రాష్ట్రానికి చేటు

Mar 12,2024 06:27 #alliance, #BJP, #edite page, #JanaSena, #TDP

బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ లోకి టిడిపి చేరిక ఆత్మహత్యకు మించిన అపరాధం. ముందు నుంచే ఎన్‌డిఏలో ఉన్న జనసేన, కూటమి వెలుపలున్న టిడిపిలు కలిసి పని చేస్తున్నాయి. తాజాగా ఎన్‌డిఏ గూటికి టిడిపి చేరింది. బిజెపి, టిడిపి, జనసేన పొత్తు ఖరారు చేసుకొని రానున్న ఎన్నికల్లో జాయింట్‌గా పని చేస్తామని శనివారం రాత్రి ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఎవరికెన్ని సీట్లో అవగాహనకొచ్చారు. మిగిలింది సీట్ల కేటాయింపు, అభ్యర్ధుల ఎంపిక. అందుకూ సోమవారం కసరత్తు మొదలుపెట్టారు. రాజకీయ పార్టీల పొత్తులు వాటి ఇష్టం. కానీ ఎందుకు ఏమి ఆశించి పొత్తులోకెళ్లారో ప్రజలకు వివరించడం పార్టీల బాధ్యత. బిజెపి, టిడిపి, జనసేన పొత్తు కొత్తదేమీ కాదని సరిపెట్టడం వత్తాసు పలికేవారి పని. గతంలో కలిసుండి విడిపోయి మరలా కలవడం అనేదే చర్చనీయాంశం. 2014లో ఎందుకు కూటమి కట్టారు, 2019లో దేనిపై విభేదించి విడిపోయారు, మరలా 2024లో ఎందుకు కలుస్తున్నారు అనే ప్రశ్నలకు ఆ పార్టీలు ప్రజలకు జవాబు చెప్పాల్సిందే!
2014లో ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ తూచ అమలు చేస్తామని బిజెపి చేతిలో చెయ్యేసి చెప్పిందని నాడు టిడిపి, జనసేన ప్రకటించాయి. మోడీ, చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి వేదికలపై సమిష్టిగా చేతులెత్తి అభివాదాలు చేసి మరీ ఓట్లడిగారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు అధికార పీఠాలెక్కి రాష్ట్రానికి సాధించిందేమిటి? మొదటి నాలుగేళ్లూ అక్కడా ఇక్కడా పదవులు పంచుకొని చెట్టపట్టాలేసుకు తిరిగారు. తీరా నాల్గో ఏట బిజెపి హోదా ఇవ్వకుండా, విభజన హామీలివ్వకుండా మోసగించిందని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిందని బాబు ఎన్‌డిఏ నుంచి బయటికొచ్చి బిజెపి విద్రోహంపై శ్వేతపత్రాలు, ఊరూరా ధర్మ పోరాటాలు, దీక్షలు, అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిన మరుక్షణం నుంచే బిజెపిపై వ్యతిరేకతను విడనాడారు. ఇప్పుడు ఏకంగా యు టర్న్‌ తీసుకొని ఎన్‌డిఎ పంచన చేరారు. ఈ ఐదేళ్లల్లో బిజెపి రాష్ట్రానికి చేసిందేమీ లేదు. హోదా, పోలవరం, రైల్వేజోన్‌, కడప ఉక్కు, రాజధాని ఏదీ ఇవ్వలేదు. ఉన్న విశాఖ స్టీల్‌కు ఎసరు పెట్టింది. వైసిపి మూడు రాజధానులన్నా, మోడీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిని చంపేస్తున్నా కేంద్ర బిజెపి మూగనోము పట్టింది. వైసిపి ప్రభుత్వ నిరంకుశ, అవినీతి, అభివృద్ధి రహిత పాలనకు మద్దతిచ్చింది. ఈ పూర్వరంగంలో జగన్‌ను ఓడించేందుకే బిజెపితో పొత్తు అని టిడిపి, జనసేన చేస్తున్న వాదన చెల్లదు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బిజెపితో వెళ్లిన పలు పార్టీలు నష్టపోయాయన్నది అనుభవం.
బిజెపితో టిడిపి పొత్తులో టిడిపి లొంగుబాటు కనిపిస్తుంది. నోటా కంటే తక్కువ ఓట్లోచ్చిన బిజెపితో 40 శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ అదేపనిగా వెంపర్లాడటం టిడిపి దిగజారుడును తెలుపుతుంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపి కనీసం ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే బిజెపి అంటే టిడిపి శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబు అరెస్ట్‌కు ముందే తొలుత బాబు ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో మాటా మంతీ కలిపారు. ఏమైందోకాని బాబు అరెస్ట్‌ జరిగిపోయింది. బిజెపి ప్రోద్బలం లేకుండా బాబు అరెస్టు జరగదనేది అందరి మదిలోని మాట. అయినా బిజెపి దోస్తీకై ఢిల్లీలో పడిగాపులు పడ్డారు బాబు, పవన్‌ ద్వయం. దీంతో ఎవరు ఎవరిని ఆడిస్తున్నారో అర్థమవుతుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం పునాదితో పుట్టిన టిడిపి దిగజారుడు తనమిది. రాష్ట్రానికి ద్రోహం తలపెట్టిన బిజెపితో టిడిపి, జనసేన అంటకాగటంలో కొందరు పరవశించిపోవడం వెనుక వాటి దివాళాకోరుతనం కనిపిస్తుంది. రాష్ట్రాన్ని బిజెపి అంధకారంలోకి నెట్టగా, బిజెపి, టిడిపి, జనసేన పొత్తు పెనుచీకట్లు చీల్చడానికంటున్నారు. రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేసిన బిజెపితో సాన్నిహిత్యం కొత్త శుభారంభంగా వారికి కనిపించింది. రాష్ట్రాన్ని శిథిల సౌధం చేసిన బిజెపి అభివృద్ధికి కాచుకుంటుందట. కూటమిని ఆశీర్వదిస్తే రాష్ట్రం తెప్పరిల్లుతుందని భాష్యాలు చెబుతున్నారు. ఇదంతా బిజెపికి కొమ్ము కాయడానికే. బిజెపి, దాని మద్దతుదార్ల గెలుపు రాష్ట్రానికి మరణశాసనం. వైసిపి నిరంకుశత్వం ప్రజల స్వేచ్ఛకు, హక్కులకు విఘాతం.

➡️