సముద్రంలో సాహసం!

Apr 28,2024 10:54 #Jeevana Stories

‘విజయానికైనా, వైఫల్యానికైనా ఒకటే దారి వుంటుంది. మన మీద మనకు ఉన్న నమ్మకం.. శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలపై మనం చేసే అభ్యాసమే వాటి మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది’ అంటున్నారు తమిళనాడుకు చెందిన భరత్‌ సచిదేవ్‌, శాశ్వత్‌ శర్మ. ఈ ఇద్దరు స్నేహితులు ఈ నెల 14న శ్రీలంక సరిహద్దు నుంచి 32 కిలోమీటర్ల సముద్రమార్గాన్ని 10 గంటల 30 నిమిషాల వ్యవధిలో ఈదారు. ఇది అంత ఆషామాషీగా జరగలేదు. మార్గమధ్యలోప్రాణాలను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. అయినా, పట్టు విడవలేదు. అనిశ్చల జల ప్రవాహంలో విపరీతమైన వేడితో ఒళ్లంతా బబ్బల్లెక్కుతున్నా తమ లక్ష్యాన్ని సాధించేవరకూ ప్రయత్నం వదలేదు. ఆఖరిగా తాము అనుకున్న అపూర్వ రికార్డు సృష్టించారు.

‘అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌, బహిరంగ ఈత’ను భారతదేశ నలుమూలలా విస్తరింప చేయాలని ఈ స్నేహితులు బలంగా కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ అడ్వెంచర్‌కి తెరతీశారు. 2024 ఏప్రిల్‌ 14న శ్రీలంక తలైమన్నార్‌ ప్రాంతం ఈ అద్భుతానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి.భద్రతా చర్యలను పర్యవేక్షిస్తూ ఓ బృందం అటూఇటూ హడావిడిగా తిరుగుతూ ఉంది. సరిహద్దు చట్టాలకు చెందిన అనుమతి పత్రాలను భద్రంగా దగ్గర పెట్టుకుంది. ఇంత హడావిడిలోనే స్నేహితులిద్దరూ ఎంతో ప్రశాంతంగా సముద్ర అలలవైపు తీక్షణంగా చూస్తూ కూర్చొన్నారు. మరికొద్ది క్షణాల్లో ఓ సాహసోపేత ప్రయాణానికి సిద్ధమవుతున్న వారిలో ఏమాత్రం ఆందోళన కనిపించడం లేదు. చాలా ఉల్లాసంగా ఆ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.
ఉదయం 5 గంటలకు సాహసయాత్ర మొదలైంది. ఆ సమయానికి కొన్ని గంటల ముందే ధనుష్‌కోటి నుంచి శ్రీలంకకు పడవ మార్గంలో వారు అక్కడికి చేరుకున్నారు. రాత్రంతా పడవలో ప్రయాణించడం వల్ల విపరీతమైన అలసట వారిని ఆవహించింది. విశ్రాంతి తీసుకున్నా ఆ అలసట వారిని వదల్లేదు. 15 గంటలు నిర్విరామంగా పడవ మార్గంలో ప్రయాణించిన కొన్ని గంటల వ్యవధిలోనే జలసంధిలో ఈదేందుకు సిద్ధమయ్యారు. 32 కిలో మీటర్ల పొడవున్న ఆ మార్గంలో వారికి సహాయసహకారాలు అందించేందుకు నేవీ అధికారులు, ఈతగాళ్లు పక్కనే బోటులో బయల్దేరారు. మధ్యలో వారికి పోషకాహారం అందించే ఏర్పాట్లు కూడా చేశారు.
ఈ ఫీట్‌కి ముందు ఈ మిత్రులు ఇద్దరూ భిన్న జల ప్రవాహాలు, వాతావరణ పరిస్థితుల మధ్య ఈదడంలో శిక్షణ పొందారు. నీటి రక్షణ, ప్రమాదాల నుంచి ఎలా కాపాడుకోవాలి అనే దానిపై ప్రత్యేక తర్ఫీదు తీసుకున్నారు.
‘పొరుగుదేశాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించుకోవాలంటే ఇలాంటి సాహసయాత్రలకు సిద్ధం కావాలి. చాలామంది సాహస యాత్రికులు ఎంతో కష్టతరమైన ప్రదేశాలకు వెళుతుంటారు. అయితే రామసేతు కూడా ఎంతో కష్టతర ప్రయాణం. చాలా తక్కువ మందే ఈ సాహసానికి సిద్ధమవుతారు. ప్రపంచ పటంలో రామసేతును ప్రత్యేకంగా నిలపాలని మేం కోరుకున్నాం. అందుకే ఈ సాహసానికి తెరతీశాం’ అంటూ తమఉద్దేశాన్ని మిత్రులిద్దరూ ముక్తకంఠంతో చెబుతున్నారు.
హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌గా, అంతర్జాతీయ ఈతగాడిగా, ఐరన్‌మాన్‌ ట్రైయథ్లెట్‌గా భరత్‌ (40) పేరు చాలామంది క్రీడాకారులకు పరిచయమే. మేరీ కోమ్‌, అమిత్‌ పంఘాల్‌, వికాస్‌ క్రిష్ణన్‌ వంటి అనేకమంది ప్రముఖ క్రీడాకారులకు భరత్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు. టోక్యో ఒలింపిక్స్‌కి సిద్ధమవుతున్న భారతీయ బాక్సింగ్‌ బృందానికి కూడా భరత్‌ శిక్షణ ఇచ్చారు.
ఆర్కిటెక్‌గా ఉన్న శాశ్వత్‌ శర్మ (31), పొడవైన ప్రాంతాలను అవలీలగా ఈదగలిగిన ఈతగాడిగా ప్రసిద్ధిచెందాడు. ట్రైయథ్లెట్‌, జాతీయ వాటర్‌ పోలో క్రీడాకారుడిగా 500 పతకాలను, ట్రోఫీలను తన ఖాతాలో వేసుకున్న దిగ్గజ ఆటగాడు.
ఈ ఇద్దరూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తమ సత్తా చాటినవారే. అయితే ఏదో వెలితి వారిని వెంటాడింది. ఆశించినంత మంది క్రీడాకారులు బహిరంగ స్విమ్మింగ్‌వైపు రావడం లేదన్న మనోవేదన వారిని బాధించింది. అందుకే ‘బహిరంగ ఈతకు భారత్‌లో వీలుంది’ అని ప్రపంచానికి తెలిసేలా ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

