NEET : నీట్‌ మళ్లీ నిర్వహించండి కోచింగ్‌ సెంటర్ల డిమాండ్‌

న్యూఢిల్లీ : నీట్‌లో గందరగోళాన్ని పరిష్కరించేందుకు అభ్యర్థులందరికీ మరోసారి పరీక్ష నిర్వహించాలని కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ డిమాండ్‌ చేస్తున్నాయి. గతంలో నిర్వహించిన నీట్‌ పరీక్షను రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించాల్సిందిగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టిఎ)ని కోరుతున్నాయి. గుజరాత్‌లోని బిహరండ్‌లో పేపర్‌ లీకైనట్లు నివేదికలు రావడంతో విద్యార్థులకు అన్యాయం జరిగిందని కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫౌండర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్ధిష్టమైన అభ్యర్థులకు గ్రేస్‌ మార్కులు ఇవ్వడం, పేపర్‌ లీకవడం వంటి ఘటనలతో నీట్‌-యుజి పరీక్ష వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. హర్యానాలో పరీక్షలకు హాజరైన 1,563 మంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులపై పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీసింది. గ్రేస్‌ మార్కులతో 67 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించడాన్ని సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. వాటిని రద్దు చేసి, మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని ఎన్‌టిఎ పేర్కొంది. 61 మంది విద్యార్థులకు 720/720 మార్కులు రావడంపై కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
‘గతంలో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఐదుగురి కన్నా తక్కువ మందికే 720/720 మార్కులు వస్తాయి. ప్రతి ఏడాది తమ సెంటర్‌లో టాప్‌ ర్యాంకు సాధించిన విద్యార్థుల గురించి ప్రచారం చేస్తూ కొత్త విద్యార్థులను చేర్చుకుంటారు. ఈ ఏడాది ఆ విధానం సమస్యాత్మకంగా మారింది’ అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఐఎంఎ) వ్యవస్థాపకులు మనీష్‌ జంగ్రా పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ ఫిజిక్స్‌ వాలా (పిడబ్ల్యు)కి చెందిన నలుగురు విద్యార్థులు ఫుల్‌ మార్క్‌ సాధించారు. తమ టాపర్‌ అభ్యర్థులతో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది.
ఈ ఏడాది 25 లక్షల మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే 0.42 శాతం అధికం. వీరిలో పది లక్షల మంది విద్యార్థులు కోచింగ్‌ తీసుకున్నారు. రికార్డు స్థాయిలో 700 మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 1,08,940 సీట్లను నీట్‌ ప్రకటించింది. 27,868 బిడిఎస్‌ సీట్స్‌, 52,720 ఆయుష్‌ సీట్స్‌, 603 బివిఎస్‌సి, ఎహెచ్‌ సీట్స్‌ ఉన్నాయి.
నీట్‌ కుంభకోణానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్ష విధిస్తామని సోమవారం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ హామీ ఇచ్చారు. గత రెండు వారాలుగా ప్రముఖ కోచింగ్‌ సెంటర్స్‌ నీట్‌ స్కామ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల ఆందోళనల మేరకు వివాదాస్పదంగా నిలిచిన పలు అంశాల్లో ఎన్‌టిఎ స్పష్టతనివ్వాలంటూ పిడబ్ల్యు వ్యవస్థాపకులు, సిఇఒ అలాఖ్‌ పాండే పేర్కొన్నారు. ఫలితంగా మీడియా సమావేశంలో వివరణనిచ్చేందుకు ఎన్‌టిఎ యత్నించినప్పటికీ, అది విఫలమైందని పిల్‌లో పేర్కొన్నారు. వివరణనివ్వాలంటూ జూన్‌ 7న ఎన్‌టిఎకి పాండే కోరినప్పటికీ.. ఎన్‌టిఎ స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన పాండే రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.
ప్రతి విద్యార్థి ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకుని పరిష్కార ప్రక్రియ చేపట్టాల్సిందిగా ఆయన లేఖలో ఎన్‌టిఎకి విజ్ఞప్తి చేశారు. నీట్‌లో ర్యాంకు సాధించేందుకు పలువురు అభ్యర్థులు కొన్నేళ్లపాటు తమ జీవితాలను పణంగా పెడుతుంటారని, వారందరికీ తగిన రీతిలో పరిష్కారం చూపాలని లేఖలో అభ్యర్థించారు.

➡️