‘నమో’ సర్కార్‌ నూరు పాపాలు

బిజెపి నేతలు వల్లిస్తున్న నీతిసూక్తుల తీరు చూస్తుంటే ‘ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు’ చందంగా వుంది. ‘అవినీతిపరులు వుండాల్సింది జైల్లోనే’ అని ఎన్నికల సభల్లో ప్రధాని పదేపదే చెబుతున్నారు. అదే నిజమైతే ‘కరప్ట్‌ మోడీ.కామ్‌’ వెబ్‌సైట్‌ ప్రకటించిన వంద కుంభకోణాల బిజెపి వివరాలు చూస్తే ఆ పార్టీ నేతల్లో అత్యధికమంది వుండాల్సింది జైళ్లలోనే. మోడీ పాలనా కాలంలో దేశంలో, బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరిగిన అవినీతి కుంభకోణాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా దేశభద్రతకు సంబంధించిన ఆయుధాలు మొదలుకొని, ప్రజారోగ్యానికి అవసరమైన మందులు, పాఠశాలల్లో చిన్నపిల్లలకు ఇచ్చే చిక్కీల వరకు అవినీతిని సర్వవ్యాపితం చేశారు. ఇంతా చేసిన వీరే 370- 400 సీట్లు ఇవ్వాలని…పరీక్షలు రాయకుండానే నూరు మార్కులు కోరుకునే రౌడీ విద్యార్థి లాగా ఈ దేశ ప్రజలను డిమాండ్‌ చేస్తున్నారు.
కరప్ట్‌ మోడీ.కామ్‌ వెబ్‌సైట్‌లో ఇంగ్లీషు అక్షర క్రమం ‘ఎ’ నుండి ‘జెడ్‌’ వరకు ఒక్కో అక్షరాన్ని క్లిక్‌ చేస్తే దానికి సంబంధించిన బిజెపి కుంభకోణాల జాబితా వస్తుంది. ఈ వెబ్‌సైట్‌ ప్రకటించిన వంద కుంభకోణాల్లో కొన్నింటిని పరిశీలిస్తే వీరి గురువింద గింజ నీతి అర్థమవుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా డైరెక్టర్‌గా వున్న అహమ్మదాబాద్‌ జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంకులో పెద్దనోట్ల రద్దు సందర్భంగా కేవలం ఐదు రోజుల్లో రూ.745.58 కోట్ల పెద్ద నోట్లు జమ అయ్యాయి. దేశ బ్యాంకింగ్‌ చరిత్రలోనే ఇదో రికార్డు అవినీతి. మోడీ ప్రధాని అయిన తర్వాత అమిత్‌షా కుమారుడు జే షా కు చెందిన కంపెనీ టర్నోవర్‌ ఒక్క సంవత్సర కాలంలో 16 వేల రెట్లు పెరిగింది. కంపెనీ ఆదాయం కేవలం రూ.50,000 నుంచి ఒక్క ఏడాదిలోనే రూ.80,00,00,000కు పెరిగింది. ఇది ప్రపంచ ఎనిమిదో వింత! కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజిజు, అతని బంధువు-కాంట్రాక్టర్‌ గోబోరు రిజిజు నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌లో భాగంగా రెండు ఆనకట్టల నిర్మాణంలో రూ.450 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఈ విద్యుత్‌ సంస్థ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ సతీష్‌ వర్మ నివేదికల్లో స్పష్టంగా పేర్కొ న్నారు. అయినా ఆయన కేంద్రమంత్రిగానే కొనసాగారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ కర్ణాటక ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 2012 జనవరిలో మార్కెట్‌ ధర ఎకరం మూడు కోట్లు వున్న ప్రభుత్వ భూమిని ఎకరం కేవలం రూ.60 లక్షల చొప్పున పది ఎకరాలు ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మిన కుంభకోణంలో వున్నారు. ఇలా అనేకమంది కేంద్ర మంత్రుల అవినీతి భాగోతం ఈ వెబ్‌సైట్‌లో వుంది.
