మా డిమాండ్లే.. మా రాజకీయం…

Mar 16,2024 07:20 #Editorial

సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌.కె.ఎం), దాని భాగస్వామ్య సంఘాలు…ఎనిమిది పర్యాయాలు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన హన్నన్‌ మొల్లాను… సంవత్సరానికి పైగా నడిచిన రైతు ఉద్యమంలో కీలక వ్యక్తిగా గుర్తించాయి. భారతదేశంలోనే అతి పెద్ద రైతు సంఘం ‘ఆలిండియా కిసాన్‌ సభ’ కార్యనిర్వాహకవర్గ సభ్యునిగా…రైతాంగ నిరసనలు నిరవధికంగా కొనసాగేందుకు కృషి చేసిన నాయకులలో ఆయన ఒకరు. మూడు వివాదాస్పద రైతు చట్టాల్ని రద్దు చేయడంలో ఎస్‌.కె.ఎం విజయం సాధించింది. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసే మార్గాల్ని చర్చించేందుకు ప్రభుత్వంతో కమిటీని కూడా వేయించింది. అయితే ప్రభుత్వం… ఒప్పందానికి విఘాతం కలిగించి ఎస్‌.కె.ఎం ను చర్చలకు పిలవలేదు.
                      తాము ‘రాజకీయ రహితం’ అని చెప్పుకుంటూ ఎస్‌.కె.ఎం నుండి విడిపోయిన వర్గం ఫిబ్రవరిలో ఢిల్లీలో ప్రదర్శనకు పిలుపిచ్చింది. ఇది ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌కు స్వయంగా పిలుపునివ్వడం గందరగోళానికి దారితీసిందని హన్నన్‌ మొల్లా అంటున్నారు. ఈ పిలుపుకు ఎస్‌.కె.ఎం మద్దతు ఇవ్వకపోవడంతో విమర్శలను ఎదుర్కొంది. ఎస్‌.కె.ఎం మార్చి 14వ తేదీన ఢిల్లీలో మహా పంచాయత్‌కు పిలుపునిచ్చింది. ఎస్‌కెఎం ఆ వైఖరిని ఎందుకు తీసుకుందనే విషయాన్ని హన్నన్‌ మొల్లా ‘ఫ్రంట్‌లైన్‌’ ప్రతినిధి టి.కె.రాజాలక్ష్మికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. సంభాషణ ముఖ్యాంశాలు…

ప్ర : ప్రస్తుత రైతు ఆందోళన దశను మీరెలా చూస్తారు? కొన్ని రైతు సంఘాలు ‘ఢిల్లీ ఛలో’కు పిలుపునివ్వడంతో, దీనికి ఎస్‌కెఎం మద్దతు ఉందా లేదా అనే గందరగోళం ఏర్పడింది.
జ: స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయడానికి ప్రభుత్వం తిరస్కరించినపుడు, దేశవ్యాప్తంగా ఉన్న 500 రైతు సంఘాలు 2020 అక్టోబర్‌లో గురుద్వారా రాకబ్‌గంజ్‌లో సమావేశమయ్యాయి. ఇది సమస్య ఆధారిత ఉద్యమం, వ్యక్తిగత జెండాలకు తావుండకూడదని అక్కడ నిర్ణయించాయి. మేం కూడా కొన్ని అంశాలపై అంగీకారాన్ని తెలియజేశాం. మూడు వ్యవసాయ చట్టాల రద్దు తక్షణ సమస్య. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులపై ఆధారపడి కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ పొందడమనేది మరో ముఖ్యమైన డిమాండ్‌. పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. వీటి అదుపుకు హామీ ఇవ్వాల్సింది ప్రభుత్వమే. వ్యవసాయం ఇతర పరిశ్రమల లాంటిది కాదు. ఇతర ఉత్పత్తులకు గరిష్టంగా రిటైల్‌ ధర ఉంటుంది. అంతకు మించి ఎవరూ చెల్లింపులు చెయ్యకూడదు. మేం కేవలం కనీస మద్దతు ధర, సేకరణ హామీ మాత్రమే అడుగుతున్నాం.
2020 నవంబర్‌ 26న చలో ఢిల్లీకి పిలుపునిచ్చాం. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వబోమని ప్రభుత్వం చెప్పింది. జాతీయ రహదారులపై గుంటలు తవ్వించారు. రైతులపై బాష్పవాయువుల్ని ప్రయోగించారు. రైతుల నిరసన శిబిరాల్లో నీటి సరఫరాను, కరెంట్‌ సరఫరాను నిలిపివేశారు. రైతులు ప్రవేశించకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పుడు, మేం పోలీసులతో ఘర్షణకు తలపడడం లేదని చెప్పాం. శాంతిని కాపాడాల్సి ఉంటుందనే విషయం మాకు తెలుసు. మా నాయకత్వం పూర్తిగా అదుపులో ఉంది. ప్రభుత్వం, మమ్మల్ని పాకిస్తానీయులనీ ఖలిస్థానీయులనీ మావోయిస్టులని పేర్లు పెట్టింది. వారు మమ్మల్ని బలహీనపరచాలని కూడా చూశారు. ప్రభుత్వంతో జరిగిన సమావేశాలు చివరి వరకూ అసంపూర్తిగానే నడిచాయి. ఈ క్రమంలో మాకు అనూహ్యంగా మద్దతు లభించింది. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, మేధావులు మాకు తోడయ్యారు. మిగిలిందంతా చరిత్ర. సంయుక్త కిసాన్‌ మోర్చా సంవత్సరం పాటు నిర్వహించిన నిరసనలు శాంతియుతంగా, క్రమశిక్షణతో జరిగాయి. హర్యానా పోలీసులు, పంజాబ్‌ నుండి వచ్చిన రైతులపై సాగించిన అణచివేతను మేం ఖండించాం. ఈ సంవత్సరం మేం ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌ను నిర్వహించాలని పిలుపునిచ్చాం, కానీ కొన్ని రైతు గ్రూపులు ముందుకెళ్ళి ఫిబ్రవరి 13న చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి.

