కర్నాటక సంగీతంలో సమానత్వ స్వరం

Mar 27,2024 05:06 #Jeevana Stories

టిఎం కృష్ణగా అతడు ప్రసిద్ధుడు. తోడూరు మాడభూషి కృష్ణ అనేది అతడి పూర్తి పేరు. కర్ణాటక సంగీత కళాకారుడు. తన గాన మాధుర్యంతో శ్రోతలను సంగీత సాగరంలో ముంచెత్తగలిగిన విశేష ప్రావీణ్యం ఉన్నవాడు. చిన్న వయసులోనే దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలూ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానం సంపాదించుకున్న వాడు. 2016లో రామన్‌ మెగససే పురస్కారం సహా అనేక గౌరవాలూ, పురస్కారాలూ పొందినవాడు. అతడు ఎక్కడైతే సంగీత సాధన చేశాడో, ఏ వేదిక మీద అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందాడో – ఆ వేదిక మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ అతడికి ‘సంగీత కళానిధి’ పురస్కారాన్ని ప్రకటించింది. కృష్ణకు ఈ గౌరవాన్ని ప్రకటించటం పట్ల కొందరు సాంప్రదాయ సంగీత కళాకారులు తీవ్ర నిరసన తెలిపారు. అతడి ధోరణి, వ్యవహార శైలీ సంగీత సామ్రాజ్యానికి అవమానకరమని వారు గొంతెత్తారు.
వారెందుకు అంతగా గాయపడ్డారు?
కృష్ణ వ్యవహార శైలి వారిని ఎందుకు అంతగా బాధపెడుతోంది?
ఈ సంగతులు తెలియాలంటేా సంగీత ప్రాంగణాన్ని దాటి, సామాజిక, చారిత్రిక వర్తమానంలోకి తొంగిచూడాలి. కృష్ణ అలాగే చూస్తాడు. కళ్లు మూసుకొని, తాదాత్మ్యంతో సంగీతం పాడి, చప్పట్లు అందుకొని మురిసిపోయే రకం కాదు, అతడు. తన చుట్టూ జరుగుతున్నది వాస్తవమని తలుస్తాడు. అది మంచో, చెడ్డో తన దృక్కోణంలోంచి విశ్లేషిస్తాడు. ఎవరో బాధపడతారని, ఇంకెవరో గాయపడతారని తన భావాలను తనలోనే దాచుకోడు. మర్యాదలు పోతాయనో, మన్ననలు మందగిస్తాయనో అనుకోడు. సాంప్రదాయ సంగీతాన్ని దాటి, సామాజిక పరిణామాలు అన్నిటిపైనా స్పందిస్తాడు. అవసరమైతే సూటిగా ప్రశ్నలు సంధిస్తాడు.
సాంప్రదాయ సంగీతంలో కులాధిపత్యం పీఠం వేసుకొని కూర్చొందని, అది పోవాలని కుండబద్దలు కొట్టినట్టు చెబుతాడు కృష్ణ. త్యాగరాజు రాసిన గీతాల్లో సైతం ఈ కాలానికి పనికి రాని భావాలు ఉన్నాయని, వాటిని ఇప్పుడు పాడుకోవడం అనవసరమని శతభిషలు లేకుండా తేల్చిపారేస్తాడు. కుల నిర్మూలన ఉద్యమకారుడు పెరియార్‌ భావజాలాన్ని ప్రేమిస్తాడు. పెరుమాళ్‌ మురుగన్‌ కవిత్వాన్ని సంగీత ప్రదర్శన మధ్యలో గొంతెత్తి వినిపిస్తాడు. తమిళనాడులో కొందరు అంబేద్కర్‌, గాంధీ, లెనిన్‌, పెరియార్‌ విగ్రహాలను ధ్వంసం చేసినఫ్పుడు, అవమానించినప్పుడు- గట్టిగా ఖండించాడు. సమానత్వ భావాలు వర్థిల్లాలని, సంకుచిత, స్వార్థ, కులాధిపత్య. మతాధిపత్య భావాలు సమసిపోవాలని చాటిచెప్పాడు. ఇదిగో … ఈ భావాలే కొంతమంది సాంప్రదాయవాదులకు మింగుడుపడలేదు. ఆధిపత్యం పోవాలని కృష్ణ కోరుకోవటాన్ని- సంగీతాన్ని అవమానించటంగా వారు ప్రచారం చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? కృష్ణ అంటున్నట్టుగానే- ఆ సంగీతంలో కులాధిపత్యం తిష్ట వేసుకుకూచొందని.
తొలినుంచీ అభ్యుదయ పథం
కృష్ణ 1976 జనవరి 22వ తేదీన మద్రాసులో పుట్టాడు. తల్లి ప్రేమ, తండ్రి రంగాచారి కర్నాటక సంగీత విద్వాంసులే! తల్లిది సామాజిక దృక్పథం గల కుటుంబం. ఆమె తన సోదరుడు డాక్టర్‌ శ్రీరామ్‌ సుబ్రహ్మణ్యం కలిసి అనైకట్టిలో ‘విద్యావనం’ పేరిట ఓ పాఠశాలను స్థాపించి, ఎంతోమంది పేద, గిరిజన విద్యార్థులు చదువు చెప్పారు. కృష్ణ తాత గారు టిటి కృష్ణమాచారి మన దేశానికి ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కృష్ణకు ‘సంగీత కళానిధి’ పురస్కారం అందించిన మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ వ్యవస్థాపకుల్లో ఆయన కూడా ఒకరు. కృష్ణ చదువంతా మద్రాసులోనే సాగింది. సంగీతంతో పాటు ఆర్థికశాస్త్రంలో కూడా పట్టభద్రుడు అయ్యాడు. 12 ఏళ్ల వయసు నుంచి సంగీత ప్రదర్శనలు ఇస్తూ, గొప్ప ప్రతిభావంతుడిగా పేరు పొందాడు. 1997లో సంగీతను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా కర్నాటక సంగీత విద్వాంసురాలు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
కృష్ణ కళ్లు మూసుకొని, హాయిగా సంగీతం పాడుకుంటూ సాగిపోతే, అతడి వైదుష్యానికి ఎన్నెన్నో గౌరవలూ పురస్కారాలూ వచ్చి ఒళ్లో వాలిపోతాయి! కానీ, చిన్నప్పటినుంచీ కృష్ణ అలా లేడు. కేవలం సంగీతకారుడిగా మిగిలిపోలేదు. విస్తారంగా, విమర్శనాత్మకంగా చదువుతాడు, రాస్తాడు. హిందూ, ది వైర్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఔట్‌లుక్‌ వంటి ఆంగ్ల పత్రికలకు వ్యాసాలు రాస్తాడు. పుస్తకాలూ రాస్తాడు. వివిధ సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గంటాడు. సభల్లో అనర్గళంగా మాట్లాడతాడు.
జనం గొంతుకగా …
తమిళనాడులో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా గొంతెత్తాడు కృష్ణ. సభల్లో మాట్లాడాడు. పాడాడు. ఎల్‌జిబిటిల హక్కుల కోసం ఆ బృందాలకు మద్దతుగా నిలిచాడు. సినిమాల్లో, సంగీత అకాడమీలో లైంగిక వేధింపుల గురించి మహిళలు మాట్లాడినప్పుడు- వారికి సంఘీభావంగా స్వరం వినిపించాడు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న అన్నదాతలకు అండగా తన గొంతు పలికించాడు. ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించి, మోడీ ప్రభుత్వ మొండివైఖరిని నిరసించాడు. కాశ్మీరు పౌరుల హక్కులను హరించే చర్య అని 370 ఆర్టికల్‌ రద్దుని విమర్శించాడు. పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ అమానుష దాడులను ఖండించాడు. దాడులకు ముందు నిర్ణయమైన ఇజ్రాయెల్‌లో తన ప్రదర్శనను రద్దు చేసుకున్నాడు. ”మ్యూజిషియన్స్‌ ఫర్‌ పాలస్తీనా” ప్రతిజ్ఞపై తన సంఘీభావ సంతకం చేశాడు. కేరళలో హిందూమతానికి ప్రమాదం వాటిల్లుతుందని బిజెపి చేస్తున్న విష ప్రచారానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ”బిజెపిది విద్వేష ప్రచారం. విధ్వంస విధానం. అది మన సామరస్యాన్ని దెబ్బ తీస్తోంది. మన సమైక్య సంస్క ృతిని నాశనం చేస్తోంది. అప్రమత్తంగా ఉందాం. ” అంటూ 2019 ఎన్నికల్లో కేరళలో ప్రచారం చేశాడు.

