హర్యానా షాక్‌!

May 9,2024 04:01 #editpage

లోక్‌సభ ఎన్నికల వేళ… హర్యానా సర్కారుకు ముగ్గురు స్వతంత్ర సభ్యులు మద్దతు ఉపసంహరించుకోవటంతో- అధికార బిజెపికి గట్టి షాక్‌ తగిలింది. ఇండిపెండెంట్ల సపోర్టుతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం ఉన్న పళంగా మైనారిటీలో పడింది. తగిన సంఖ్యాబలం లేకపోయినా ఇతర పార్టీల సభ్యులను భయపెట్టో, ప్రలోభపెట్టో తన వైపునకు తిప్పుకొని అక్రమ మార్గాల్లో అధికారం వెలగబెట్టే కాషాయ దళానికి ఈ పరిణామం మింగుడుపడనిది.
ఈ విడత లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగానే 370 సీట్లు గెలిచేస్తామని ఉద్వేగ వ్యూహానికి తెర లేపిన బిజెపికి – పోలింగు దశలు ముగుస్తున్నకొద్దీ తమది ఏపాటి బలమో తెలిసొస్తోంది. సగటు పౌరుడి బతుక్కి కనీస గ్యారంటీ ఇవ్వలేని పదేళ్ల అధ్వాన పాలనపై ప్రజలు భ్రమలు వీడుతున్న వాస్తవ దృశ్యం కళ్లకు కడుతోంది. రామమందిరం, 370 అధికరణ రద్దు వంటి ఉద్వేగ ప్రచారం ప్రసంగాల పటాటోపంగానే మిగిలిపోతోంది. ఉద్యోగం, ఉపాధి లేమి, ధరల పెరుగుదల వంటి వాస్తవ జీవన అంశాలే ప్రజలకిప్పుడు ప్రాధాన్యాంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ నిజం క్రమంగా అర్థమవుతున్నకొద్దీ మోడీ షా ద్వయంలో ఉక్రోశం తన్నుకొస్తోంది. మైనారిటీ ప్రజలను బూచిగా చూపించే దుర్బుద్ధీ, దుస్సాహసం మోడీలో ప్రధాని స్థాయిని మరచి మరీ ప్రదర్శితమవుతుంది. పదేళ్ల పాలనలో సాధించిన ఘనతలేమిటో, ప్రజోపయోగకరమైన పనులేమిటో విస్పష్టంగా ప్రకటించి, ఓట్లు అడగాల్సింది పోయి, దిగజారుడు ప్రచారంతో లబ్ధి పొందాలని మోడీ ఉవ్విళ్లూరడంతోనే ఆ పార్టీ బలహీనత దేశ ప్రజలకు అర్థమవుతుంది. ఇండియా బ్లాక్‌ని అధికారంలోకి తేవాలని పాకిస్తాన్‌ కోరుకుంటుందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముస్లిములకు ప్రాధాన్యం ఇస్తుందని, రామమందిరానికి తాళాలు వేస్తుందని ప్రధాని స్థాయి వ్యక్తి విద్వేషాన్ని, అవాస్తవాలను వెళ్లగక్కడం దేశ చరిత్రలో ఇదే మొదటి ఉదంతం. ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని పలుచన చేసే పరమ అధ్వాన నిర్వాకం.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ప్రతి పరిణామం… దానికి ఆనుకొని ఉన్న హర్యానాపై ఎక్కువ ప్రభావాన్నే చూపిస్తుంది. మోడీ తెచ్చిన నల్లచట్టాలపై రైతుల పోరాటం, బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులపై రెజ్లర్ల నిరసనల పర్వం వంటివన్నీ ఢిల్లీ పాలకుల విధానాలను మాత్రమే కాదు; హర్యానా ఏలికల ధోరణినీ ప్రజలు గ్రహించేలా చేశాయి. రైతులను, రెజ్లర్లనూ వేధించటంలో, నిరసనల అణచివేయడంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అతి కిరాతకంగా వ్యహరించింది. ఆ కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ దుర్మార్గంగా ప్రవర్తించి, జనాగ్రహాన్ని మూటగట్టుకున్నారు. వచ్చే అక్టోబరులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు అతడి ఆధ్వర్యంలోనే ముందుకెళితే- అభాసుపాలవ్వడం ఖాయమని కాషాయ దళం గ్రహించింది. నష్టనివారణ కోసం రెండు నెలల క్రితం ఖట్టర్‌ని తప్పించి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాయబ్‌ సింగ్‌ సైనీని ముఖ్యమంత్రి పీఠం మీద కూచోబెట్టింది. గతంలో బిజెపితో కలిసొచ్చిన ప్రధాన సామాజిక తరగతులు ఈసారి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయనే వార్తలొస్తున్నాయి. అన్ని తరగతుల రైతుల్లోనూ మోడీ విధానాలపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. శాశ్వత ఉపాధినిచ్చే సైనిక ఉద్యోగాలకు బదులు నాలుగేళ్లకే ఇంటికి పంపే ‘అగ్నివీర్‌’ పథకాన్ని తీసుకురావడం హర్యానా యువతలో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తోంది.
అడుగు జారిపోతున్న బిజెపికి మద్దతుగా నిలవడం తమ పుట్టి ముంచుతుందని మద్దతు పార్టీలు గ్రహిస్తున్నాయి. పదిమంది సభ్యులున్న జెజెపి మూడు నెలల క్రితం ప్రభుత్వంలోంచి బయటికొచ్చింది. ఆరుగురు స్వతంత్రుల ఊతంతో బిజెపి ప్రభుత్వాన్ని నిలబెట్టుకొంది. ఇప్పుడు అందులో ముగ్గురు బయటకొచ్చి, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి పనిచేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మైనారిటీలో పడిన బిజెపి సర్కారు తక్షణం రాజీనామా చేయాలి. విపక్ష ప్రభుత్వాలను పడగొట్టడమే గొప్ప రాజకీయ వ్యూహంగా చంకలు గుద్దుకునే కమలనాధులకు ఈ రాజకీయ సంక్షోభం నడినెత్తిన పిడుగుపడ్డ చందమే! విశ్వాసం కోల్పోయిన భారతీయ జనతా పార్టీ ఏలుబడికి హర్యానా పరిణామం ఒక కొండ గుర్తు.

➡️