మరోసారి ‘వ్యూహం’ సినిమాకు బ్రేక్‌…!

Jan 22,2024 12:53 #breaking, #movie, #once again, #Vyuham

అమరావతి : వ్యూహం సినిమాకి సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. మరికొన్ని నెలల్లో ఎపిలో రాబోయే ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందన్నది పిటిషనర్ల అభియోగం. ఈ కారణంగా వ్యూహం సినిమా రిలీజ్‌ పై స్టే ఇవ్వాలని కోరుతున్నాం అంటూ న్యాయస్థానంలో వాదనలు సాగాయి. కానీ.. స్టేకు నిరాకరించిన హైకోర్టు.. ఈ సినిమా పై విచారణ కొనసాగిస్తోంది. తాజాగా మరోసారి వ్యూహం సినిమాకు హైకోర్టు బ్రేక్‌ వేసింది.

నిజానికి వ్యూహం మూవీ నవంబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది. సినిమా కంటెంట్‌ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ … టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సెన్సార్‌ బోర్డును ఆశ్రయించారు. దీంతో వ్యూహం రిలీజ్‌ వాయిదా పడక తప్పలేదు. తర్వాత సినిమాను చూసిన జదీఖీజ విడుదలకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఆమేరకు డిసెంబర్‌ 29న వ్యూహం రిలీజ్‌ డేట్‌గా ఫిక్స్‌ చేశారు దర్శక-నిర్మాతలు. కానీ.. వ్యూహం సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు లోకేష్‌. టిడిపి తరపున మురళీధర్‌ రావు వాదనలు వినిపించారు. చంద్రబాబు, పవన్‌ తనకు నచ్చరంటూ .. డైరెక్టర్‌ వర్మ బహిరంగంగా చెప్పిన మాటల్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ సినిమా కేవలం రాజకీయ దురుద్దేశంతో తీసిందని, దీని వెనుక సిఎం జగన్‌ ప్రత్యక్ష ప్రమేయం ఉందని వాదించారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.

తాజాగా వ్యూహం సినిమా సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ సస్పెన్షన్‌ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది. మూడు వారాలపాటు సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ సస్పెన్షన్‌ పొడగిస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది. వ్యూహం సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్‌ బోర్డు సబ్యుల కమిటీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని దాసరి కిరణ్‌కుమార్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎన్నికల పై వ్యూహం సినిమా ప్రభావం ఉంటుందని అనుకుంటే కనీసం తెలంగాణలోనైనా సినిమాను రిలీజ్‌ అయ్యేలా చూడాలని హై కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీని పై లోకేష్‌ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

➡️