మలేరియా కట్టడిలో మనం

Apr 25,2024 04:46 #editpage

ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఏప్రిల్‌ 25న ‘ప్రపంచ మలేరియా దినం’ నిర్వహిస్తున్నాయి. ప్రపంచ దేశాలు 2000 సంవత్సరం నుంచి మలేరియా నిర్మూలన, రోగ నిర్ధారణ, వైద్య రంగాల్లో గుణాత్మక ఫలితాలను సాధించి పిల్లలతో పాటు పెద్దలనూ మలేరియా నుంచి కాపాడుకుంటున్నాయి. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 106 దేశాల్లో 330 కోట్ల మంది మలేరియా అంచున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 2021లో విశ్వవ్యాప్తంగా 6.27 లక్షల మలేరియా కారణ మరణాలు సంభవించడం విచారకరం.
ప్రపంచ దేశాలు మలేరియా నిర్మూలనకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని, కొన్ని దేశాలు ‘మలేరియా రహిత దేశాలు’గా ప్రకటించబడ్డాయని ఐక్యరాజ్యసమితి అభినందన పూర్వకంగా హర్షాన్ని వ్యక్తం చేసింది. వరుసగా మూడేళ్ల పాటు మలేరియా కేసులు నమోదుకాని దేశాలను ‘మలేరియా రహిత దేశాలు’గా ఐరాస ప్రకటిస్తున్నది. 2007లో యూఏఈ, 2016లో శ్రీలంక లాంటి 9 దేశాలు, నేడు 43 దేశాలను ఐరాస జీరో మలేరియా దేశాలుగా ప్రకటించింది. 2025 నాటికి మరి కొన్ని దేశాలు మలేరియా రహిత దేశాల జాబితాలో చేరేందుకు పటిష్టమైన కార్యాచరణ అమలు పరుస్తున్నాయి. 2019లో మలేరియా కేసులు బయటపడుతున్న 87 దేశాల్లో 46 దేశాలు 10 వేల కన్నా తక్కువ కేసులను నమోదు చేశాయని, 2000లో 26 దేశాలు మాత్రమే ఉన్నాయని ఐరాస గుర్తుచేసింది. 2020 నాటికి మరో 24 దేశాలు గత మూడేళ్లుగా మలేరియా కేసులు నమోదు కాలేదని, వీటిలో 11 దేశాలు మలేరియా రహిత దేశాల జాబితాలో చేరాయని వివరించింది. చైనా, ఇరాన్‌, మలేషియా లాంటి మరో 8 దేశాలు 2020 నాటికి ‘జీరో మలేరియా’ దేశాలుగా గుర్తింపు పొందాయి. భూటాన్‌, కోస్టారికా, నేపాల్‌లు ఏడాదికి 100 లోపు కేసుల నమోదుతో మలేరియా రహిత దేశాల జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి.
2027 నాటికి ఇండియా ‘మలేరియా రహిత దేశం’గా వుండాలన్నది మన లక్ష్యం. మలేరియాకు కారణమైన దోమ కాటును నివారించడం ప్రథమ కర్తవ్యంగా బావించాలి. దోమ కాటు నివారణకు దోమ తెరలు, దోమలను వికర్షించే క్రీమ్‌లు/ ద్రవాలు/కాయిల్స్‌/మ్యాట్స్‌ వాడటం, శరీరాన్ని కప్పేలా దుస్తులు ధరించడం, తలుపులు కిటికీలకు ఇనుప నెట్లు అమర్చుకోవడం లాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మురికి నీటి నిల్వలు లేకుండా స్వచ్ఛ భారత్‌ నిర్వహించడం లాంటివి మలేరియా నిర్మూలనకు దోహదపడతాయి.
మలేరియా నివారించదగిన వ్యాధి. సరైన అవగాహనతో అడ్డుకట్ట వేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మలేరియా సోకినా భయపడకుండా అందుబాటులో ఉన్న సరైన చికిత్సతో సకాలంలో వైద్య సలహాలు తీసుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది. కరోనా విపత్తు విజృంభణతో మలేరియా లాంటి వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చని మరువరాదు. మలేరియాను సమర్థవంతంగా కట్టడి చేయడానికి దోమల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత, వ్యాధి నిర్థారణ, సరైన చికిత్సల పట్ల ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవడంతో పాటుగా అవసర నిధుల కేటాయింపు సమయానుకూలంగా జరగాలి. మలేరియాకు చికిత్స కన్న నివారణే సులభమని గమనిస్తూ, మలేరియా రహిత భారతదేశ నిర్మాణంలో మనందరం చేయి చేయి కలిపి ఆరోగ్య భారతాన్ని సుసాధ్యం చేద్దాం.

– డా|| బుర్ర మధుసూదన్‌ రెడ్డి, సెల్‌ : 9949700037

➡️