ఉద్యమమే ఊపిరిగా…

Apr 11,2024 05:45 #artical, #edit page

కమ్యూనిస్టు విలువలకూ, త్యాగానికీ, ఆదర్శాలకూ, నిబద్దతకూ నిలువెత్తు నిదర్శనం కామ్రేడ్‌ పైలా వాసుదేవరావు. విప్లవోద్యమమే ఊపిరిగా శ్వాసించి, జీవితమంతా పీడిత ప్రజల విముక్తి కోసమే పరితపించారు. 78 ఏళ్ళ జీవన గమనంలో జనమే తప్ప వ్యక్తిగతం లేని అలుపెరుగని అజ్ఞాత విప్లవ సూరీడాయన. శ్రీకాకుళం రైతాంగ ఉద్యమంపై ప్రభుత్వ క్రూర నిర్బంధానికీ, ఎన్‌కౌంటర్‌ హత్యలకు, అణచివేతకు గురైనా, గుండె నిబ్బరంతో ఎర్ర జెండాను నిలబెట్టిన ధీశాలి.
కామ్రేడ్‌ పైలా వాసుదేవరావు 2010 ఏప్రిల్‌ 11వ తేదీన తీవ్రమైన క్యాన్సర్‌ వ్యాధితో మరణించారు. మరణించే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరాలు. మాష్టారుగా, ప్రసాదన్నగా ప్రజలు ప్రేమగా పిలుచుకునే కామ్రేడ్‌ పైలా వాసుదేవరావు 1932 ఆగష్టు 11న శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం రిట్టపాడులో జన్మించారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. 1953లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి తుదిశ్వాస వీడే వరకు ఐదున్నర దశాబ్దాలకు పైబడిన విప్లవోద్యమ జీవితంలో సొంత ఆస్తి లేని వ్యక్తి పైలా. ప్రజలే తన ఆస్తి తప్ప వ్యక్తిగత జీవితమన్నదే ఎరుగరు. తనకు వారసత్వంగా వచ్చిన కాస్త భూమిని, సొంత ఇంటిని అమ్మి నాటి శ్రీకాకుళం పోరాట ఉద్యమ కేంద్రం ఉద్దానంలోని పలాసలో అమర వీరుల స్మారకంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన నిస్వార్థ కమ్యూనిస్టు ఆయన.
ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. శ్రీకాకుళ పోరాట ఉద్యమ నాయకుడిగా, దళ జీవితం గడుపుతున్నప్పుడు 1970లో, దళ సభ్యురాలు కామ్రేడ్‌ చంద్రమ్మను వివాహం చేసుకున్నారు. ఉద్యమ క్రమంలోనే తమకు పుట్టిన బిడ్డను సైతం తమ విప్లవ సహచరుడు అత్తలూరి మల్లికార్జునరావు కుటుంబానికి ఇచ్చేసి రక్తసంబంధం కంటే వర్గ సంబంధం గొప్పదని చాటిచెప్పారు పైలా వాసుదేవరావు, చంద్రక్క. ఆ దంపతులు ఎమర్జెన్సీ టైమ్‌లో అరెస్టయ్యి 12 ఏళ్ళ సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని అనుభవించారు.
తను నమ్మిన విప్లవ రాజకీయాల పట్ల దృఢమైన విశ్వాసం, చిత్తశుద్ధి, ఆచరణ కలిగిన వ్యక్తి. భారత దేశంలో విప్లవం విజయవంతం కావాలంటే, సారూప్యత కలిగిన విప్లవ సంస్థలు, పార్టీలన్నీ ఐక్యం కావాలని బలంగా ఆకాంక్షించిన వారు పైలా మాష్టారు. క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడుతూ, చివరి శ్వాస వరకు విప్లవాన్నే స్వప్నించిన ధీరుడాయన.

– చిట్టిపాటి వెంకటేశ్వర్లు,
రాష్ట్ర కార్యదర్శి సిపిఐ(ఎం.ఎల్‌)న్యూడెమొక్రసీ,
సెల్‌ : 9989737776

➡️