Summer : అప్రమత్తతే రక్ష

imd-report-on-temperature-in-2024-summer-el-nino-conditions-editorial

వేసవిలో ఉష్ణోగ్రతలు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం వుందంటూ వస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత వాతావరణ శాఖతో పాటు, పలు అంతర్జాతీయ సంస్థలు, శాస్త్రవేత్తలు ఈ హెచ్చరికలు చేస్తున్నారు. ఎల్‌-నినో కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు, వడగాల్పుల ఉధృతి నెలల తరబడి కొనసాగే అవకాశం ఉందన్నది ఈ హెచ్చరికల సారాంశం. ఒకటి, రెండు నెలల క్రితమే ఈ దిశలో సంకేతాలు వెలువడ్డాయి. ఈ నెల ఒకటవ తేదీన భారత వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. పలు అంతర్జాతీయ సంస్థలు కూడా దీనినే నిర్ధారిస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు, దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల ఉష్ణొగ్రతల్లో గణనీయమైన పెరుగుదల కనపడుతోంది. అక్కడక్కడ 40 సెల్సియస్‌ డిగ్రీలకు చేరుకున్నట్లు, వడగాల్పులు కూడా వీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో ఏడాది కేడాది వేసవి ప్రభావం తీవ్రంగా మారుతోంది. ఈ మేరకు నివేదికలు, హెచ్చరికలు కొత్త కాదు. అయినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నామమాత్రపు స్పందన కూడా కనిపించకపోవడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. పైగా ఇది ఎన్నికల సంవత్సరం. సభలు, సమావేశాలు, ర్యాలీలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇదంతా సహజం! ఆ ప్రక్రియ విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. మరి ఆ ప్రజలకు రక్షణ ఎలా? ఎండలు ప్రచండమై, వడగాల్పులు ఉధృతమై, జనం పేలాల్లా వేగుతూ, పిట్టల్లా రాలే రోజులొస్తేకానీ ఆలోచించరా? ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయరా!

వాతావరణ శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణుల నుండి అందుతున్న వివిధ రకాల అంచనాలతో పాటు, ఈ వేసవికి సంబంధించి ఇప్పటికే మూడు కీలకమైన హెచ్చరికలు అందాయి. బంగాళాఖాతం, దక్షిణ భారతదేశం, అందులోనూ తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా ప్రస్తావించడడం ఈ హెచ్చరికల్లో కీలకమైన అంశం. మార్చి ఒకటవ తేదీన భారత వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల్లో ఈ నెలలో ఉత్తర భారత దేశంతో పోలిస్తే, దక్షిణ భారత దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తీవ్రమైన వడగాల్పులు చోటుచేసుకుంటాయని పేర్కొంది. బంగాళాఖాతం మీదుగా రికార్డు స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంతర్జాతీయంగా వాతావరణం, ప్రకృతి, పర్యావరణ అంశాలను నివేదించే ‘సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌’ మ్యాగజైన్‌ ఫిబ్రవరి నెలలోనే హెచ్చరించింది. జూన్‌ నెల వరకు ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొంది. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ విడుదల చేసిన మరో నివేదికలో కరేబియన్‌ సముద్రం, దక్షిణ చైనా సముద్రం, అమెజాన్‌, అలస్కాలతో పాటు బంగాళాఖాతం, ఫిలిప్పైన్స్‌ ప్రాంతాల్లో జూన్‌ నెల వరకు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హెచ్చరించారు. ఈ నివేదికలో అభిప్రాయాలు వ్యక్తం చేసిన 90 శాతం మంది శాస్త్రవేత్తలు ఈ ఏడాది ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు సముద్ర తీర ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొనడం దేనికి సంకేతమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ఇదే రకమైన హెచ్చరికలను జారీ చేసింది.

భూ తాపం కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన సంవత్సరంగా 2016 ప్రపంచ చరిత్రలో నిలిచిపోగా, గడిచిన 2023వ సంవత్సరం ఆ రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా 2024 ఆ రికార్డును కూడా బద్దలు కొడుతుందన్న ఆందోళనలు నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. అంటే రానున్నది కేవలం ఎండాకాలం, మండేకాలం మాత్రమే కాదు! అంతకన్నా గడ్డు కాలం! అక్షరాలా నేల నిప్పుల కొలిమిగా మారుతుందన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఈ హెచ్చరికల సారాంశాన్ని ప్రభుత్వాలు అర్ధం చేసుకోవాలి. అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అన్ని రంగాల్లోనూ అవసరమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తాగునీటి నుండి పశుగ్రాసం సరఫరా వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేసే కూలీలపై ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్డు పక్కన బతుకులీడ్చే అభాగ్యులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కీలకమైన ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేయాలి. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఇప్పటికే విస్తృత సమావేశాన్ని నిర్వహించి, ప్రజలతో పాటు వన్యప్రాణులు, పంటల పరిరక్షణకు నిర్దిష్ట చర్యలు చేపట్టింది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేరళను ఆదర్శంగా తీసుకుని తక్షణమే కదలాలి.

➡️