అనగనగా ఓ కథ .. అనేక ప్రయోజనాలు

Apr 4,2024 04:30 #Jeevana Stories

వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటి నుండే పిల్లల గురించి పెద్దలు తెగ బెంగపడి పోతుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఒక ఎత్తయితే, ఇంటిపట్టునే ఉంచి ఆటలు ఆడించడం పెద్ద కసరత్తు లాంటిది. మరి ఏం చేయాలి? పిల్లలకు ఈ వేసవి సెలవులు ఎలా డిజైన్‌ చేయాలి?
సాధారణంగా పిల్లలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఆసక్తి చూపుతారు. ఈ కాలం పిల్లలకు ఆ చొరవ ఎక్కువే. అయితే ఫోన్లలో ఆ విషయాలు తెలుసుకునే పిల్లలే ఎక్కువ. మరి ఈ వేసవిని పిల్లలకు గుర్తుండిపోయేలా ఏం చేద్దాం?
కథలు పిల్లల్లో సంతోషాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తాయి. వారిలో సహజ సిద్ధంగా ఉండే కుతూహలాన్ని మరింతగా పెంచి, వివిధ అంశాల గురించి తెలుసుకోవాలనే కోరికను పెంచుతాయి. సద్గుణాలు, ఆలోచనా సామర్థ్యం, జ్ఞాపకశక్తి, ప్రశ్నించే ధైర్యం వంటి అనేక మానసిక సామర్థ్యాలు పెరుగుతాయి.
ఒకప్పుడు తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పిల్లలకు ప్రతిరోజూ పడుకునే ముందు కథ చెప్పేవారు. ఆ కథలు వింటూ పిల్లలు నిద్రలోకి జారుకునేవారు. ఈ వాతావరణం పిల్లలకు ఎన్నో దృగ్విషయాలను నేర్పిస్తుంది. అయితే కాలానుగుణంగా పిల్లలకు ఆ వాతావరణం దూరమైంది.
అయితే ఈమధ్య కాలంలో పిల్లలకు కథలు చెప్పడంపై ప్రాధాన్యత పెరుగుతోంది. కొందరు ప్రొఫెనల్‌ స్టోరీ టెల్లర్స్‌ స్కూళ్లు, కాలేజీలకు వచ్చి రకరకాల కథలు చెప్తున్నారు. ఏ వయసులో పిల్లలకు ఏ రకమైన కథలు చెప్పాలి, ఎలా చెప్పాలి అనే విషయాల్లో శిక్షణా కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. పిల్లలు ప్రతిరోజూ కథలు వినడం వల్ల వారిలో ఇమాజినేషన్‌, క్రియేటివిటీ పెరగడమే కాకుండా, క్రియేటివిటీకి కేంద్రస్థానమైన రైట్‌ బ్రెయిన్‌ యాక్టివేట్‌ కావడాన్ని చాలాకాలం కిందటే శాస్త్రవేత్తలు గుర్తించారు.
మంచి అలవాట్లు
ముఖ్యంగా చిన్న పిల్లలకు కథలు చెబుతున్నప్పుడు అందులోని పాత్రల గుణగణాలను, మంచీ చెడులను తేలికగా అర్థం చేసుకుంటారు. దీనివల్ల ప్రేమ, స్నేహం, జాలి, దయ, జ్ఞానం, నీతి, నిజాయితీ వంటి గుణాలను అర్థం చేసుకోవడంలో, అలవాటు చేసుకుంటారు. చిన్నతనంలో వారిలో నాటుకుపోయిన ఈ గుణాలు జీవితాంతం ఆచరణలో ఉంటాయి.
ఏకాగ్రత
పిల్లలు ఎక్కువసేపు ఒకే విషయంపై దృష్టి కేంద్రీకరించలేరు. వారి మనస్సు ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటుంది. కానీ కథలు చెప్పేటప్పుడు మాత్రం ఎంతో శ్రద్ధగా వింటారు. దీనివల్ల వారిలో ఏకాగ్రత శక్తి మెరుగుపడుతుంది. ఒక నిర్దిష్ట అంశంపై దృష్టిని ఎలా పెంచుకోవాలో నేర్చుకుంటారు. కథలు చెప్పడం విద్యాపరమైన అభ్యాసానికి ఒక మెట్టు.
