ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‌ మూవీ రివ్యూ

Dec 8,2023 18:19 #movie

 

టాలీవుడ్‌ హీరో నితిన్‌, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ చిత్రాన్ని వక్కంతం వంశీ తెరకెక్కించారు. దర్శకుడు, హీరో నితిన్‌కి చాన్నాళ్లుగా సరైన హిట్‌ లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం డిసెంబర్‌ 8వ తేదీన విడుదలైంది. మరి ఈ చిత్రంతోనైనా దర్శకుడు, హీరో ప్రేక్షకులను మెప్పించారో లేదో తెలుసుకుందామా..!

కథ అభినవ్‌ (నితిన్‌) ఓ జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తుంటాడు. సినిమాలో హీరోగా నటించాలని అభి కోరిక. ఎంత ప్రయత్నించినప్పటికీ సినిమాల్లో అవకాశాలు రావు. ఓసారి తండ్రికి యాక్సిడెంట్‌ అవ్వడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఓ కంపెనీకి ఉద్యోగానికి వెళతాడు. ఆ కంపెనీ సిఇఓ లిఖిత (శ్రీలీల)ని అభి ప్రేమిస్తాడు. ఉద్యోగంలో పైకెదుగుతూ.. ఆ కంపెనీకి సిఇఓ అయ్యే సమయంలోనే ఓ డైరెక్టర్‌ అభికి హీరోగా అవకాశమిస్తాడు. దీంతో అతను సిఇఓ పోస్టును, తన ప్రేమను కూడా వదిలి హీరోగా యాక్ట్‌ చేయడానికి వెళతాడు. తీరా అక్కడికెళ్లిన తర్వాత అభికి నిరాశే ఎదురవుతుంది. తాను రియల్‌గా హీరోగా ఎలివేట్‌ కావడానికి అభి ప్రయత్నిస్తాడు? ఆర్డినరీ పర్సన్‌… ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌ కావడానికి చేసే ఆ ప్రయత్నంలో తాను సక్సెస్‌ అయ్యాడా? లేదా? అభి, లిఖితలు మళ్లీ ఒక్కటయ్యారా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమాని చూడాల్సిందే.

విశ్లేషణ అల్లూ అర్జున్‌ హీరోగా ‘నా పేరు సూర్య’ సినిమాని దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించారు. ఈ చిత్రం డైరెక్టర్‌గా వంశీకి తొలి చిత్రం. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రం తర్వాత వంశీ చాలా ఏళ్లు గ్యాప్‌ తీసుకుని ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక సినిమా విషయానికొస్తే.. ఫస్టాఫ్‌ అంతా డైరెక్టర్‌ కామెడీతో నడిపించాడు. జూనియర్‌ ఆర్టిస్టుగా నితిన్‌ పరిచయం, సెట్‌ కష్టాలు ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. సిఇఓగా లిఖిత పరిచయం, ప్రేమ వంటి సన్నివేశాలు సాదాసీదాగా ఉన్నాయి. తల్లి రోహిణి, తండ్రి రావు రమేష్‌లు చేసే కామెడీ నవ్వులు పూయిస్తాయి. విలన్‌ పాత్ర కూడా పెద్దగా ఎలివేట్‌ కాలేదు. ఆ పాత్ర పరిచయం బాగున్నా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక సెకండాఫ్‌లో హీరో విలన్‌తో తలపడడం కోసం దొంగ పోలీసుగా అభి కోటియా గ్రామంలో అడుగుపెట్టడం.. ఆ తర్వాత అతను చేసే హంగామా ఓవర్‌గా అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో పోలీస్‌ ఎవరనే దానిపై ఐజి విజరు చక్రవర్తి (రాజశేఖర్‌) ఎంట్రీ అదిరిపోతుంది. క్లైమాక్స్‌ గందరగోళంగా ఉంది. ద్వితీయార్థంలో కథ పట్టు సడలింది. దీంతో ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. ఓవరాల్‌గా ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వెళితేనే బెటర్‌. ఓసారి చూసిరావొచ్చు. నితిన్‌ బాగా నటించాడు. శ్రీలీల పరవాలేదు. రావురమేష్‌, రోహిణి కామెడీ హైలెట్‌. సుదేవ్‌ నాయర్‌ విలనిజం పరవాలేదు. హారిస్‌ జయరాజ్‌ పాటలు వినసొంపుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

➡️