అందరికీ వైద్యం!

Jun 29,2024 05:05 #editpage

డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా అందరికీ వైద్యం కలగానే మిగిలింది. 144 కోట్లకు పైనే జనాభా కలిగిన మన దేశంలో ప్రజారోగ్యానికి ఖర్చు పెడుతున్నది జిడిపిలో 1.35 శాతం మాత్రమే అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పేద దేశమైనటువంటి క్యూబా తన జాతీయ ఆదాయంలో 12 శాతం ప్రజారోగ్యం కోసం ఖర్చు పెడుతుంది. బ్రిటన్‌, అమెరికా, స్వీడన్‌, జపాన్‌, జర్మనీ తదితర దేశాలు తమ జిడిపిలో దాదాపు పది శాతం ఖర్చు పెడుతున్నాయి. ప్రభుత్వం బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించదు. డాక్టర్ల ఖాళీ స్ధానాలను భర్తీ చేయదు. మిషన్లను బాగు చేయదు. ప్రభుత్వ ప్రోత్సాహం ప్రైవేట్‌ ఆసుపత్రుల వైపే వుండటం వలన ధర్మాసుపత్రులు ధర్మానికి నడుస్తున్నాయి. దిక్కులేనివారు, అప్పు పుట్టనివారు, ప్రైవేట్‌ ఆసుపత్రుల ఖర్చులను భరాయించలేని వారికే ప్రభుత్వ వైద్యం దిక్కయింది.
వైద్యం వ్యాపారమైంది
మొత్తం 706 మెడికల్‌ కాలేజీలున్నాయి. అందులో 386 ప్రభుత్వ కళాశాలలు, 320 ప్రైవేటు మెడికల్‌ కాలేజీ లున్నాయి. లక్షకు పైగా ఎంబిబిఎస్‌ సీట్లున్నాయి. అందులో సగం సీట్లు ప్రభుత్వ కాలేజీలోనూ మరో సగం సీట్లు ప్రైవేటు కాలేజీల్లో వున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు లక్ష మంది డాక్టర్లవుతున్నారు. లక్ష ఎంబిబిఎస్‌ సీట్లకు 24 లక్షల మంది నీట్‌ పరీక్ష రాశారు. ప్రభుత్వ కాలేజీలలోనూ ఫీజులు లక్షల్లో వసూలు చేయడానికి పూనుకుంటున్నారు. సీటు కొని ఎంబిబిఎస్‌ పూర్తయ్యేసరికి కోటి రూపాయలు ఖర్చవుతుంది. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్పెషలిస్ట్‌ అవ్వాలన్నా, ఎక్స్‌ రే, అల్ట్రా సౌండ్‌ లాంటి మిషన్లు కొని ఆసుపత్రి ప్రారంభించాలన్నా మరి కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి లాభాలను కోరుకుంటుంది. లాభాలు రావాలంటే రోగుల దగ్గర నుండి రాబట్టాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డాక్టరు, ప్రాక్టీసు పెట్టిన మొదటిరోజు నుండి, అసలు, వడ్డీ ఎట్లా రాబట్టాలా అనే ఆలోచనలోనే వుంటాడు. డాక్టరుకు-రోగికి మధ్య డబ్బు ప్రమేయం లేనపుడే అందరికీ మెరుగైన వైద్యం లభిస్తుంది.
వైద్య వృత్తిలోకి కార్పొరేట్‌ హాస్పిటళ్లు, వైద్య రంగంలోకి విదేశీ పెట్టుబడులు ప్రవేశించటం వైద్యం వ్యాపారం కావాడానికి మరో కారణం. దాంతో ప్రభుత్వాసుపత్రుల స్ధానాన్ని, కుటుంబ వైద్యుల స్ధానాన్ని కార్పొరేట్‌ హాస్పిటళ్లు ఆక్రమించేశాయి. అపోలో హాస్పిటల్స్‌ భారతదేశంలోనే పూర్తి స్థాయి కార్పోరేట్‌ హాస్పిటల్‌గా అభివృద్ధి చెందింది. 10,000 పడకలతో 73 ఆసుపత్రులు వున్నాయి. విదేశీ పెట్టుబడుల ప్రవాహం అపోలోలో ఎక్కువగా వుంది.
మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారతదేశంలో రెండవ అతి పెద్ద హాస్పిటల్‌ చైన్‌. దాని వెబ్‌సైట్‌ ప్రకారం, డజనుకు పైగా నగరాల్లో 33 కంటే ఎక్కువ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్వహిస్తోంది. సింగపూర్‌ మల్టీ నేషనల్‌ కంపెనీ టెమా సెక్‌ మణిపాల్‌ హాస్పిటల్స్‌లో తన వాటాను 2023లో 59 శాతానికి పెంచింది. పారు, ఇతర పెట్టుబడిదారుల నుండి వాటాలను కొనుగోలు చేసింది. దీని విలువ 4.6 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఆస్ట్రర్‌ డీఎమ్‌ హెల్త్‌ కేర్‌ లిమిటెడ్‌ అనే మల్టీ నేషనల్‌ కంపెనీ సౌదీ, ఖతార్‌, జోర్డాన్‌, కువైట్‌, ఇండియాలలో వున్నది. ఇది రమేష్‌ హాస్పిటళ్లతో విలీనమైంది. మార్కెట్‌ కేపిటలైజేషన్‌ రూ. 17,588 కోట్లు.
వైద్యం ఖరీదైపోయింది
అమెరికా, యూరప్‌ దేశాల్లోని ఆధునిక వైద్య పద్ధతులు, ఆధునిక పరికరాలన్నీ మన దేశంలోనూ అందుబాటులో వున్నాయి. వ్యాధి నిర్ధారణకు సైన్స్‌ ఇతోధికంగా ఉపయోగపడింది. ఇదివరకు అసాధ్యం అనుకున్నటువంటి అనేక జబ్బులకు మందులు కనుక్కోగలిగారు. రకరకాలయిన ఆపరేషన్లు కొత్త పరికరాలతో సులువుగా చేయగల్గుతున్నారు. నూతన చికిత్సా పద్ధతులను కనుగొన్నారు. ఫిజిక్స్‌ అభవృద్ధి కావడం వలన లాపరోస్కోపిక్‌ సర్జరీ, రోబో సర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ అభివృద్ధి అయ్యాయి. సైన్స్‌ విజయం వైద్యంలో రోగ నిర్ధారణకు, చికిత్సకు ఎనలేని అవకాశాలను కల్పించింది. ఇటువంటి అత్యాధునిక వైద్యం కార్పొరేట్‌ ఆసుపత్రులలోనే లభ్యమవుతుంది. విశాల ప్రజానీకానికి ఉపయోగపడవలసిన సైన్స్‌ కార్పొరేట్‌ వ్యాపార సంస్ధల చేతుల్లోకి వెళ్ళింది. వైద్యం సరుకైంది. వైద్యం వ్యాపారమై, ఖరీదైపోయింది. కొద్దిమంది ధనవంతులు ఎంత ఖర్చయినా భరించి రోగాల నుంచి బయట పడుతున్నారు. మరణాన్ని వాయిదా వేస్తున్నారు. రోగం వచ్చి హాస్పిటల్లో చేరితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనేది సామాన్య ప్రజల అనుభవం. వైద్య ఖర్చులు భరించలేక ప్రతి సంవత్సరం కోట్లాది మంది పేదరికం లోకి జారిపోతున్నటువంటి అవస్థ అందరికీ తెలిసిందే. సంవత్సరానికి ఆరు కోట్ల మంది ప్రజలు వైద్య ఖర్చులు భరించలేక పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఓ సర్వే చెప్తున్నది.
మందుల తయారీ లోనూ కార్పొరేట్‌ కబ్జా
మొత్తం ఆరోగ్య వ్యయంలో ఔషధ వ్యయం వాటా 29.6 శాతం వుంది. మేధో సంపత్తి హక్కులు, పేటెంట్‌ చట్టాలు, ప్రపంచ వాణిజ్య ఒప్పందాల పేరున మందుల ఖరీదు రోజురోజుకూ పెరిగిపోతుంది. కార్పొరేట్‌ మందుల కంపెనీల లాభాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ నేవున్నాయి. మందుల రేట్లు పెరుగుతూనే వున్నాయి. లాభాలు పెంచుకోవటం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నాసిరకం మందులు, నకిలీ మందులను అరికట్టని ప్రభుత్వాన్ని ఏమీ చేయలేని స్ధితిలో ప్రజలున్నారు. పేటెంట్‌ పేరుతో మందుల ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్న కంపెనీలను అదుపు చేసే శక్తి ప్రభుత్వానికి లేదు. తక్కువ ధరకు నాణ్యమైన మందులను అందించిన ఐడిపిఎల్‌ లాంటి ప్రభుత్వ సంస్ధలను మూసేశారు. ముడి సరుకుగా బేసిక్‌ మందును టన్నులలో కొని, మిల్లీ గ్రాములతో మందును తయారు చేసి భారీ లాభాలను సంపాదిస్తున్న కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహాలిస్తున్నది. అడ్డదారులకు అండగా వుండటం కోసం పాలకవర్గ పార్టీలకు కోట్ల రూపాయలను మందుల కంపెనీలు ఇస్తున్నాయి. మద్యం కుంభకోణంలో అరెస్టయిన అరబిందో ఫార్మా డైరెక్టర్లలో ఒకరు మొత్తం రూ.52 కోట్లకు ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన డబ్బు సగానికి పైగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. భారతీయ జనతా పార్టీకి (బిజెపి) రూ.34.5 కోట్లు, భారత రాష్ట్ర సమితికి (బిఆర్‌ఎస్‌) రూ.15 కోట్లు, తెలుగుదేశం పార్టీకి (టిడిపి) రూ.2.5 కోట్లు విరాళంగా అందజేసింది. మందుల పరిశ్రమ ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటి? సామాన్య వ్యాపార లాభాల కోసం కాదు కదా. నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా మందులు తయారు చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాడటం కోసమే. మందు క్వాలిటీ తగ్గినా పర్వాలేదు. లాభాలు అమాంతంగా పెరగాలి. అసలు మందు ఉంటే రోగం తగ్గుతుంది. మందులో మందే లేకపోతే రోగం తగ్గదు. రోగం తగ్గకపోతే బాధ్యత డాక్టర్‌దే! డాక్టర్‌ పని పట్టాల్సిందే అంటూ భౌతిక దాడులు పెరుగుతున్నాయి. పెరిగిన వైద్య ఖర్చులకు బాధ్యత డాక్టర్‌దే అని ప్రజలు నిర్ధారించడం కొసమెరుపు.
