ఆకాంక్షలు నెరవేర్చాలి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రజా సమక్షంలో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. 17 మంది కొత్త వారితో సహా 24 మందితో తన మంత్రి మండలి జట్టును కూడా ప్రకటించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా విచ్చేసి, కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ సమయంలో కార్యకర్తల హర్షాతిరేకాలతో సభాప్రాంగణం మార్మోగిపోయింది! జూన్‌ 4న టిడిపి కూటమి విజయ కేతనం ఎగురవేయడంతో మొదలైన కూటమి శ్రేణుల సందడి నిన్నటి ప్రమాణ స్వీకారంతో పతాకస్థాయికి చేరింది. గురువారం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి, కొన్ని ఎన్నికల వాగ్దానాలపై తొలి సంతకాలు చేయడంతో పాలనాపర్వం మొదలైంది. వివిధ తరగతుల ప్రజలు పెట్టుకున్న ఆశలను, ఆకాంక్షలనూ నెరవేర్చే విధంగా కొత్త ప్రభుత్వం ఇక ముందుకు సాగవల్సి ఉంటుంది. నిరంకుశ విధానాలు, ప్రజలపై భారాలూ అమలు చేస్తే జనం ఎలా స్పందిస్తారో గత ప్రభుత్వ అనుభవాన్ని సదా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.
విభజిత రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబుకి, ఆయన మంత్రివర్గానికి ఇది చాలా బాధ్యతాయుత కాలం. రాష్ట్రం విడివడి పదేళ్లు గడచిపోయాక కూడా విభజన హామీలు నెరవేరలేదు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునివ్వాల్సిన కేంద్రంలో ఈ పదేళ్లూ బిజెపియే అధికారంలో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల వ్యవధిలోనే ప్రత్యేక హోదా హామీకి మోడీ షా ప్రభుత్వం మంగళం పాడేసింది. మనం హక్కుగా పొందాల్సిన విభజన హామీలు చూస్తుండగానే తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యాయి. రైల్వే జోను మంజూరు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, వివిధ సంస్థల ఏర్పాటు వంటి కీలక బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా తప్పుకొంది. తరువాత అధికారంలోకి వచ్చిన జగన్‌ మూడు రాజధానుల జపం చేసినప్పుడు మోడీ ప్రభుత్వం గోడ మీద పిల్లిలా అవకాశవాదాన్ని ప్రదర్శించింది. తన వైఖరిని స్పష్టం చేయకుండా నాన్చి, రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని త్రేన్చి, రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసింది.
అలాంటి బిజెపి ఇప్పుడు చంద్రబాబు మద్దతు తప్పనిసరైన పరిస్థితుల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒకరికొకరు చాలా కీలకమూ, అవసరమూ అన్నంత ప్రదర్శన మోడీ – చంద్రబాబుల్లో బయటికి బ్రహ్మాండంగా కనిపిస్తోంది. 2014లో వలె రాష్ట్రంలో బిజెపి అధికారాన్ని పంచుకుంటుంటే, కేంద్రంలో టిడిపి మంత్రిపదవులను అంది పుచ్చుకొంది. అయితే, బిజెపి సహజంగానే తన మిత్రులకు సమాన ప్రాతినిథ్యం ఇవ్వదని, సంపూర్ణ విశ్వాసం చూపదని అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అనుభవం. గతంలో చంద్రబాబు కూడా దీనిని చవి చూశారు కాబట్టి, అప్రమత్తంగా ఉండాలి.
రాష్ట్ర ప్రభుత్వం తొలినాళ్ల నుంచీ రాష్ట్ర ప్రయోజనాలే ప్రప్రథమ ప్రాధాన్య బాధ్యతగా తలకెత్తుకొని పనిచేయాలి. కేంద్ర బిజెపి మన రాష్ట్రానికి చేయాల్సింది చేయకపోగా, తెలుగు జాతి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కార్పొరేటు పరం చేయటానికి పూనుకొంది. ఏళ్ల తరబడి మొక్కవోని దీక్షతో ఉక్కు కార్మికులు సాగిస్తున్న నిరవధిక పోరాటమే దానిని ఇన్నాళ్లూ భద్రంగా ఉంచగలిగింది. చంద్రబాబు ప్రభుత్వం పూనుకొని, విశాఖ ఉక్కును ప్రభుత్వరంగంలోనే నిలబెట్టి, సొంత గనులూ సాధించాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా అన్ని విభజన హామీలూ ఆచరణలోకి వచ్చేలా నిక్కచ్చిగా, నిరంతరాయంగా పనిచేయాలి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, నిర్వాసితులకు సంపూర్ణంగా పరిహారం, పునరావాసం కల్పన వంటి కీలక బాధ్యతలను నెరవేరుస్తూనే- ఎన్నికల ప్రాంగణంలో ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలనూ అమలు చేయాలి. మోడీ షాల మాటల మాయోపాయంలో కాలహరణం జరిగిపోకుండా తొలిరోజు నుంచీ న్యాయబద్ధమైన రాష్ట్ర హక్కుల కోసం, ప్రకటిత హామీల అమలు కోసం గొంతెత్తాలి. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఎన్‌టి రామారావు స్థాపించిన పార్టీ రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు గట్టిగా పనిచేయాలి.

➡️