ప్రమాదకర క్రిమినల్‌ చట్ట నిబంధనలపై పోరాడదాం

Jan 10,2024 07:15 #Editorial

మోటారు వాహనాల చట్ట సవరణ-2019 సందర్భంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యం అని ప్రభుత్వం చెప్పింది. పార్లమెంటు లోపల, బయట రవాణా శాఖామాత్యులు పదే, పదే ఈ విషయం చెప్పారు. ఆ చట్టంలోని భారీగా పెంచిన జరిమానాలు అమలులోకి వచ్చి 4 సంవత్సరాలయింది. కానీ ప్రమాదాలు తగ్గలేదు సరికదా, 2022లో పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. అందుచేత ప్రమాదాలకు అసలైన కారణాలను పరిష్కరించకుండా శిక్షలు పెంచితే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పటం మోసగించడమేనని అనుభవం రుజువు చేస్తున్నది.

            ఏదైనా ఒక చట్టం చేయాలన్నా లేక ఉన్న చట్టంలో సవరణలు చేయాలన్నా ప్రభుత్వం ముందుగా లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియాను సంప్రదించాలి. అలాగే ఆ చట్టం వర్తించే తరగతికి చెందిన సంస్థలు, ప్రముఖులతో సంప్రదించాలి. ప్రస్తుత కొత్త క్రిమినల్‌ చట్టాలు తేవడానికి ముందు ఈ సాంప్రదాయాన్నీ ఉల్లంఘించారు. కనీసం పార్లమెంటులోనైనా సవివరమైన చర్చ జరగాలి. కానీ మొత్తం ప్రతిపక్షాన్ని సభ నుండి గెంటి వేసి ఈ చట్టాలను ఆమోదింప చేసుకున్నారు. 2023 డిసెంబర్‌ 21న పార్లమెంటు ఆమోదం పొందగా 4 రోజుల్లోనే అంటే డిసెంబర్‌ 25న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

కొత్త చట్టాలు

బ్రిటిష్‌ కాలంనాటి చట్టాలు ఇంకానా అంటూ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, ఎవిడెన్స్‌ యాక్ట్‌, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ల స్థానంలో 3 కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఒక వ్యక్తి ఉద్దేశ పూర్వకం కాని, నిర్లక్ష్యం లేదా దురుసు ప్రవర్తన వల్ల మరొకరు చనిపోతే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 1860 (బ్రిటిష్‌ కాలం నాటి) చట్టం లోని సెక్షన్‌ 304 (ఏ) ప్రకారం 2 సంవత్సరాల దాకా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భారతీయ న్యాయ సంహిత-2023 లోని సెక్షన్‌ 106(1) ప్రకారం 5 సంవత్సరాల దాకా జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట. అలా వుంది నేటి భారతీయ చట్టం.

ఇక కొత్త చట్టంలోని సెక్షన్‌ 106(2) ప్రకారం ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కాకపోయి నప్పటికీ నిర్లక్ష్యం, దురుసు చర్య వల్ల ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంలో పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు తెలియజేయకుండా తప్పించుకుంటే (హిట్‌ అండ్‌ రన్‌) సదరు ముద్దాయికి 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. ఈ సెక్షన్‌ డ్రైవర్ల పాలిటి ఉరితాడు అని డ్రైవర్లందరూ గుర్తించడంతో ఒక్కసారిగా దేశ వ్యాపిత ఆందోళన ప్రారంభమైంది. కొత్త చట్టంలోని సెక్షన్‌ 106(1), (2) లలోని శిక్షలు బ్రిటిష్‌ కాలం నాటి చట్టం కంటే శిక్షలు అధికం. ఇదేనా భారతీయత ?

అసలు రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ?

దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలలో 90 శాతం మానవేతర కారణాలతో జరుగుతున్నాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి), ఢిల్లీ లోని ప్రమాదాలపై అధ్యయనం చేస్తున్న ప్రముఖ ప్రొఫెసర్‌ గీతం తివారి రుజువు చేశారు. వారు భారత దేశంలోనే కాక వివిధ దేశాలలో కూడా రోడ్డు ప్రమాదాలపై అనేక ప్రసంగాలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు 3 ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