క్యూబా ఆదర్శం
మనకు డాక్టర్ల సంఖ్య తక్కువగానే ఉంది. వెయ్యి మంది జనాభాకి 2.6 అంటే ముగ్గురు కూడా లేరు. అదే క్యూబాలో వెయ్యి మంది జనాభాకి 8.4 దాదాపు 9 మంది ఉన్నారు. బ్రిటన్‌, క్యూబా లాంటి అనేక దేశాలలో, డాక్టర్లందరూ ప్రభుత్వాసుపత్రుల్లోనే పని చేస్తారు. ప్రజల మధ్య నివసిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటమే క్యూబా దేశ ప్రత్యేకత. బ్రిటన్‌లో కూడా డాక్టర్లందరూ ప్రభుత్వం లోనే పనిచేస్తారు. కానీ అమెరికా, ఇండియా, జపాన్‌లో డాక్టర్లు ఎక్కువ మంది ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ లోనే వుండటం వలన పేద ప్రజలకి అందుబాటులో లేరు. పట్టణాలలో ఎక్కువమంది డాక్టర్లు, స్పెషలిస్టులు ఉన్నారు. నూటికి 99 మంది దగ్గర ఆ స్థాయి వైద్యం చేయించుకోవడానికి డబ్బులుండవు. వ్యవసాయ కుటుంబ నెలసరి ఆదాయం రూ.10,218. పది వేల రూపాయల ఆదాయంతో వైద్య ఖర్చులు భరించే పరిస్ధితి లేదు.
డబ్బుల ప్రమేయం లేకుండా ప్రజలకు వైద్యం అందించే దేశాలలో…క్యూబా, బ్రిటన్‌, కెనడా, జర్మనీ లాంటి దేశాలున్నాయి. క్యూబాలో అడవులు, కొండలలో కూడా ప్రజల మధ్య డాక్టర్‌ నివసించటం ప్రత్యక్షంగా చూశాను. జీవన సూచికలలో అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకన్నా ముందుంది. దేశం చిన్నదైనా దృఢ దీక్షతో ఏ దేశ ప్రజలకు విపత్తు సంభవించినా తన డాక్టర్లను పంపి ప్రాణ సహాయం చేస్తున్నది. ఆఫ్రికాలో అంటువ్యాధి ఎబోలా రోగులకు వైద్యం చేయటానికి అమెరికాతో సహా అందరూ నిరాకరించినా క్యూబా డాక్టర్లు ధైర్యంగా ఎబోలా రోగ బాధితులను కాపాడి డాక్టర్లకు ఆదర్శంగా నిలిచారు. కరోనాకు వైద్యం చేయటమే కాక వ్యాక్సిన్‌ కనుక్కొని లాటిన్‌ అమెరికా దేశాలకు చౌకగా అందించారు. సామాజిక కర్తవ్యంగా వైద్యం చేస్తున్న అక్కడి డాక్టర్లకు జేజేలు. అందుకు పునాదులు వేసిన డాక్టర్‌ చే గువేరా అభినందనీయులు.
మన దేశంలో అందరికీ వైద్యం అందేలా యూనివర్సల్‌ హెల్త్‌ కోసం పోరాడుదాం.

డా|| కొల్లా రాజమోహన్‌
/ వ్యాసకర్త సెల్‌ : 9000657799 /

➡️