ఇంటింటా ఆవకాయ…

ఆవకాయకూ, తెలుగు వారికీ అవినాభావ సంబంధం. ఇంట్లో కూర ఉన్నా, లేకున్నా ఆవకాయ ఉంటే చాలు, నాలుగు అన్నం ముద్దలు కమ్మగా గొంతు దిగిపోతాయి. ఎన్ని తరాలు మారినా, ఎన్ని దేశాలు దాటినా ఎర్రెర్రని ఆవకాయ ఇంటా, వెంటా ఉంచుకోవడం తెలుగోళ్లకు ఓ గుర్తింపు చిహ్నం. చాలా ఇళ్లల్లో ఈ పాటికే పచ్చి మామిడికాయలను కట్‌చేసి పచ్చళ్లు పట్టేశారు. ఆఖర్లో వస్తున్న కొన్ని రకాల మామిళ్లతో ఇప్పుడు పచ్చళ్లకు సిద్ధం అవుతున్న వారూ ఉన్నారు.
ఎర్రెర్రని ఆవకాయ పచ్చడిని చూస్తే చాలు నోట్లో నోరూరుతుంది. ఆవకాయ కూడా అనేక రకాలు, అనేక రుచులు. తీపి ఆవకాయ, తురుము ఆవకాయ, అల్లం ఆవకాయ, మెంతి ఆవకాయ, మాగాయ, నువ్వావకాయ, పెసరావకాయ … ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. మామిడి సీజన్‌ మొదలైన దగ్గర నుంచి తాత్కాలిక అవసరాలకోసం వారం, పదిరోజుల పాటు నిల్వ ఉండే పచ్చళ్లూ పడతారు. ఏడాది పాటు ఉండే రకాలూ సిద్ధం చేసుకుంటారు. ఆవకాయ మన దగ్గరే ఫేమస్‌ అయినప్పటికీ, ఇది తెలుగిళ్లకే పరిమితం కాదు. ఇతర రాష్ట్రాల్లోనూ మామిడి పచ్చళ్లు పెడతారు.
ఏటేటా వేసవి సీజన్‌లో పట్టే పచ్చళ్లు వచ్చే సీజన్‌ వరకూ ఉంటాయి. తెలుగు లోగిళ్లలో ఆవకాయ ప్రత్యేకతే వేరు. పచ్చడి ప్రియులు ఎంతగానో ఎదురుచూసే పచ్చి మామిడికాయలు నెలరోజుల క్రితం నుంచి మార్కెట్లలో విరివిరిగా లభిస్తున్నాయి. అప్పటినుంచి పచ్చళ్లు పట్టడం మొదలైంది. ఇప్పుడు పట్టే ఈ పచ్చళ్లు ఏడాదంతా నిల్వ ఉంచుకుంటారు. అన్ని స్థాయుల కుటుంబాల్లోనూ పచ్చడి తయారీ అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ వ్యక్తమవుతూ ఉంటుంది.
వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకుని తింటుంటే భలే రుచిగా ఉంటుంది. అమ్మను, ఆవకాయను మరువలేమని తెలుగు నానుడి. గతంలో ఒక్కొక్క కుటుంబం 200 నుంచి 400 కాయల వరకు పచ్చళ్లు పట్టేవారు. రాను రాను చిన్న కుటుంబాలు పెరగడంతో 100 నుంచి 50 కాయలకే పరిమితమవుతున్నారు. అందుబాట్లో లేని ధరలు కూడా ఇందుకు ఒక కారణంగా ఉంది.
రైతులు బహిరంగ మార్కెట్లో అమ్మడానికి ధరలు లేకపోయినా విడిగా పచ్చళ్లకు అమ్మే చిరు వ్యాపారులు డజను చిన్న రసాలు రూ.175 నుంచి రూ.250 వరకు చెబుతున్నారు. సాధారణంగా ఆవకాయను చిన్న రసాలతో పడుతుంటారు. ఇవి మిగిలిన కాయల కన్నా అద్భుతమైన రుచిని అందిస్తాయి. వీటి తరువాత తెల్ల గులాబీ రెండో స్థానాన్ని, జలాలు మూడు, నీలాలు నాల్గో స్థానాన్ని ఆక్రమిస్తాయి. అయితే ఈ నాలుగు రకాల కాయలు దిగుబడి 80 శాతం పడిపోయింది. ఆ మేరకు ఈ ఏడాది పచ్చళ్లు పట్టటం కూడా తగ్గి ఉంటుందని భావిస్తున్నారు.

పెరిగిన ధరలు
ఆవకాయ దాని రూపాన్ని సంతరించుకోవాలంటే ఒక మామిడి ముక్కలే సరిపోవు. అందుకు దినుసులు తోడైతేనే ఘుమఘుమలాడే రుచికరమైన ఆవకాయ తయారవుతుంది. ఆవకాయకు అవసరమైన ఆవాలు కిలో రూ.200, మెంతులు రూ.150, వెల్లుల్లి రూ.210, నూనె రూ.170, ఎండుమిర్చి బళ్లారి రూ.200, మామూలు మిర్చి రూ.170 ధరలు పలుకుతున్నాయి. పెరిగిన ధరల ప్రకారం ఓ ఇంటికి అవసరమైన ఆవకాయ పట్టాలంటే రూ.3,000 నుంచి రూ.3,500 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఆవకాయకు ఖర్చు రెట్టింపు అవుతుందని గృహిణులు వాపోతున్నారు.

తయారీ పద్ధతి ఇలా …
మామిడికాయలను తడిబట్టతో తుడిచి, ముక్కలు చేసి అందులో జీడి తీసేయాలి. ఒక గిన్నెలో కారంపొడి, ఉప్పు, జీలకర్ర, మెంతిపిండి, పసుపు వేసి ఉండలు లేకుండా బాగా కలియబెట్టాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడిచేయాలి. ఈ నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసి పోపు పెట్టాలి. గిన్నెను పొయ్యి మీద నుంచి దింపేయాలి. నూనె చల్లారనివ్వాలి. నూనె కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్పప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్దవేసి బాగా కలియబెట్టాలి. దీనివల్ల అందులోని తడిపోయి కమ్మగా ఉంటుంది. పూర్తిగా చల్లారాక కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమాన్ని వేసి మొత్తం కలపాలి. తర్వాత మామిడి ముక్కలు వేసి మొత్తం ముక్కలకు పట్టేట్టుగా కలపాలి. మొత్తం కలిపి శుభ్రమైన, తడిలేని జాడీలో ఆవకాయ వేసి జాగ్రత్తగా మూతపెట్టి ఉంచాలి. మూడు రోజుల తర్వాత మరోసారి కలియబెట్టాలి. అంతే! నూరించే కమ్మని ఆవకాయ తినడానికి తయారవుతుంది.

➡️