తస్మాత్‌.. జాగ్రత్త!

impacts of antibiotics drugs editorial

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యాన్ని కాపాడటంలో యాంటిబయాటిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. కానీ, వాటినే మితిమీరి వాడితే, విషగుళికలుగా మారుతాయి. మనుషుల ప్రాణాలు తీస్తాయి. ‘అతి సర్వత్ర వర్జయేత్‌..’ అంటారే. అలాగన్నమాట! అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం, అవగాహన లోపం కారణంగా ఏడాదికి ఏడాది వీటి విచ్చలవిడి వినియోగం దేశంలో పెరుగుతూనే ఉంది. దశాబ్దకాలంలో 30శాతం వినియోగం పెరిగినట్టు 2021లో విడుదలైన ప్రపంచ యాంటిబయాటిక్స్‌ నివేదిక నిర్ధారించింది. ఫలితంగా ఔషధాలను నిరోధించే శక్తి పెరిగిన బ్యాక్టీరియా సోకి (యాంటి మైక్రో బియల్‌ రెసిస్టెన్స్‌-ఎఎంఆర్‌) 2019లో దేశ వ్యాప్తంగా 2,97,000 మంది మరణించారు. మరో 10,42,500 మంది ఎఎంఆర్‌ సంబంధిత కారణాలతో మృతి చెందారు. ఆ తరువాత సంవత్సరాల్లో కూడా ఈ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిపుణుల అంచనా ప్రకారం యాంటి మైక్రో బియల్‌ రెసిస్టెన్స్‌ కారణంగా 2050 నాటికి ఏటా కోటిమంది మరణిస్తారని అంచనా! మిగిలిన అన్ని కారణాలతో మరణించేవారి అందరి సంఖ్యను కలుపుకున్నా ఎఎంఆర్‌ మరణాల కన్నా తక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. యాంటిబయాటిక్స్‌ దుష్ప్రభావం దేశంపై ఏ స్థాయిలో ఉందో, భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉండబోతోందో అర్ధం చేసుకోవడానికి ఈ గణాంకాలే చాలు! అయినా, కరోనా సమయంలో అజిత్రోమైసిన్‌ను ఇష్టం వచ్చినట్లు వాడేసిన దేశాల్లో మన దేశమూ ఒకటి!

2019లో ది లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌ సౌత్‌, ఈస్ట్‌ ఆసియా ప్రచురించిన అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా యాంటిబయాటిక్స్‌ వాడే దేశాల్లో మన దేశానిదే మొదటి స్థానం. ప్రాణాలను కాపాడే ఈ మందులను సరైన పద్ధతుల్లో వాడకపోవడంలో కూడా మనమే అగ్రస్థానంలో ఉన్నాం. వినియోగంలోనే కాదు. ఉత్పత్తిలో కూడా మన దేశానిది మొదటి స్థానమే. డాక్టర్‌ చిట్టీ కూడా లేకుండా ఎక్కడబడితే అక్కడ యాంటిబయాటిక్స్‌ను విక్రయించే దేశాల జాబితాలోనూ మన దేశం అగ్రస్థానంలో నిలిచింది. మందుల షాపుల్లోనే కాకుండా సూపర్‌బజార్లలో, కొన్ని చోట్ల చిల్లర దుకాణాల్లో కూడా ఇవి లభిస్తుండటం పట్ల సర్వే బృందం విస్మయం వ్యక్తం చేసింది. ఈ తరహా అమ్మకాల్లో ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి వ్యత్యాసం ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాల్లోనూ సరైన పద్ధతుల్లో వీటి వినియోగం జరగడం లేదని నివేదిక పేర్కొంది. 2021 నవంబర్‌ నుండి ఏప్రిల్‌ 2022 వరకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సిడిసి) దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోనూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ ఆస్పత్రుల్లో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా 55శాతం మంది రోగులకు వ్యాధి నివారణకు కాకుండా. కేవలం ముందుజాగ్రత్త చర్యగా యాంటిబయాటిక్స్‌ను ఇస్తున్నట్లు తేలింది. సర్వే నిర్వహించిన 20 ఆసుపత్రుల్లో పదమూడింటిలో 70 శాతం మంది రోగులకు కనీసం ఒక్క యాంటిబయాటిక్‌ అయినా వాడుతున్నారు. యాంటిబయాటిక్స్‌ను ఎక్కువగా వాడటం వల్ల బ్యాక్టీరియాలు జన్యుపరిణామం చెంది, మందులను తట్టుకునే శక్తిని పొందుతాయి. దీంతో శక్తివంతమైన యాంటిబయాటిక్స్‌ వాడాల్సి వస్తుంది. చివరకు వాటిలో కొన్ని ఏ మందులకు లొంగకుండా మనుషుల్ని చంపే శక్తిని కూడా పొందుతాయి. వీటిని ‘సూపర్‌ బగ్స్‌’ అని పిలుస్తున్నారు. ఈ తరహా ‘సూపర్‌ బగ్స్‌’ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా మన దేశంలో గణనీయంగానే ఉంది. సాధారణంగా ఐసియుల్లో చికిత్స పొందే ప్రతి పది మంది రోగుల్లో నలుగురికి ఔషధ నిరోధక బ్యాక్టీరియా సోకి ఉంటుందని అంచనా!

1928లో పెన్సిలిన్‌ను కనుగొన్న అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ ‘దీనిని సరైన రీతిలో వాడకపోతే మేలు కన్నా, కీడే ఎక్కువ చేస్తుంది.’ అని హెచ్చరించారు. ఆ హెచ్చరిక ఒక్క పెన్సిలిన్‌కే కాదు. అన్ని రకాల యాంటిబయాటిక్స్‌కు వర్తిస్తుంది. సుమారు వంద సంవత్సరాల అనుభవం నేర్పిన పాఠం ఇదే! ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యాంటిబయాటిక్స్‌ వినియోగంలో సరైన నియంత్రణ చర్యలు పాటించాలని అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి సూచించినా చలనం లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ దిశలో కఠినమైన, శాశ్వత చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడాలి. లేనిపక్షంలో భావి తరాలపై మనం ప్రయోగించే బయో టెర్రరిజమ్‌గా యాంటిబయాటిక్స్‌ వినియోగం మారే ప్రమాదం ఉంది.

➡️