నగరాల్లో నీటి కొరత

Jun 28,2024 04:45 #editpage

దాదాపు గత ఐదు దశాబ్దాలుగా ధరిత్రీ దినోత్సవం అని, ప్రపంచ జల దినోత్సవం అని, పర్యావరణ దినోత్సవం అని ప్రపంచ దేశాలతో సహా మన దేశంలోనూ జరుపుకుంటున్నాం. కానీ ఆ దినోత్సవాల ఆశయాల దిశగా పయనం ఉన్నదా… అంటే దాదాపు లేనట్లే కనపడుతుంది. దీంతో భూమి మీద అనేక విపత్తులు సంభవిస్తున్నాయి. అడవుల నరికివేత, వివిధ రకాల కాలుష్యాలు పెరగటం, ఆధునీకరణ పేరుతో కాంక్రీట్‌ నగరాలు జనాభాతో కిటకిట లాడడం, ఫెర్టిలైజర్లు, పెస్టిసైడ్స్‌ వలన భూగర్భ జలాల కలుషితం కావడం, అవసరాలకు మించి భూగర్భ జలాలు తోడి వేయటం, ప్లాస్టిక్‌ వాడకం పెరగటం మొత్తం జల వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్నది. దీనికి తోడు, చెరువులు కుంటలు బావులు అక్రమాలకు గురవడం వల్ల భూగర్భ జలాలు కనిష్ట స్థాయికి పడిపోయినాయి. దీంతో మొత్తం మెట్రో నగరాల్లో తాగునీటికి కటకట ఏర్పడింది. బిందెడు నీళ్లు కోసం గంటల తరబడి వేచి చూసే పరిస్థితి. దీనికి కారణం మానవ తప్పిదాలే అని ఇకనైనా అందరూ గుర్తించాలి. గ్రహించాలి.
దక్షిణ ఆఫ్రికా రాజధాని కేప్‌ టౌన్‌ ఎంత నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నదో…ఆ మాదిరిగా మన దేశంలోని చాలా నగరాలు, పట్టణాలు నీటి బాధిత నగరాలుగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, దేశ రాజధాని న్యూఢిల్లీ మంచినీటి కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం భూగర్భ జలాలు అడుగంటి పోవడమే. నీటి వినియోగం పెరగడం. బోరుబావులు ఎక్కువగా వేయడం. మరీ ముఖ్యంగా గ్లోబల్‌ వార్మింగ్‌ వలన వాతావరణ మార్పులు సంభవిస్తూ, కాలాలు గతులు తప్పుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలో పగటి ఉష్ణోగ్రతలు భారిగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కూడా గత 120 సంవత్సరాల రికార్డు ఉష్ణోగ్రతలను బ్రేక్‌ చేసి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. భవిష్యత్తులో మరింత నీటి ఎద్దడిని ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు, స్థానిక పాలనా యంత్రాంగం, నీటి వనరుల శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా అడవులు రక్షించుకోవాలి. మొక్కలు పెంచాలి. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. బోరు బావులుపై నియంత్రణ ఉంచాలి. పట్టణ పరిపాలన శాఖ, టౌన్‌ ప్లానింగ్‌, నీటి సరఫరా వ్యవస్థ పకడ్బందీగా పనిచేయాలి. ప్రతీ పౌరుడు నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి. నీటిని వృధా చేయరాదు. చెరువులు, కుంటలు పూడికలు తీయాలి. అక్రమాలను తొలగించాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నియమనిబంధనలను అనుసరించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి. ప్రకృతి వనరుల దోపిడిపై నిఘా పెంచాలి. వ్యర్ధాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. వలసలు నియంత్రణ చేయగలిగితే చాలావరకూ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో, సహకారంతో పనిచేయటం ద్వారానే నీటి సమస్యలను అధిగమించగలం. అదే విధంగా రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ సక్రమంగా జరగాలి. నదులు కాలుష్యం తగ్గించాలి. పూడికలు తీయాలి. కాలువలు చెరువుల నిర్వహణ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అన్ని ప్రాంతాల్లో లభించే విధంగా పరిశ్రమలు, వ్యవస్థలు నెలకొల్పటం ద్వారా, ఒకే చోట జనాభా కేంద్రీకరణ తగ్గించటం ద్వారా మెట్రో నగరాల్లో జనాభా పెరుగుదలను నియంత్రించగలుగుతాం. తద్వారా అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. తగు విధంగా ఇకనైనా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
– రావుశ్రీ

➡️