వారసత్వ పన్ను

May 7,2024 05:32 #coments, #Congress, #edit page, #PM Modi

వారసత్వ పన్నుపై మోడీ చేస్తున్న ప్రకటనలు అల్పత్వాన్నే చూపిస్తున్నాయి. ఒక దేశ ప్రధాని నుండి ఈ స్థాయి ప్రకటనలు రావడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆ స్థాయిలో ఉన్నవారు చేయదగిన ప్రకటనలు కావవి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శామ్‌ పిట్రోడా వారసత్వ పన్ను ప్రవేశపెట్టే విషయమై ప్రస్తావించారు. దాన్ని వ్యతిరేకించేవారు వేరే ఏమైనా హేతుబద్ధ వాదనలు చేయవచ్చు. నిజానికి ఇటువంటి ప్రతిపాదన మీద లోతైన చర్చ జరగవలసిన అవసరం కూడా ఉంది. కాని మోడీ ప్రతిస్పందనలో అటువంటి వాదనలేమీ లేవు సరికదా చాలా నీచమైన వ్యాఖ్యానాలు చేసి అటువంటి ప్రతిపాదన చేయడమే అర్ధం లేనిదన్న అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నించారు. లోతుగా జరగవలసిన చర్చను ఒక దురుద్దేశ పూరితమైన ప్రయత్నంతో అపహాస్యంపాలు చేయబూనుకున్నారు. మోడీ చేసిన రెండు వ్యాఖ్యానాలు ఇలా ఉన్నాయి: ప్రేక్షకులలో కూర్చున్న మహిళలను ఉద్దేశించి వారసత్వ పన్ను ప్రవేశపెడితే వారి తాళిబొట్లు లాక్కుంటారని, చచ్చిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళని విడిచి పెట్టదని మోడీ అన్నారు. ఇందులో మొదటి వ్యాఖ్యానం శుద్ధ తప్పు. ఎందుకంటే వారతస్వ పన్ను ఒక స్థాయిని దాటి అధికంగా ఉన్న సంపదమీదనే విధిస్తారు. ఇక రెండోది కేవలం ప్రేక్షకుల నుండి వ్యతిరేకతను రప్పించడం కోసం మాత్రమే చేసినది. అది ఏరకంగా చూసినా వాదన అనిపించుకోదు. ఒక వ్యక్తి మరణానంతరం అతడి వారసులకు సంక్రమించే సంపదమీద పన్ను విధించడంలో తప్పు ఏమీ లేదు.
ప్రస్తుత కాలంలో ఆర్థిక పరిస్థితిని బలపరచడానికి తీసుకోవలసిన గట్టి చర్యల సంగతి చూద్దాం. ఆదాయాల్లోను, సంపద లోను అంతరాలు నయా ఉదారవాద కాలంలో బాగా పెరిగిపోయాయని దాదాపుగా అందరూ అంగీకరి స్తున్నారు. భారతదేశంలోనైతే ఈ విధానాల ఫలితంగా నిష్ట దారిద్య్రంలోకి వచ్చి పడినవారు కూడా ఎక్కువయ్యారు. ఎన్డీయే పాలనాకాలంలో ఈ దారిద్య్రం మరీ కొట్టొచ్చినట్టు పెరిగింది. 2014-15 నుండీ గ్రామీణ శ్రామికుల ఆదాయాల్లో పెరుగుదల నిలిచిపోయి స్తంభించిపోయాయన్న వాస్తవం గురించి ఇదివరకే మనం చెప్పుకున్నాం. వాస్తవ ధరల పెరుగుదలను యథాతథంగా చూపించే విధంగా గనుక ధరల సూచీని సరి చేస్తే గ్రామీణ ప్రజల వేతనాల్లో నిజానికి తరుగుదల కనిపిస్తుంది. శ్రామికుల బేరసారాల శక్తి కూడా సన్నగిల్లింది. నిరుద్యోగం ఈ కాలంలో బాగా పెరిగిపోవడం వల్లనే ఇది జరిగింది. నిజవేతనాల్లో తరుగుదలతో పాటు నిరుద్యోగం కూడా పెరగడం వలన నిష్ట దారిద్య్రం గత ఏభై సంవత్సరాలలోనూ ఎన్నడూ లేనంతగా పెరిగిపోతోంది.