ప్ర: 2020 నవంబర్‌లో ఢిల్లీ ముట్టడి జరిగిన నాటి నుండి కొంత మేరకు మాత్రమే పురోగతి సాధించారనీ… తాజా ప్రదర్శనను ప్రారంభించిన ఒక వర్గానికి చెందిన రైతులకు మద్దతు లభించిందనే భావన ఉంది. మిగిలిన కమిటీ కూడా ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చి ఉండాల్సిందనే అభిప్రాయం కూడా ఉంది.
జ: ఎప్పుడూ కూడా కనీస మద్దతు ధర కోసం ఒక చట్టబద్ధమైన చట్రం ఏర్పాటు చేయాలనేది మా మొదటి డిమాండ్‌. ఇది 20 ఏళ్ళుగా మేం చేస్తున్న డిమాండ్‌. బిజెపి అనేక సందర్భాల్లో, తన ఎన్నికల ప్రణాళికల్లో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తానని చెప్పింది. అనేక బహిరంగ సభల్లో స్వయంగా నరేంద్ర మోడీ, తమ ప్రభుత్వం ఏర్పడితే పెట్టుబడికి అయిన ఖర్చుకు అదనంగా ఖర్చులో సగం కలిపే (సి2+50) ఫార్ములాను అమలు చేస్తామని చెప్పారు.
చట్టాల్ని ఉపసంహరించుకుంటామన్న ఆలోచనను ప్రభుత్వం వెలిబుచ్చినప్పుడు మేము తిరిగి ధర్నాకు వెళ్ళాం. పదకొండు రోజుల తర్వాత ప్రభుత్వం మమ్మల్ని ఒక సమావేశానికి పిలిచింది. అక్కడ ఇతర డిమాండ్లను చర్చించారు. మొదటిది, సి2+50 శాతం ఫార్ములా అమలు, రుణ మాఫీ, పంట వ్యర్థాల దగ్ధం కేసుల ఉపసంహరణ, విద్యుత్తు సవరణ చట్ట ఉపసంహరణ, మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు, రైతులకు వ్యతిరేకంగా దాఖలైన 40,000 కేసుల ఉపసంహరణ. ఇవి ప్రధానమైన ఆరు డిమాండ్లు.
వ్యవసాయ శాఖామంత్రితో రాతపూర్వకంగా చేసుకున్న ఒప్పందంలో ఆరు డిమాండ్లు భాగంగా ఉన్నాయి. మూడు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ప్రభుత్వం మాతో చేసుకున్న ఒప్పందం అమలులో అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. గత మార్చిలో రామ్‌ లీలా మైదానంలో నిర్వహించిన ఒక పెద్ద ప్రదర్శనలో ఈ ఒప్పందం గురించి ప్రభుత్వానికి గుర్తు చేశాం. గవర్నర్ల కార్యాలయాల ముందు 72 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. 2023 జనవరి 26న దేశ వ్యాప్తంగా ట్రాక్టర్ల ప్రదర్శనను నిర్వహించాం. 2024 ఫిబ్రవరి 16న మా చివరి కార్యాచరణ గ్రామీణ బంద్‌ను, ఫిబ్రవరి 26న ట్రాక్టర్ల ప్రదర్శనను నిర్వహించాం. కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 16 పిలుపుకు మద్దతు పలికాయి. మా నిరసన విధానం ఎప్పుడూ క్రమశిక్షణతో, ప్రజాస్వామికంగా, శాంతియుతంగానే జరుగుతుంది. ఎస్‌కెఎం ఒక సజీవమైన ఉద్యమం. అందువల్లనే మేం ప్రజల నుంచి విశాలమైన మద్దతును పొందుతున్నాం.