1. రహదారి నిర్మాణ లోపాలు: ప్రపంచంలో రోడ్డు నిర్మాణ నిబంధలకు విరుద్ధంగా మన దేశంలో రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులు గ్రామాలు /పట్టణాల /జనావాసాల మధ్యలోంచి నిర్మాణం చేయడానికి వీలులేదు. కానీ మన దేశంలో అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. కానీ మన దేశంలో ఇలాంటి ఉల్లంఘనలకు లెక్క లేదు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా రోడ్డు నిర్మాణాలు చేస్తున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు కోకొల్లలు. ఉదాహరణకు కర్నూలు హైదరాబాద్‌ మధ్య కృష్ణా నది బ్రిడ్జి వద్ద జరిగిన జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం. 40 మందికి పైగా సజీవ దహనం అయ్యారు. దీనిపై అధ్యయనం చేసిన ప్రభుత్వ కమిటీ నివేదికలో నిగ్గు తేలిందేమిటి? ప్రమాదం జరిగిన దగ్గర రోడ్డు వెడల్పు తగ్గింది. జాతీయ రహదారుల మధ్యలో అలా రోడ్డు ఇరుకుగా వుండకూడదు. పైగా కల్వర్టుకు కట్టిన గోడకు వాడిన ఇనుప చువ్వలు బయటకు ఉన్నాయి. దాంతో బస్సు ఆ కల్వర్టుకు గుద్దుకొని బయటకు ఉన్న ఇనుప చువ్వలకు రాసుకొని నిప్పు చెలరేగడం, బస్సు ఆయిల్‌ ట్యాంక్‌ పగిలి తగలబడటం క్షణాలలో జరిగిపోయాయి. ఆ రహదారి నిర్మించిన కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యా లేదు. మరొక ఉదాహరణ ఏమంటే విశాఖపట్నం-శ్రీకాకుళం మధ్య జాతీయ రహదారిపై ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు యర్రం నాయుడు మరణించారు. అందుకు కారణం ఆ జాతీయ రహదారిలో ఎదురుగా వస్తున్న లారీ కుడివైపుకు తిరిగి శ్రీకాకుళం వైపుకు మల్లుతున్న సమయంలో ఎర్రం నాయుడు కారు రావడంతో ప్రమాదం జరిగింది. జాతీయ రహదారులలో ఎక్కడంటే అక్కడ కుడి వైపుకు తిరగడానికి అనుమతించ కూడదు. కానీ రోడ్డు నిర్మాణంలోనే చాలా చోట్ల జాతీయ రహదారులలో కుడివైపుకు తిరగడానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. బలిపశువులయింది, అవుతున్నది డ్రైవర్లు. అన్ని రకాల, వివిధ వేగాలతో వెళ్లే వాహనాలన్నీ ఒకే రోడ్డుపై వెళ్ళాల్సి వస్తోంది. అలా కాకుండా కనీసం చిన్న వాహనాలు ఒక లైన్‌లో, పెద్ద వాహనాలు మరొక లైన్‌లో వెళ్లే ఏర్పాటు వుంటే ప్రమాదాలు కొంతవరకు తగ్గించవచ్చు. మరొక కారణం చూద్దాం. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే దేశంలోని రోడ్లలో జాతీయ రహదారులు కేవలం 2 శాతం మాత్రమే. కానీ రోడ్డు ప్రమాదాలలో 62 శాతం ఈ రహదారులపైనే జరుగుతున్నాయి. నేషనల్‌ పర్మిట్‌ లారీలకు ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే నిబంధనను ఈ కారణంతో ప్రభుత్వం ఇటీవల తొలగించింది. రోజుల తరబడి డ్రైవ్‌ చేయాల్సి రావడం ఎంత ప్రమాదకరం? కనీసం విశ్రాంతికి, అల్పాహారం/భోజనాలకు రహదారి మధ్యలో ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయదు. ఇవి కూడా ప్రమాదాలకు కారణాలు.

జరిమానాలు/శిక్షలు భారీగా పెంచితే ప్రమాదాలు తగ్గుతాయా ?

మోటారు వాహనాల చట్ట సవరణ-2019 సందర్భంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యం అని ప్రభుత్వం చెప్పింది. పార్లమెంటు లోపల, బయట రవాణా శాఖామాత్యులు పదే, పదే ఈ విషయం చెప్పారు. అంతేకాదు. ఒక సందర్భంలో పార్లమెంటులో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రమాదాలు తగ్గించి ప్రాణాలు కాపాడటానికి చట్ట సవరణ చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి అంటే ప్రజల ప్రాణాలు ప్రతిపక్షాలకు పట్టదా అని ప్రశ్నించారు. ఆ చట్టంలోని భారీగా పెంచిన జరిమానాలు అమలులోకి వచ్చి 4 సంవత్సరాలయింది. కానీ ప్రమాదాలు తగ్గలేదు సరికదా, 2022లో పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. అందుచేత ప్రమాదాలకు అసలైన కారణాలను పరిష్కరించకుండా శిక్షలు పెంచితే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పటం మోసగించడమేనని అనుభవం రుజువు చేస్తున్నది.

విచారణా విధానం

అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలలో రోడ్డు ప్రమాదాలపై ప్రాథమిక విచారణకు పోలీసులతో పాటు నిపుణుల కమిటీ ఉంటుంది. నిష్పక్షపాతంగా ప్రమాదాలకు వాస్తవ కారణాలు పరిశీలించాకే వాటి ఆధారంగా ఛార్జిషీటు దాఖలవుతుంది. కానీ మన దేశంలో పోలీసులు చెప్పిందే వేదం. గుడ్డిగా డ్రైవరే బాధ్యుడని ఛార్జిషీటు దాఖలవుతుంది. తదనుగుణంగా శిక్షలు ఉంటున్నాయి. వీటన్నిటిని వదిలివేసి కేవలం డ్రైవర్లను ముద్దాయిలను చేస్తే ప్రమాదాలు తగ్గవు. పైగా శిక్షలకు భయపడి డ్రైవర్‌ వృత్తికి రావడానికి అంగీకరించడం లేదు. ఇప్పటికే పెద్ద వాహనాలకు అవసరమైన డ్రైవర్లలో 30 శాతం తక్కువ డ్రైవర్లు ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి.

ప్రమాదాలకు అసలు కారణాలను పరిశీలించి, సమస్యను పరిష్కరించి ప్రజలలో రహదారి భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించడం మీద ప్రభుత్వం దృష్టి సారించాలి. అందుకు చైతన్యవంతమైన ప్రజలే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అందుకు సిద్ధం కావాలి.

( వ్యాసకర్త ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి ) ఆర్‌. లక్ష్మయ్య
( వ్యాసకర్త ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి ) ఆర్‌. లక్ష్మయ్య
➡️