ఎర్ర సముద్రంలో పరిణామాలు

israel palestine conflicts impact on exports on red sea editorial

 

అగ్రరాజ్య ఆధిపత్య క్రీడలో భాగంగా గాజాలో ఇజ్రాయిల్‌ గత 80 రోజులుగా సాగిస్తున్న నరమేధం ప్రపంచ యవనికపై విపరీత పరిణామాలకు దారి తీస్తోంది . 21 వేల మందికిపైగా పాలస్తీనీయులను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయిల్‌ హంతక దాడులను ఆపాలంటూ హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రం గుండా రాకపోకలు సాగించే ఇజ్రాయిలీ సరకు రవాణా నౌకలతో బాటు, దానికి మద్దతు ఇస్తున్న దేశాల నౌకలను కూడా లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.

ప్రపంచమంతా గర్హిస్తున్నా, దాడులు ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి తీర్మానాలు చేస్తున్నా ఇజ్రాయిల్‌ పట్టించుకోవడం లేదు. ఇజ్రాయిల్‌కు బాహాటంగా ఆయుధాలు, డబ్బు అందిస్తున్న అమెరికా తక్షణం కాల్పులు విరమించాలన్న ఐరాస భద్రతా మండలి తీర్మానాలన్నింటినీ వీటో చేస్తోంది. వైద్యసాయం, ఆహారం అందకుండా 20 లక్షలమందికిపైగా ఆకలి కోరల్లో చిక్కుకునే పరిస్థితికి కారణమైంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గి మోడీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టడానికి సిద్ధమైంది. సైద్ధాంతికంగా తనకు సన్నిహితమైన పచ్చి మిత వాద నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నది.

ఎర్రసముద్రంలో సరుకు రవాణా నౌకలపై హౌతి తిరుగుబాటు దారులు జరుపుతున్న దాడులకు అమెరికాతో బాటు దానికి తందాన తాన అంటున్న మోడీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ప్రపంచ నౌకా రవాణాలో 30 శాతం, వ్యాపారంలో 12 శాతం, సముద్ర జలాలపై పెట్రోలియం వాణిజ్యంలో 10 శాతం మధ్యదరా సముద్రాన్ని హిందూ మహాసముద్రంతో కలిపే ఎర్రసముద్రం మీదుగానే సాగుతున్నాయి. మోడీ ప్రభుత్వ తప్పుడు విదేశాంగ విధానం ఫలితంగా భారత్‌ నావికా వాణిజ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇజ్రాయెల్‌ వెళ్తున్న నౌకలే ప్రధాన లక్ష్యమని అంటున్నా, దానితో అంటకాగుతున్న పలు దేశాల నౌకలపై దాడులు జరుగుతున్నాయి. గాజాలో ఇజ్రాయిల్‌ హంతక దాడులను తక్షణం నిలిపివేసేలా చూడడమేనని హౌతీ తిరుగుబాటు దారులు ప్రకటించారు. గత వారం అరేబియా సముద్రం మీదుగా ఇండియా వస్తున్న వాణిజ్యనౌక ఎంవి కెమ్‌ ప్లూటో మీద గుజరాత్‌కు నాలుగువందల కిలోమీటర్ల దూరంలో డ్రోన్‌ దాడి జరిగింది. ఆ తరువాత కొద్దిగంటల్లోనే సౌదీనుంచి వస్తున్న ఎంవి సాయిబాబా మర్చంట్‌ నౌక మీద ఎర్రసముద్రంలో దాడి జరిగింది. సౌదీ యువరాజు మొహ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు భారత ప్రధాని ఫోన్‌ చేసి ఎర్ర సముద్రంలో భారతీయ నౌకలకు భద్రత కల్పించేలా చూడాలని అభ్యర్థించారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?

గత మూడునెలల్లో 15 నౌకలు ఎర్ర సముద్రంలో దాడులకు గురయ్యాయి. ముఖ్యంగా బాబ్‌ ఎల్‌ మండెబ్‌ మార్గంలో రవాణా ప్రమాదంలో పడింది. దీంతో ఎర్రసముద్రాన్ని వదిలి, గతంలో మాదిరిగా గుడ్‌హౌప్‌ అగ్రాన్ని చుట్టి నౌకలు రాకపోకలు సాగించే విషయం ఆలోచిస్తున్నాయి. కంపెనీలు ప్రతీ కంటైనర్‌మీద ఏడువందల డాలర్ల సర్‌చార్జి విధిస్తూండటం, బీమా కంపెనీలు రేట్లు పెంచడం వంటివి కూడా తోడైనందున ఇది ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోసే ప్రమాదముంది. హౌతీ తిరుగుబాటు దారుల చర్యను ఆసరా చేసుకుని ఈ సముద్రంపై తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి అమెరికా ఒక కొత్త కూటమిని తెరపైకి తెచ్చింది. దీనిలో భాగమే పది దేశాలతో మేరిటైమ్‌ కొయిలేషన్‌ ఏర్పాటు. ఆయా దేశాల యుద్ధనౌకలతో గస్తీ తిరుగుతూ సరుకు రవాణాకు రక్షణ కల్పిస్తామని అమెరికా చెబుతోంది. ఏతావాతా అమెరికా, ఆయా దేశాలు యుద్ధనౌకలను రక్షణకవచాలుగా పంపినా, భారతదేశం గస్తీపెంచినా దాడులను పూర్తిగా నిరోధించడం, ఈ మార్గాన్ని గత సురక్షిత స్థాయికి తేవడం అంత తేలికైన విషయమేమీ కాదు. హౌతీని బూచిగా చూపి ఈ ప్రాంతంపై తమ గుత్తాధిపత్యాన్ని చలాయించడం కోసం అమెరికా, దాని మిత్ర పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్‌ దుష్ట కూటమిలో భారత్‌ కూడా చేరడం మన దేశ ప్రయోజనాలకే పూర్తి విరుద్ధం. ఈ దుష్ట కూటమి నుంచి భారత్‌ వెంటనే వెనక్కి రావాలి. ఆ దిశగా మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి.

➡️