దేశంలో ఆరు అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణను ప్రైవేటీకరించాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు టెండర్లు పిలిచారు. ఆరింటిలో ఐదింటిని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ దక్కించుకుంది. ఇప్పటి వరకు అదానీ గ్రూపుకు విమానాశ్రయాలు నిర్వహించిన అనుభవం ఏ మాత్రం లేకపోయినా దేశాధినేతల దీవెనలతో ఏకపక్షంగా ఆయన ఈ టెండర్‌ దక్కించుకోగలిగారు. అయితే కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించడాన్ని అక్కడ అధికారంలో వున్న వామపక్ష ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని బేఖాతరు చేసి టెండర్‌ పిలిచింది. విమానాశ్రయ నిర్వహణకు ఒక్కో ప్రయాణికునికి రూ.168 ఇవ్వాలని అదానీ సంస్థ టెండర్‌ వేయగా, రూ.135కు మేమే నిర్వహించగలమని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ ద్వారా టెండర్‌లో పాల్గొన్నది. అయినా అదానీకే అప్పగించడం వెనుక కోట్ల అవినీతి, ఆశ్రిత పక్షపాతం వుంది. ప్రభుత్వ ప్రకటనలు దినపత్రికలకు, టీవీ ఛానళ్లకు ఇస్తారు. ఇందుకు భిన్నంగా మధ్యప్రదేశ్‌ బిజెపి ప్రభుత్వం రూ.14 కోట్లను ప్రకటనల పేరుతో వెబ్‌సైట్‌ పత్రికలకు ఇచ్చింది. ఈ డబ్బు పొందిన 234 వెబ్‌సైట్‌ పత్రికల అడ్రసే లేదు. ఒకవైపు పత్రికాస్వేచ్ఛను హరించివేస్తూ, మరోవైపు అక్రమంగా కోట్ల రూపాయలను పత్రికల పేరుతో కాజేశారు.
బిజెపి ఎంపీ ఆర్‌.పి.శర్మ కుమార్తె అస్సాంలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో అక్రమాలకు తెగబడ్డారు. పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడం ఇప్పటి వరకు విన్నాం. కానీ ఇక్కడి బిజెపి నేతలు డబ్బులు తీసుకుని జవాబు పత్రాలే సప్లయి చేసి కొత్త చరిత్ర సృష్టించారు. లక్షల రూపాయల విలువచేసే చదరపు గజం భూమిని కేవలం ఒక్క రూపాయి నుండి 32 రూపాయల చొప్పున 14,305 ఎకరాల భూమిని గుజరాత్‌లో అదానీ గ్రూపుకు బిజెపి ప్రభుత్వం కేటాయించింది. మధ్యప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్‌ ప్యాకేజి కింద రూ.3,860 కోట్లను యుపిఎ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డబ్బుతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని చెప్పిన బిజెపి రాష్ట్ర ప్రభుత్వం అదే పనుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి రూ. 2100 కోట్లు డ్రా చేసుకుని కుంభకోణానికి పాల్పడింది. రాజస్థాన్‌లో ప్రభుత్వ ఆరోగ్య బీమా కింద ప్రైవేట్‌ ఆసుపత్రులతో కుమ్మక్కయిన బిజెపి నేతలు వ్యాధులు, వైద్యం పేరుతో వేల కోట్ల రూపాయల క్లెయిమ్‌ చేసుకున్నారు. దీనిపై ఆ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం కనీసం స్పందించలేదు. గుజరాత్‌ బిజెపి నేత నళిన్‌ కోటాడియా ‘హవాలా’ లావాదేవీల ద్వారా గుజరాత్‌ సిఐడి రిపోర్టు ప్రకారం రూ.5,000 కోట్లు(వాస్తవంగా రూ.88,000 కోట్లు) అక్రమ డబ్బును బిట్‌కాయిన్‌ (క్రిప్టో కరెన్సీ)ద్వారా మార్చాడు. ఈయన ప్రత్యక్షంగా బిజెపి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, పరారీలో వున్నట్లు పోలీసు రికార్డుల్లో వుండడం బిజెపి మాయాజాలం.
గోవా ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో మనోహర్‌ పారికర్‌ తనకు సన్నిహితుడైన నీలేష్‌ అమోంకర్‌కు చెందిన పట్టో ప్లాజాలోని భవంతిని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ. 5,5,10,538 అద్దెకు తీసుకుంది. ఇది ఆ భూమి అమ్మకం ధర కంటే అధికం కావడం విశేషం. చత్తీస్‌గఢ్‌లో 2015-17 మధ్యకాలంలో 111 చిట్‌ఫండ్‌ కంపెనీల వల్ల 1,33,697 మంది వాటాదార్లు రూ. 484,39,18,122 మోసపోయారు. ఆ రాష్ట్రంలో జరిగిన అతి పెద్ద కుంభకోణం ఇది. లక్ష మందికి పైగా నష్టపోయిన సొమ్మును చిట్‌ఫండ్‌ కంపెనీల నుండి రికవరీ చేయాల్సిన రాష్ట్ర బిజెపి ప్రభుత్వం కనీస ప్రయత్నాలు చేయకపోవడంపై అనేక అనుమానాలు వున్నాయి. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టా 109 పవర్‌ ఇ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసింది. తక్కువ ధరకు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కంపెనీలను కాదని ఒకే టెండర్‌ ద్వారా హెలికాప్టర్‌ ఖరీదులో 30 శాతం డీలర్‌కు కమీషన్‌ ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకుంది. ఇందులో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. మూడు లక్షల కంటే ఎక్కువ విలువ చేసే ఏ కొనుగోలుకైనా ఈ టెండర్‌ ద్వారా కొనుగోలు చేయాలనే మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనను గాలికి వదిలి పాఠశాలల పిల్లలకు అందించే చిక్కీల కాంట్రాక్టులో రూ. 206 కోట్ల కుంభకోణానికి బిజెపి ప్రభుత్వం పాల్పడింది. నాటి బిజెపి మంత్రి పంకజా ముండే అనుచరులు ఈ టెండర్లు దక్కించుకున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌, మహారాష్ట్రలో 2015-16లో పప్పుధాన్యాల సంక్షోభం వచ్చింది. పాలకులే కృత్రిమ కొరత సృష్టించి, ప్రజల అవసరాల పేరుతో 150 నుండి 200 శాతం అధిక ధర చెల్లించి ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానా నుండి వేల కోట్ల అవినీతి జరగడంతో పాటు, ప్రజలపై ధరల భారం పడింది. మధ్యప్రదేశ్‌లో బిజెపి నాయకుడు రాజేంద్ర సింగ్‌ డెంటల్‌ అండ్‌ మెడికల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (డి మాట్‌) పరీక్షాపత్రం లీకేజి కేసులో ముద్దాయి. పది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ కుంభకోణాన్ని సిబిఐ విచారించి సుప్రీంకోర్టుకు అందచేసిన అఫిడవిట్‌లో ”2009 నుండి ఉద్దేశపూర్వకంగా జరిగిన డి మాట్‌ కుంభకోణంలో ప్రతి సంవత్సరం వేలమంది విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ కోటా నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు పొందార”ని చెప్పింది. అయినా ఆ బిజెపి నేతపై చర్యలులేవు.
గుజరాత్‌లో వచ్చిన భూకంపాన్ని అవినీతికి ఉపయోగించుకున్నారు నాటి రాధన్‌పూర్‌ బిజెపి ఎంఎల్‌ఏ. తన నియోజకవర్గ పరిధిలో దెబ్బ తిన్న పాఠశాల పునర్నిర్మాణం పేరుతో ప్రధానమంత్రి సహాయనిధి నుండి 20 లక్షల 78 వేల రూపాయలు పొంది, ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. గుజరాత్‌ హైకోర్టు ఈ ఎమ్మెల్యేను దోషిగా నిర్ధారించి పది శాతం వడ్డీతో మొత్తం సొమ్ము తిరిగి చెల్లించాలని తీర్పు ఇచ్చింది. రాజస్థాన్‌లో బిజెపి మాజీ మంత్రి మదన్‌ దిలావర్‌ కుమారుడు నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ‘నకిలీ పైలట్ల’ నియమాకాల కుంభకోణానికి పాల్పడినట్లు రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేసింది. కేరళ రాష్ట్రంలో బిజెపి నాయకుడు రాకేష్‌ నకిలీ కరెన్సీ కేసులో త్రిసూర్‌లో అరెస్టు అయ్యాడు. రూ.20 నోట్‌ నుండి రూ.2 వేల నోట్ల వరకు నకిలీవి ప్రింట్‌ చేసినట్లు పోలీసు దర్యాప్తులో రుజువైంది. ఆయన బిజెపి అనుబంధ యువజన విభాగానికి నాయకుడయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ఎమ్మెల్సీ సరోజినీ అగర్వాల్‌ భర్త ఓంప్రకాష్‌ అగర్వాల్‌, కుమార్తె నీమా అగర్వాల్‌ సమాజ్‌వాదీ ఆవాస్‌ యోజన కింద ఇల్లు ఇప్పిస్తామని ఒక్కో వ్యక్తి నుండి పది లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసుకున్నారు.
ఇలాంటి వంద కుంభకోణాల వివరాలు ‘కరప్ట్‌ మోడీ.కామ్‌’ వెబ్‌సైట్‌లో వున్నాయి. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన బిజెపి మంత్రులు, నేతలు దర్జాగా అధికారాన్ని చెలాయిస్తుంటే…సమాజ హితం కోసం విలువైన మేధస్సును, జీవిత కాలాన్ని ఫణంగా పెట్టిన మేధావులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు జైళ్లల్లో మగ్గుతున్నారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు మతాన్ని ముసుగుగా వాడుకుంటూ, కార్పొరేట్‌ కంపెనీల సేవలో తరిస్తూ కోట్ల సంపదను అటు కార్పొరేట్లు, ఇటు బిజెపి నేతలు కొల్లగొడుతున్నారు. దేశభక్తి, దైవభక్తి పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అక్రమాలకు, అవినీతికి విచ్చలవిడిగా పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని కేంద్రంలో గద్దె దించడం మనందరి కర్తవ్యం.

వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్‌

➡️