వారి ప్రయాణం ఇలా సాగింది..
ప్రయాణం మొదలుపెట్టిన రోజు వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది. సముద్రగాలులు బలంగా వీచాయి. ‘ఆ రోజు కొంతదూరం ఈదిన తరువాత మాకు శ్వాస ఆడలేదు. సముద్రం ఉపరితలం మాకు వ్యతిరేకంగా ఉంది. కొన్నిసార్లు మేము చావు అంచుల వరకు వెళ్లినట్లు భావించాం. కానీ భవిష్యత్తు తరాలు మా మార్గాన్ని అనుసరించాలంటే మేము ఈ సాహసం చేయాల్సిందేనని బలంగా అనుకున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదని నిశ్చయించుకున్నాం’ అంటున్న ఈ స్నేహితులు తమ లక్ష్యాన్ని చేరుకునే చివరిగంటలో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఒళ్లంతా కాలిపోతున్నంత బాధను అనుభవించారు. ప్రవాహంలో లేని నీరు బాగా వేడెక్కి ఉంది. ఈ ప్రతికూలతల్లో క్రమంగా శక్తిని కోల్పోయారు. శరీరం సహకరించేందుకు నిరాకరిస్తున్నా, మానసికంగా ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ శక్తే వారిని అనుకున్న లక్ష్యానికి చేర్చింది.
‘మేము సాధించిన ఈ ఘనత, బహిరంగ ఈతపై దేశ యువత శ్రద్ధ పెట్టేలా పిలుపునిచ్చింది. తీరానికి చేరుకున్న క్షణాన, ధనుష్కోటి వద్ద వందలాది మంది యువతీ యువకులు మాకు స్వాగతం పలికారు. ‘కలలు కనేందుకు సిద్ధంగా ఉండండి. పెద్ద కలలే కనండి. మీ అభిరుచిని అనుసరించండి. మీ ఆశలను విస్తరించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి. సాయమందించే వారు ఎప్పుడూ ముందుంటారు’ అని మిత్రులిద్దరూ యువతకు పిలుపునిచ్చారు. ‘మా మార్గంలో ఔత్సాహిక క్రీడాకారులు ముందుకు వచ్చిన రోజున మేము నిజమైన విజయం సాధించినట్లు’ అని వారు పేర్కొన్నారు.

➡️