నయా ఉదారవాద విధానాలను యథేచ్ఛగా కొనసాగనిచ్చిన ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడింది. అందుచేత ప్రభుత్వం కొన్ని ఆర్థిక పరమైన చర్యల ద్వారా జోక్యం కల్పించుకుని ఆ విధానాలను కట్టడి చేయవలసి వుంటుంది. సంపన్నుల మీద పన్నులను పెంచి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదలకు బదిలీ చేయడమో, లేక వారికి ప్రభుత్వ సహాయాన్ని పెంచడమో చేయాల్సి వుంటుంది. దారిద్య్రం తీవ్రతరమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి ఆర్థిక జోక్యానికి గనుక ప్రభుత్వం పూనుకోకుంటే అది శ్రామిక ప్రజలకు తీరని ద్రోహం చేయడమే ఔతుంది. సంపన్నుల మీద ప్రత్యక్ష పన్నులను విధించడం ప్రభుత్వం చేయవలసిన విధి. అలాగాక, పరోక్ష పన్నులను పెంచితే దాని భారం మళ్ళీ ఆ నిరుపేదల మీదే పడుతుంది.
ఈ ప్రత్యక్ష పన్నులను విధించే మార్గం ఏమిటి? ఆదాయాల మీద గాని, సంపన్నులు చేసే వ్యయాల మీద గాని, వారివద్ద ఉన్న సంపద మీద గాని, కంపెనీల షేర్ల రూపంలో ఉన్న సంపద మీద గాని, లేదా వారసత్వంగా సంక్రమించిన సంపద మీద గాని పన్నులు విధించవచ్చు. ఒకవేళ కంపెనీల షేర్ల రూపంలో ఉన్న సంపదను మినహాయించాలనుకుంటే తక్కిన రూపాల్లోని సంపద మీద విధించే పన్ను రేటును మరింత పెంచాల్సి వుటుంది. ఐతే ఇదేమంత మంచి ఆలోచన కాదు. కంపెనీల షేర్లతో సహా అన్ని రూపాల సంపదల లావాదేవీల మీదా పన్నులను విధిస్తే అది అధిక సంపన్నుల మీద ఎక్కువగా భారం పడుతుంది. కంపెనీల షేర్లను మినహాయిస్తే అప్పుడు కావలసిన ఆదాయాన్ని సమకూర్చుకోడానికి పన్ను పరిధిలోకి ఇంకా ఎక్కువ మందిని తీసుకురావలసి వస్తుంది. సంపద పన్ను విధించినందు వలన పెట్టుబడుల ప్రవాహం మీద ఎటువంటి ప్రభావమూ ఉండదు (ఎందుకంటే పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రభావితం చేసే అంశాలు-మార్కెట్‌ లో వృద్ధి అంచనాలు, పన్నులు పోను మిగిలే లాభాల రేటు, వడ్డీ రేటు వగైరాలేవీ సంపద ఎంత ఉంది అన్న అంశంమీద ఆధారపడి ఉండవు). అదే లాభాల మీద పన్ను పెంచితే అప్పుడు పెట్టుబడులు తగ్గిపోవచ్చు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతారు. పైగా సంపదలో, ఆదాయాల్లో అసమానతలు బాగా పెరిగిపోతే ఆర్థిక వ్యవస్థ సమతూకం దెబ్బ తింటుంది గనుక ఎటుతిరిగీ ఆ అసమానతలను తగ్గించాల్సిందే. అందుకు సంపదమీద, వారసత్వ సంపద మీద పన్నులు వేయడం తప్పదు.
పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్ధించేవారంతా ఒక వాదనను బలంగా ముందుకు తెస్తారు. సమాజంలో తక్కినవారెవరికీ లేని ప్రత్యేక లక్షణాలు పెట్టుబడిదారులకు ఉంటాయని, ఆ లక్షణాల వల్లనే వారు లాభాలను ఆర్జించ డానికి తాపత్రయ పడతారని, సమాజానికి అది తోడ్పడుతుందని, అందుచేత ఎక్కువ సంపదను కలిగి వుండే అర్హత వారికి ఉందని అంటారు. ఇది మార్క్సిస్టు దృక్పథానికి పూర్తిగా వ్యతిరేకం. కార్మికుల శ్రమను కొల్లగొట్టడం ద్వారా పెట్టు బడిదారులు లాభాలను ఆర్జించగలుగుతున్నారని మార్క్సిజం అంటుంది. ఇంతకూ వాళ్ళు చెప్పే ఆ ‘ప్రత్యేక’ లక్షణాలేమిటి? కొత్త పద్ధతులను ఎప్పటికప్పుడు ప్రవేశ పెడుతూ తమ లాభాలను పెంచుకోగలగడమే ఆ ప్రత్యేక లక్షణం అని స్కంపీటర్‌ అన్నాడు. పెట్టుబడులు పెట్టి రిస్క్‌ తీసుకునే లక్షణం ఉందని మరొకరు అన్నారు.
వాదన కోసం వాళ్ళు చెప్పినట్టు పెట్టుబడిదారుడికి ప్రత్యేక లక్షణాలు ఉన్నం దువల్లనే అతడి దగ్గర సంపద బాగా పోగుబడిందనుకుందాం. ఐతే, అతగాడి దగ్గర సంపద పోగుబడినంత మాత్రాన అతడి సంతానానికి అతడి ప్రత్యేక లక్షణాలు సంక్రమించాయని అనుకోలేం. అతడి సంతానం స్వతంత్రంగా, అంటే, తండ్రి సంపదతో నిమిత్తం లేకుండా తమ ప్రత్యేక లక్షణాలను ముందు రుజువు చేసుకోగలగాలి. అప్పుడే తక్కిన కొత్తగా రంగంలోకి వస్తున్న పెట్టుబడిదారులతో సమాన స్థాయిలో మార్కెట్‌లో పోటీ పడడం సాధ్యమౌతుంది.
అలా కాకుండా, తమ తాత ముత్తాతల కాలంనుండీ పోగేసిన సంపదకు వాళ్ళు వారసులుగా ఆ సంపదనంతటికీ హక్కుదారులు అయ్యారనుకుందాం. అప్పుడది పెట్టుబడిదారీ సమర్ధకులు చెప్పే (పెట్టుబడిదారులకుండే ప్రత్యేక లక్షణాల) సిద్ధాంతానికి వ్యతిరేకం కాదా? వారికి ప్రత్యేక లక్షణాలు ఉన్నదీ లేనిదీ రుజువు కాకుండానే వారు సంపన్నులు ఎలా అవగలుగుతారు? అందుచేత వారసత్వ సంపద అనేది పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్ధించేవారి సిద్ధాంతానికి సైతం విరుద్ధం.
అందుచేత నైతికంగా తమ పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్ధించుకోడానికి, చాలా సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో, తమకు బొత్తిగా ఇష్టం లేకపోయినప్పటికీ, వారసత్వ పన్నును ప్రవేశపెట్టారు. ఉదాహరణకు, జపాన్‌ దేశంలో వారసత్వ పన్ను 55 శాతం దాకా వసూలు చేస్తున్నారు. కాని భారతదేశంలో ఎటువంటి వారసత్వ పన్నూ లేదు. సంపద పన్ను కూడా నామమాత్రమే. సంపద పన్నుకి న్యాయం జరగాలంటే వారసత్వ పన్ను తోడుగా ఉండాలి. వారసత్వ పన్ను అనేది లేకుండా కేవలం సంపద పన్ను మాత్రమే విధిస్తే ఆ సంపదను వారసులందరూ చిన్న చిన్న ముక్కలుగా పంచుకున్నట్టు చూపించి ఆ సంపదపన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంటారు. ఒక్కోసారి అసలు యజమాని ఇంకా జీవించి ఉన్నప్పుడే పంపకాలు జరిగిపోతాయి.
