డబ్బుల్లేక లారీలకు పెయింట్స్‌ వేశాను : బ్రహ్మానందం

ఇంటర్నెట్‌డెస్క్‌ : చదువుకునే రోజుల్లో డబ్బుల్లేక లారీలకు పెయింట్‌ వేశానని ప్రముఖ కమెడియన్‌ బ్రహ్మానందం తాజాగా రాసిన పుస్తకంలో రాశారు. బ్రహ్మానందం ఇటీవల తన ఆటోబయోగ్రఫీగా ‘నేను మీ బ్రహ్మానందం’ అనే పుస్తకాన్ని రాశారు. మార్కెట్లో విడుదలైన ఈ పుస్తకంలో ఇప్పటివరకు తన గురించి తెలియని ఎన్నో విషయాలను పాఠకులకు తెలిపారు. ముఖ్యంగా తాను ఎవరి సహాయంతో చదువుకున్నది బ్రహ్మానందం చెప్పారు.

అనసూయమ్మ అనే టీచర్‌ సహాయంతో బ్రహ్మానందం చదువుకున్నారట. ఆమెతో పాటు మిగిలిన టీచర్లు కూడా తన చదువుకు ఎంతో సహాయం చేశారని బ్రహ్మానందం తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఆయనకు చదువే కాదు.. కళలపై కూడా మక్కువ ఎక్కువ. డిగ్రీ చదివే రోజుల్లో నాటకాలు, మిమిక్రీ ప్రోగ్రామ్స్‌ చేస్తూ చదువుకున్నారట. డిగ్రీ బి.ఎ తెలుగు పూర్తయ్యాక ఎం.ఎ పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేయడానికి బ్రహ్మానందం దగ్గర డబ్బుల్లేవట. అయితే వైజాగ్‌ ఆంధ్ర యూనివర్సిటీ ఆ సమయంలోనే గుంటూరులో పీజీ సెంటర్‌ ఓపెన్‌ చేయడంతో అక్కడ సీటు కోసం ప్రయత్నిస్తే.. తన కళని, కామెడిని చూసి ఎం.ఎ తెలుగులో ఫ్రీ సీట్‌ ఇచ్చారని పుస్తకంలో రాసుకొచ్చారు. చదువు కోసం ఫ్రీ సీట్‌ వచ్చినా.. అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకునేంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో గుంటూరులోని నల్లపాడులో చిన్న గదుల్లో అద్దెకు ఉండి చదువును కొనసాగించానని, ఆ సమయంలో కూడా అనసూయమ్మ గారు తనకు ఎంతో సహాయం చేశారని తన పుస్తకంలో రాసుకొచ్చారు. అద్దె డబ్బులను, భోజనానికి అయ్యే ఖర్చులను మొత్తం అనసూయమ్మగారిని అడగలేక.. కనీసం భోజనానికి అయినా ఏదో ఒక పనిచేసి సంపాదించుకుందామని, లారీలకు పెయింట్స్‌ వేశానని బ్రహ్మానందం చెప్పారు. ఉదయం కాలేజీకి వెళ్లిరావడం, సాయంత్రం పాత బట్టలు వేసుకుని లారీలకు పెయింట్‌ వేశానని రాసుకొచ్చారు. అయితే నెల జీతంగా కాకుండా పనిని బట్టి ఐదు రూపాయలు ఇచ్చేవారని బ్రహ్మానందం పుస్తకంలో తెలిపారు. 1970ల్లో ఐదు రూపాయలు ఎక్కువే అని చెప్పారు. తెరపై బ్రహ్మానందాన్ని చూసి ఎంత నవ్వుకుంటారో.. ఈ పుస్తకంతో తాను పడిన కష్టాలను తెలిపి కన్నీళ్లు తెప్పించారు.

➡️