అతడిది సమతా రహదారి!
ఇన్నిన్ని కారణాల చేత కొంతమంది విచ్ఛిన్నవాదులకు టిఎం కృష్ణ కంట్లో నలుసయ్యాడు. ఎప్పటినుంచో కుతకుతలాడుతున్నారు. ”సంగీత కళానిధి ” పురస్కార ప్రదానాన్ని ఒక నెపంగా తీసుకొని కర్ణాటక సంగీత కళాకారులైన రంజని, గాయత్రి అనే అక్కాచెల్లెళ్లు సంగీతాన్ని అవమానించినవాడికి పురస్కారం ఇవ్వడం తగదు అంటూ అకాడమీకి నిరసన లేఖ రాశారు. వారికి తమిళనాడు బిజెపి శాఖ మద్దతు తెలిపింది. వారెవరూ కృష్ణ అర్హతను ప్రశ్నించలేరు. ప్రావీణ్యాన్ని శంకించలేరు. ఎందుకంటే- అతడి గొంతు ప్రత్యేకం, ఏ రాగాన్నయినా అద్భుతంగా, అలవోకగా పలికించగల ప్రతిభా సంపన్నం. ”సంగీతం ప్రజలందరిదీ. దానిని అలా మార్చటానికి కృషి చేస్తున్న మహా మనిషి టిఎం కృష్ణ..” అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. తనను విమర్శించినా, ప్రశంసించినా కృష్ణ పెద్దగా లెక్కలోకి తీసుకోడు. తనకు విస్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అతడు ఆధిపత్యాలను వ్యతిరేకిస్తాడు. కులం, మతం అనే గీతలను దాటి విశ్వమానవుడుగా ప్రవర్తిస్తాడు. బెదిరింపులకు వెరవడు, చెదరడు. ఎందుకంటే- అతడు మనుషులను మనుషులుగా ప్రేమిస్తాడు. వివక్షల్లేని సమానత్వాన్ని కాంక్షిస్తాడు.
– సత్యాజీ

➡️