ప్ర: ప్రభుత్వం అనుసరిస్తున్న ‘విభజించు, పాలించు’ విధానంవల్ల రైతు ఉద్యమం చీలిపోయిందని మీరు భావిస్తున్నారా ?
జ: సంవత్సరం పాటు నడిచిన మా నిరసన కార్యక్రమాల తరువాత ఎస్‌కెఎం నుండి ఇద్దరు నాయకులు వెళ్లిపోయారు. వారిలో ఒకరికి ఆర్‌ఎస్‌ఎస్‌తో చాలా సన్నిహితమైన సంబంధాలున్నాయి. మాకేమీ అభ్యంతరం లేదు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే…ఈ ఇద్దరు నాయకుల ప్రాతినిధ్యంలో ఏర్పడిన కొన్ని విభాగాల గ్రూపులతో సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వం సిద్ధపడి, ఎస్‌కెఎం ప్రాతినిధ్యంలో ఉన్న పెద్ద అఖిల భారత కమిటీని అడ్డుకుంది. అఖిల భారత రైతు, కిసాన్‌ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 40 మంది మాలో ఉన్నారు. మొత్తంగా 2020-21లో మేం 11 దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపాం. అప్పుడు 3 సంవత్సరాల పాటు మమ్మల్ని చర్చలకు పిలువలేదు. కానీ విడిపోయిన గ్రూపులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రుల్ని చండీగఢ్‌ పంపింది. ప్రభుత్వ పన్నాగంలో చిక్కుకోవద్దని మేము ఆ సంఘాల వారిని హెచ్చరించాం. అందుకే, ప్రభుత్వ నిబంధనల్ని అంగీకరించిన తర్వాత వెంటనే ఇవ్వజూపిన (ఆఫర్‌) దానిని తిరస్కరించారు. ప్రాథమిక సమస్యలను పరిష్కరించనేలేదు. మీడియా కూడా మా శాంతియుతమైన నిరసన విధానాల్ని పట్టించుకోలేదు.

