మీడియా స్వేచ్ఛకు విఘాతం

Mar 29,2024 05:24 #Editorial

ఒక సమాచారం ఇవ్వడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా? లేక ఆ సమాచారాన్ని వెల్లడించే హక్కును నిషేధించటం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానాన్ని వివేకంతో, విచక్షణతో బేరీజు వేసిన తరువాతనే మీడియాపై చర్యలకు పూనుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం గత వారం బ్లూమ్‌బెర్గ్‌ వెర్సస్‌ జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కేసులో వ్యాఖ్యానించింది. మన రాజ్యాంగంలోని 19 (1) అధికరణం కల్పించిన భావ ప్రకటన, వాక్‌ స్వాతంత్య్ర హక్కును పరిరక్షించటానికే ప్రప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రత్యేకించి ట్రయిల్‌ కోర్టులకు సూచించింది. మీడియాపై కత్తి కట్టి వ్యవహరిస్తూ, పత్రికాస్వేచ్ఛనుÛ కర్కశంగా అణచివేస్తున్న పాలకుల ఏలుబడిలో సుప్రీంకోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం హర్షణీయం. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సేకరించటం, ప్రచురించటం, ప్రసారం చేయడం మీడియా బాధ్యత. ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలక్కుండా ఎక్కడ, ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రజల హక్కు. పౌరులకు ఉన్న సమాచార హక్కును, దానిని నెరవేర్చేందుకు దోహదపడే మీడియా స్వేచ్ఛను తగిన విధంగా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ, పాలక యంత్రాంగాలది. పాలనలో పారదర్శకత, ప్రవర్తనలో ప్రజా విధేయత ఉన్న పాలక పక్షాల నుంచి దాపరికం లేని సమాచారాన్ని ఆశించవచ్చు. కానీ, అందుకు భిన్నంగా వ్యవహరించే ప్రభుత్వాల నుంచి, నిజాలను మాట్లాడితే సహించలేని పాలకుల నుంచి సహకారాన్ని కాక, పచ్చి నిరంకుశ ధోరణులను ఎదుర్కోవల్సి వస్తోంది.
తాజాగా ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టుపై ఆ పార్టీ మద్దతుదారుల నిరసనను కవర్‌ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు విరుచుకుపడ్డ తీరు తీవ్ర అభ్యంతరకరం. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను బలహీనపర్చటమే ధ్యేయంగా పెట్టుకున్న బిజెపి రకరకాల రూపాల్లో నిర్బంధ చర్యలకు దిగుతోంది. ఇందుకోసం ఇడి, సిబిఐ, ఐటి తదితర అంగాలను వినియోగిస్తున్న తీరు దేశ ప్రజలను విస్మయపరుస్తూనే ఉంది. ఇలాంటి ఘటనలపై నిరసనలను సైతం నియంత్రించాలనుకోవడం, వాటిని నివేదించే జర్నలిస్టులపైనా అమానుషంగా దాడులకు తెగబడడం దారుణం. తమకు వ్యతిరేకంగా ఒక్క గొంతూ వినిపించకూడదనుకోవడం, బలవంతాన నొక్కేయాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం..
మోడీ ప్రభుత్వ హయాంలో మన దేశంలో పత్రికాస్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ దారుణాతిదారుణంగా హరించుకుపోయాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో నడిచే ప్రధాన మీడియాపై బిజెపి గట్టి నియంత్రణ సాధించింది. దాని ఏలుబడిలో ఎన్ని విధానపరమైన వైఫల్యాలు జరిగినా, ఎన్ని వ్యూహాత్మక విద్వేషాలు రగిలినా … మీడియా నుంచి తందానతాన చందాన పొగడ్తలను, సమర్ధింపులను మాత్రమే కోరుకుంటోంది. కొద్దిపాటి ప్రజాపక్ష మీడియా సంస్థలూ, కొంతమంది జనహిత జర్నలిస్టులూ బిజెపి వైఫల్యాలను, దుర్మార్గాలను గొంతెత్తి చెప్పబోతే దారుణమైన అణచివేతకు, వేధింపులకూ బరితెగిస్తోంది. హత్రాస్‌ ఘోరాన్ని కవర్‌ చేయటానికి వెళ్లబోతుంటే జర్నలిస్టు కప్పన్‌ను దారిలోనే అరెస్టు చేసి, ఉపా కేసు బనాయించి రెండేళ్ల పాటు జైల్లో ఉంచింది. అన్నదాతల ఆందోళనకు మద్దతుగా మాట్లాడిందని సామాజిక కార్యకర్త దిశారవిని తీవ్రంగా వేధించింది. రైతు ఉద్యమ వార్తలను రాసినందుకు న్యూస్‌క్లిక్‌ సంపాదకుడు పుర్కాయస్త తదితరులపై దేశద్రోహ కేసులు బనాయించి, జైల్లో పెట్టింది. ప్రజల పక్షాన రాసిన, మాట్లాడిన అనేకమంది జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను వెంటాడి వేధించటం, దాడులు చేయించటం, తీవ్రమైన కేసులు మోపటం వంటి కక్షపూరిత చర్యలతో భయోత్పాతం సృష్టించటం ఒక విధానంగా కొనసాగిస్తోంది. ఈ కుట్రపూరిత ఆచరణ వల్లనే ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మనదేశం పత్రికాస్వేచ్ఛలో ప్రపంచంలో 161వ స్థానానికి దిగజారిపోయింది! భావ ప్రకటన, పత్రికాస్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిని కఠినంగా తొక్కిపెట్టాలనుకోవడం నియంతృత్వానికి దారి తీస్తుంది. హిట్లర్‌ తదితర నియంతలు ఇలాంటి అణచివేత చర్యలకే పాల్పడి, చరిత్ర హీనులుగా మిగిలిపోయారు. బిజెపి పాలకులు కూడా ఆ దిశగానే పరుగులు పెడుతున్నారు.

➡️