డ్రైవర్లను జైళ్ళకు పంపే చట్టాన్ని రద్దు చేయాలి 

ఎల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్

కోట జంక్షన్ వద్ద నిరసన
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డ్రైవర్లను క్రిమినల్స్ ను చేస్తూ ఐదేళ్లు జైలు శిక్ష పడే విధంగా కేంద్ర ప్రభుత్వం జులై ఫస్ట్ నుంచి అమలు చేస్తున్న భారత న్యాయ సంహిత చట్టం 106 (1&2) లను తక్షణమే నిలిపివేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఏ.జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. స్థానిక కోట జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు బిఎంఎస్ అమలు నిలిపి వేస్తున్నట్లు మోడీ ప్రకటించి, 3వ సారి అధికారంలోకి రాగానే జూలై 1 నుంచి అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నూటికి 90%మంది రవాణా రంగంలో ఓనర్ కమ్ డ్రైవర్ గా సొంత వాహనాలు ‌నడుపుతున్నారని, వారందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలంగా పోరాడుతుంటే స్పందించని‌ మోదీ, డ్రైవర్లను క్రిమినల్స్ చేసే చట్టం మాత్రం సంఘాలు, సంస్థలు అభిప్రాయం తెలుసుకోకుండా, ప్రజలకు అవగాహన కల్పించ కుండానే అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అమల్లోకి వచ్చిన తరువాత అవగాహన మోసం తప్ప మరొకటి కాదన్నారు. సరుకు, ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషించి, వేళ కోట్లు ఆదాయం సమకూర్చుతున్న రవాణా రంగ కార్మికులను ప్రమాదాలకు బాధ్యులను చేయటం, నేరస్తులు గా చిత్రీకరించటం బాధాకరం అన్నారు. డీజీల్ ధరలో పై 16% రోడ్డు భద్రత కోసం కడుతున్నారని, అయినా టోల్ ఛార్జీలు బాదుతున్నారని, అయినా రోడ్లు అస్తవ్యస్తంగానే ఉన్నాయని ప్రమాదాలకు డ్రైవర్లు ఎలా బాధ్యులని ప్రశ్నించారు. ప్రైవేటు ఏజెన్సీలకు లైసెన్స్ ఇచ్చే అవకాశం కల్పించి, ఓట్ల అభివృద్ధిని కార్పొరేట్లకు అప్పజెప్పి, ట్రాన్స్పోర్ట్ లో గుత్తాధిపత్యం కోసం అగ్రి గ్రేటర్ లను అనుమతించి, డ్రైవర్లను శిక్షించడం, 5 సంవత్సరాలు జైలుకు పంపడం రవాణా రంగాన్ని దెబ్బ తీయటమే అన్నారు. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బి. రమణ, నగరు ఉపాధ్యక్షులు త్రినాథ్, ఆటో యూనియన్ నాయకులు శ్రీను, నర్సింగరావు, తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️