ఐక్యతే ఆయుధం

Apr 14,2024 05:45 #Editorial

‘మతం వేరైతేను యేమోయ్ ?/ మనసులొకటై మనుషులుంటే/ జాతి యన్నది లేచి పెరిగీ/ లోకమున రాణించునోయ్ !…’ అంటారు గురజాడ. మనం నిశితంగా పరిశీలిస్తే… ప్రతి మతం వారికీ ఒక ప్రత్యేక జీవన విధానం ఉంటుంది. కట్టు, బట్టు, జుట్టు, ఆరాధనా పద్ధతుల్లో వైవిధ్యం ఉంటుంది. వివిధ మతాలను అనుసరించే వారిలో తమ మతంపై ఎంత అభిమానం ఉన్నప్పటికీ… వారిలో పరమత సహనం కూడా ఉంటుంది. ‘ఒక జాతి సమైక్యతకు ఒకే ఆరాధనా విధానం వుండాలన్నది నియంతృత్వ మతాలు, సిద్ధాంతాల పూనకం. భారతీయులంగా మేము ప్రజాస్వామ్యులం. ఎవరి ఇచ్చవచ్చిన దేవుణ్ణి వాళ్లు ఆరాధిస్తారు. అయినా మాది ఒకే భారతజాతి’ అంటాడు దాశరథి రంగాచార్య ‘ఋగ్వేద సంహిత’లో. దీనికి గాంధీజీయే పెద్ద ఉదాహరణ. ఆయనకు హిందూమతంపై ఎంత గాఢాభిమానం ఉందో అంతే పరమత సహనమూ ఉంది. కోట్లాది మంది భారతీయుల్లో మతాభిమానంతో బాటు పరమత సహనం కూడా వుంటుంది. కనుకనే ‘భారతదేశం నా మాతృభూమి/ భారతీయులందరూ నా సహోదరులు/ నేను నా దేశమును ప్రేమించుచున్నాను/ సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం’ అని ప్రతిజ్ఞ చేస్తుంటాం. భారతీయులలో పరమత సహనానికి ఇదొక సంకేతం. ప్రపంచానికి ఇదొక సందేశం. మతానికి రాజకీయాలను జోడించడంతో, మతతత్వంగా… మట్టికాళ్ల మహారాక్షసిగా మారింది. బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్ల కాలంలో మత విద్వేషాన్ని ఒక పథకం ప్రకారం ముందుకు తెచ్చింది.
‘రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక విలువలకు తిలోదకాలిస్తూ మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాల వల్ల భారత ప్రజాస్వామ్యానికి పెను ముప్పు తలెత్తనుందని ‘ది ఎకనమిస్ట్‌’ మ్యాగజైన్‌ హెచ్చరించింది. సహనశీల, భిన్న మతాలకు నిలయమైన భారత్‌ను హిందూ దేశంగా మార్చడానికి ప్రధాని మోడీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ‘ది ఎకనమిస్ట్‌’ వ్యాఖ్యానించడం గమనార్హం. హిందూ మతం నుంచి ఎవరైనా బౌద్ధ, జైన, సిక్కు మతాల్లోకి మారాలనుకుంటే ముందస్తు అనుమతి తప్పనిసరి-అంటూ తాజాగా గుజరాత్‌ బిజెపి ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఎకనమిస్ట్‌ హెచ్చరిక నూటికి నూరుపాళ్లు నిజమేనని బిజెపి చర్య రుజువు చేస్తోంది. దేశ ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛలో రాజ్యం జోక్యం చేసుకోవడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. మతం పేరు మీద పౌరసత్వం ఇవ్వడం నుంచి, అనేక మతోన్మాద చర్యల్ని నిరసిస్తున్న వారినందరినీ దేశద్రోహులుగా చిత్రించడం వరకు అనేక ప్రమాదకర చర్యలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ‘హిందూ రాజ్యమనేది అస్థిత్వంలోకి వస్తే ఈ దేశానికి కచ్చితంగా అదో పెద్ద విపత్తుగా తయారవుతుంది. హిందువులు ఎన్ని మాటలు చెప్పినా-హిందూయిజమనేది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు పెద్ద గొడ్డలిపెట్టు. ప్రజాస్వామ్యానికి, హిందూయిజానికి అస్సలు పొసగదు. కాబట్టి ఎట్టి పరిస్థితులల్లోనూ హిందూ రాజ్యాన్ని ఏర్పడకుండా చూడాల్సిందే’ అంటారు అంబేద్కర్‌.
దేశంలో 80 శాతంగా వున్న హిందువులకు తానే రక్షకుడినని, మరోదఫా ఎన్నికల్లో గెలవడానికి బిజెపి అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా వున్నాయి. ఈ మతోన్మాద పోకడలు లౌకిక వ్యవస్థకు తూట్లు పొడిచేవిగాను, దేశ విచ్ఛిన్నానికి దారితీసేవిగాను వున్నాయి. ‘ప్రజల మధ్య అంతర్గత విభజన వల్ల రాజ్యాలే నాశనమయ్యాయి. అందుకే ప్రజల మధ్య ఐక్యత, సత్సంబంధాలు సాధించేందుకు ప్రతి రాజ్యమూ నిరంతరం ప్రయత్నిస్తుండాలి’ అంటాడు మహాభారతంలో వ్యాసుడు. దీనికి ఐక్యతే ఆయుధం. ఇది ఏ ఒక్క మతానికో సంబంధించిన అంశం కాదు. మొత్తం దేశ ప్రజలకు, లౌకికవాద మనుగడకు సంబంధించినది. ‘భారత సంస్కృతి సూర్యునిలాంటిది. దానికి గ్రహణం పడుతుంటుంది. ఇది తాత్కాలికమే! గ్రహణాన్ని వదిలించే మహామహులు అవతరిస్తుంటారు’ అంటారు దాశరథి. దేశ ప్రజలంతా ఐక్యంగా దీన్ని ఎదుర్కోవాలి. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకోవాలి.

➡️