“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” ట్రైలర్ విడుదల

Feb 28,2024 16:09 #movies, #released, #triler

వెంకట శివ సాయి పిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ముత్యాల రామదాసు, నున్నా కుమారి సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి”. నూతన తారలు రవితేజ నున్నా హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా నటించారు. యువ ప్రతిభావంతులు కలిసి రూపొందిస్తున్న “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు విశేష స్పందన లభించింది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారం ‘రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది.

కామెడీ, సస్పెన్స్ ల కలబోత “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” ట్రైలర్

ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం ముందునుంచి చెబుతున్నట్టుగానే “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” ట్రైలర్ ఎంతో వైవిధ్యంగా ఉంది. లవ్, కామెడీ, సస్పెన్స్ వంటి అంశాలతో రూపొందిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పల్లెటూరు నేపథ్యంలో సాగే హాస్య సన్నివేశాలతో వినోదభరితంగా ట్రైలర్ ప్రారంభమైంది. నాయికా నాయకుల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మెప్పించాయి. సాఫీగా సాగిపోతున్న ట్రైలర్ కథానాయిక హత్యతో ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ ను ముగించిన తీరు కట్టిపడేసింది.

➡️