కాబట్టి సంపదను బిడ్డల పేరనో, మిత్రుల పేరనో బదిలీ చేయక మునుపే వారసత్వ పన్ను ఆ సంపద మీద విధించాలి. ఒకానొక స్థాయిలో పోగుబడిన సంపదమీదనే వారసత్వ పన్ను విధించాలి. అంతకు తక్కువ ఆస్తి ఉంటే దానిని మినహాయించాలి. లేకపోతే మోడీ వంటి వారు మంగళసూత్రం కూడా ఆస్తే కనుక అది కూడా లాక్కుంటారు అన్న అర్ధం లేని వాదనలను తెస్తారు. సామాన్య ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. ఆస్తిపరుడు చనిపోయిన అనంతరం మాత్రమే వర్తించేలా కాకుండా, అతడు జీవించి వుండగానే ఆస్తిని పంపకాలు చేసినప్పుడు కూడా వర్తించేలా వారసత్వ పన్ను అమలు చేయాలి.
ఈ సంపద పన్నును గాని, వారసత్వ పన్నును గాని అమలు చేయడం కష్టం అనే వాదనను కొందరు ముందుకు తెస్తారు. పైగా దీని నుండి చాలా తక్కువ మొత్తంలో పన్ను వసూలౌతుందని వారంటారు. అందుచేత భారతదేశంలో పన్ను వసూళ్ళ పద్ధతులను అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన సవరణలన్నీ చట్టాలలో తెచ్చి కచ్చితంగా ఈ పన్ను వసూలే అయ్యేట్టు కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాల్సి వుంటుంది. జపాన్‌ వంటి దేశాల్లో అది ఎలా అమలు చేయగలుగుతున్నారో కూడా పరిశీలించాలి.
ఈ వారసత్వ పన్ను డిమాండు మన జాతీయోద్యమ డిమాండ్లలో ఒకటిగా ఉంది. 1931లో జరిగిన కరాచీ జాతీయ కాంగ్రెస్‌ మహాసభల్లో స్వతంత్ర భారతదేశంలో పౌరులందరూ సమానులుగా ఉండాలని, చట్టం ముందు అందరూ సమానులుగానే పరిగణింపబడాలని, రాజ్యం దృష్టిలో అన్ని మతాలనూ ఒకే విధంగా చూడాలని చెప్పారు. వాటితోబాటు ”ఒకానొక పరిమితికి మించిన ఆస్తులు ఉన్నవారి నుండి వారి తదనంతరం ఆస్తులు పొందే వారసులపై పన్ను విధించాలి” అని కూడా ప్రకటించారు. కరాచీ జాతీయ మహాసభలు ఆనాటి మన దేశ రాజకీయ జీవితం మీద వామపక్ష భావజాలం ఆధిక్యత కలిగి వుండడాన్ని సూచిస్తాయి. జాతీయ కాంగ్రెస్‌ పార్టీ లోపల, వెలుపల కూడా ఈ ఆధిక్యత కనపడుతుంది. ఈ కరాచీ మహాసభలు 1931 మార్చి 26న జరిగాయి. భగత్‌సింగ్‌, అతడి సహచరులను ఉరితీసిన మూడు రోజుల అనంతరమే జరిగిన మహాసభలు ఇవి. ఈ తీర్మానాలకు ప్రజానీకం నుండి మొత్తంగా ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించినవారు జవహర్‌లాల్‌ నెహ్రూ. మహాత్మా గాంధీ ఈ తీర్మానాన్ని లోతుగా పరిశీలించి ఆమోదించిన తర్వాతే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ సభలకు అధ్యక్షుడు వల్లభారు పటేల్‌. ఈ చరిత్ర పరిశీలిస్తే మన ప్రధాని మోడీకి వలస పాలనపై సాగిన జాతీయోద్యమం గురించి ఎటువంటి అవగాహనా లేదని అర్ధం ఔతోంది.
ప్రస్తుత పరిస్థితిలో సంపద పన్ను, దానితోబాటు వారసత్వ పన్ను విధించడం చాలా అవసరం. కేవలం పెరుగుతున్న అసమానతలను అరికట్టడానికే కాదు, దేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా మలచడానికి కూడా అవసరం. కరాచీ తీర్మానం ఆశించిన ఆర్థిక న్యాయం అప్పుడే సాధ్యం.

ప్రభాత్‌ పట్నాయక్‌

(స్వేచ్ఛానుసరణ)

➡️