలపై పింఛన్‌దారుల్లో నెలకొన్న భయాలను తొలగించి సజావుగా పింఛన్ల పంపిణీకి ఇ.సి, ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకపోతే, పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఎదురయ్యే దుష్పరిణామాలన్నింటికీ ఇ.సి., ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది.

➡️