జ్ఞాపకశక్తి
పిల్లల జ్ఞాపకశక్తిని పదును పెట్టడానికి కథ చెప్పడం ఒక అద్భుతమైన మార్గం. కథ వింటున్నప్పుడు అందులోని అంశాలకు సంబంధించిన ఇతర వివరాలు గుర్తుకు వస్తాయి. వాటికి సంబంధించిన వివరాలను అడిగి మరీ వారినుండి రాబట్టవచ్చు. దీనివల్ల వారు సంబంధింత విషయంపై ఎంత అవగాహన ఉందో వారికీ అర్థమౌతుంది.
సృజనాత్మకత
కథ వినడం వల్ల పిల్లల ఊహాశక్తి విపరీతంగా పరిగెత్తుతుంది. కథ వింటున్నప్పుడు అందులోని పాత్రలు, కథాంశం, సెట్టింగులు మొదలైన వాటికి సంబంధించిన ఊహలు కదలాడుతూ ఉంటాయి. కథలోని ప్రతి అంశాన్ని వివరిస్తూ, వర్ణిస్తూ చెప్పడం వల్ల పిల్లలు తమదైన రీతిలో సన్నివేశాలను ఊహించుకుంటారు. ఇది వారి సృజనాత్మకతను మెరుగుపరుస్తుంది. కొత్త ఆలోచనలకు రేకెత్తిస్తుంది. ఫోన్లలో కథలు చూస్తున్నప్పుడు తెరపైన వీడియో కనిపిస్తుంది కాబట్టి ఊహాశక్తి పనిచేయదు. ఇది కేవలం వినడం వల్లనే జరిగే ప్రక్రియ.
సాంస్క అతిక అవగాహన
పిల్లలకు కథలు చెప్పడం వల్ల వారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. వివిధ ప్రాంతాలు, విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, వాటి చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారికి తెలియని కొత్త కొత్త పదాలు, వాటికి అర్థాలు నేర్చుకుంటారు. దీనివల్ల చక్కటి పదజాలం, భాషాజ్ఞానం అలవడుతాయి.
భావవ్యక్తీకరణ
పిల్లలకు కథలు చదవడం, వినడం ద్వారా వారి భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతుంది. తమ ఆలోచనలు, భావాలను ఇతరులతో పంచుకోగలుతారు. కథలు చెప్పేటప్పుడు మధ్యలో పిల్లలను ప్రశ్నలు అడిగినప్పుడు ఆలోచిస్తారు, ఎదుటివారితో చర్చిస్తారు. తెలియని వాటిని అడిగి తెలుసుకోవాలనే ఆలోచన వస్తుంది. పాత్రలపై వారి అభిప్రాయాలను తెలియజేస్తారు. దీనివల్ల వారు తమను తాము మరింత స్పష్టంగా వ్యక్తీకరించగలుగుతారు.
కమ్యూనికేషన్‌
పిల్లల సమూహానికి కథ చెప్పినప్పుడు వారి ఆలోచనల వైవిధ్యాన్ని పరిచయం చేస్తుంది. వారి అభిప్రాయాలను, సందేహాలను తెలియజేస్తారు. ప్రతి ఒక్కరికి వారి సొంత అభిప్రాయాలు, కచ్చితమైన అంశంపై సొంత దృక్కోణాలు ఉన్నాయని వారు గ్రహిస్తారు. ఇతరుల అభిప్రాయాలను వినడం, గౌరవించడం నేర్చుకుంటారు.
సామాజిక నైపుణ్యం
కథలు పిల్లలకు ప్రపంచం, జీవితం, ప్రస్తుత సమాజ పరిస్థితుల గురించి చాలా విషయాలు నేర్పుతాయి. వారు ఇంతకు ముందెన్నడూ చూడని అద్భుతమైన ఆలోచనలు, విషయాలను తెలుసుకోవడానికి అవకాశాలను అందిస్తాయి. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరు ఎలా ఆలోచించగలుగుతారో తెలుసుకుంటారు.

➡️