ప్ర: ప్రస్తుత దశకు నాయకత్వం వహిస్తున్న వారు కూడా తమను తాము ఎస్‌కెఎం గానే పిలుచుకుంటున్నారు… కానీ ‘రాజకీయ రహితం’ అనే పదాన్ని అదనంగా జోడిస్తున్నారు.
జ: ‘రాజకీయ రహితం’గా పిలువబడేది ఏదీ లేదు. ఇది ప్రజల్ని మోసం చేస్తుంది. ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే ఒక రాజకీయ అస్తిత్వంతో మేం రాజకీయ రహితంగా ఎలా పోరాడగలం? మా డిమాండ్లే, మా రాజకీయం. ‘పార్టీ’ రాజకీయం కాదు. ఎస్‌కెఎం ఓ రాజకీయ సంస్థ కాదు. ఔను, మేం అప్పటికే అఖిల భారత గ్రామీణ బంద్‌ను నిర్వహించాలని సమిష్టిగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నాం కాబట్టి మేము ‘చలో ఢిల్లీ’ పిలుపుకు దూరంగా ఉన్నాం. ఇది వాస్తవం. కానీ ఎలాంటి వారైనా నిరసన వ్యక్తం చేసే హక్కును కలిగి ఉండడాన్ని మేం సమర్థిస్తాం. ఒకవేళ ప్రభుత్వం రైతులపై దాడులు చేస్తే మేము కచ్చితంగా ఖండిస్తామనేది కూడా స్పష్టంగా కనిపించింది. రాబోయే ఐదేళ్లకు ఐదు పంటల్ని కనీస మద్దతు ధరకు కొనేందుకు ప్రభుత్వం కూడా అవకాశం ఇవ్వజూపింది. ముందుగా, చీలిక గ్రూపు అంగీకరించింది, తరువాత వెనక్కి తగ్గింది. మేము ప్రభుత్వం ఇవ్వజూపిన దానిని విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్లి, దానిని వెన్నుపోటు అన్నాం. దీన్నొక తప్పిదంగా సంఘాలు గుర్తించాయని అనుకుంటున్నాను.
మొదటి దశ ఆందోళన సమయంలో ప్రస్తుత నిరసనల దశకు నాయకత్వం వహిస్తున్న ఒక సంఘం ఐక్య సంఘ టన నుండి విడిపోయి వేరు కుంపటి ఏర్పాటు చేసుకుంది. 2021 జనవరి 26న ట్రాక్టర్ల ప్రదర్శన జరిగినప్పుడు అదే సంఘం ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక విభాగం విడిపోయి, ఎర్రకోట వైపు వెళ్ళింది. ఇది ప్రణాళికలో భాగం కాదు. ప్రభుత్వం మా పట్ల కఠినంగా వ్యవహరించడానికి ఈ చర్య అవకాశం కల్పించింది. ఐక్య ఉద్యమం గట్టిగా నిలబడి, సరిహద్దు ప్రాంతంలో మరో 11 నెలల పాటు నిరసనల్ని కొనసాగించడమనేది వేరే విషయం.
కాబట్టి అలాంటి చర్యలకు పూనుకున్నవారు, ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన వారిలో ముఖ్యులుగా ఉండడం గమనించ దగిన విషయం. అయితే ప్రభుత్వ అణచివేతను మేం నిర్ద్వంద్వంగా ఖండిస్తాం. రైతుసంఘాలు ప్రభుత్వం దాడికి పూనుకునేందుకు ఎలాంటి అవకాశం కూడా ఇవ్వకూడదు.
రైతు ఆధారిత వ్యవసాయాన్ని నాశనం చేసి, కార్పోరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ విధానం. మూడు వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించు కున్నారు కానీ ఆ చట్టాల సారం మాత్రం బడ్జెట్‌లో యథావిధిగానే ఉంది. వ్యవసాయానికి బడ్జెట్‌లో దాదాపు 83 శాతం వ్యక్తిగత ఆధారిత పథకాల కోసం కేటాయించారు. రైతుల్లో నలభై శాతం కౌలు రైతులే ఉన్నారు కాబట్టి వారు ఈ వ్యక్తిగత లాభాలను పొందరు. వ్యవసాయం మీద అయ్యే ఖర్చులో 82 శాతం రైతులే భరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తాము వ్యవసాయాన్ని రక్షిస్తున్నామని చెప్తున్నది.
వ్యవసాయంలో కార్పొరేట్‌ పెట్టుబడి 3 శాతం మాత్రమే. అలాంటి కొద్ది మొత్తం పెట్టుబడితో కార్పొరేట్‌ రంగం సాగును, ఉత్పత్తిని, రవాణాను, ప్రాసెసింగ్‌ను, ఎగుమతులు, దిగుమతుల్ని, మార్కెటింగ్‌, సరఫరాను అదుపు చేయాలనుకుంటున్నది. వ్యవసాయ విధానం రైతు కేంద్రంగా వుండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి విషయంలోనూ రైతు ఎక్కడో అల్లంత దూరంలో ఉన్నాడు. 2014-2022 మధ్య లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్‌సిఆర్‌బి ఇచ్చిన నివేదిక ఈ విషయాన్ని తెలియజేస్తున్నది. 23 పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తే ధరలు పెరుగుతాయనేది కుతర్కం. పామాయిల్‌ను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది. మన రైతులు కూడా దానినే ఉత్పత్తి చేయగలరు. అదే విధంగా చెరుకుకు సంతలో లాభదాయకమైన ధర పెంపులో కొద్దిపాటి పెంపుదల పరిష్కారం కాదు. దేశ వ్యాప్తంగా రైతులంతా బాధపడుతున్నారు. వాస్తవ సంక్షోభాన్ని పరిష్కరించే సమగ్ర విధానంగానీ, ఉద్దేశంగానీ ప్రభుత్వానికి లేదు.
(‘ఫ్రంట్‌ లైన్‌’ సౌజన్యంతో)

➡️