విశాల ప్రాంగణంలో వినూత్న కళా పద్రర్శన

Feb 26,2024 10:13 #feature

                  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం ఇప్పుడు వర్ణశోభితంగా కనిపిస్తోంది. అనేక చిత్ర సౌందర్య సముదాయంతో కనువిందు చేస్తోంది. కళాశాల ప్రాకారాలపై, వివిధ భవనాల వద్ద, సేద తీరు బల్లలపై సైతం అద్భుత కళా చిత్రాలు దర్శనమి స్తున్నాయి. ఇది చిత్రకళా విద్యార్థులు సృష్టించిన కళావిన్యాసం! ఆరుబయట బొమ్మలను గీయటమే పరీక్షగా మార్చిన అధ్యాపకుల సరికొత్త ప్రయోగం!

గుంటూరుకు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం… పచ్చని చెట్ల నడుమ, ప్రకతి రమణీయతతో కనిపిస్తుంది. ఇప్పుడు ఫైన్‌ ఆర్ట్స్‌్‌ విద్యార్థుల కళానైపుణ్యంతో మరింత శోభాయమానంగా తయారైంది. ఆ చెట్ల బెరడులపై కూడా అందమైన చిత్రాలను విద్యార్థులు కళాత్మకంగా గీశారు.

పూర్వం గురుకులాల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను ఆఖర్లో బహిరంగంగా ప్రజల ముందు, అధ్యాపకుల ముందు ప్రదర్శించి చూపేవారట. అదే విధంగా నేడూ ప్రదర్శితం అయ్యేలా నాగార్జున విశ్వవిద్యాలయ ఆచార్యులు ఒక మంచి ఆలోచన చేశారు. విశ్వ విద్యాలయంలోని ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగ విద్యార్థులకు మిడ్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు మొత్తం ప్రాంగణాన్ని వేదికగా మార్చారు. విశ్వవిద్యాలయం ఆరుబయట, రూసా భవనాల వద్ద, దూర విద్యా కేంద్రం భవనం వద్ద, ఏపుగా పెరిగిన చెట్లు, కూర్చునే బల్లలు, భవనాలపై, విశ్వవిద్యాలయ గోడలపై వారి చిత్రకళను కళాత్మక రీతిలో సజనాత్మకంగా ప్రదర్శించమని సూచించారు. సహజంగా తరగతి గదుల్లో, ఆర్ట్‌ స్టూడియోలో పేపర్‌, కాన్వాస్‌లను జవాబు పత్రాలుగా ఉపయోగిస్తారు. కానీ, ఇక్కడ సిమెంటు బల్లలను, పెద్ద పెద్ద చెట్ల కాండం బెరడులనే జవాబు పత్రాలుగా ఉపయోగించు కోమన్నారు. దాంతో, విద్యార్థులు ఉత్సాహంగా కదిలారు. తమ సృజనను అన్వయించి, అద్భుత చిత్రాలు గీయటం మొదలు పెట్టారు. తాము దర్శించిన ప్రాకృతిక దృశ్యాలకు ఊహాశక్తిని జోడించి అందమైన చిత్రాలు గా మలుస్తున్నారు. ‘ఒకే కళా విధానానికి’ కట్టుబడకుండా వివిధ కళా విధానాలలో కళాకృతులను, చిత్రా లను తీర్చిదిద్దుతున్నారు. చెట్ల తొర్రలలో పక్షులు, అడవి జంతు వుల నుంచి ఆహ్లాద కరమైన ప్రకృతి సోయగాల వరకు అన్నింటినీ ఆవిష్కరిస్తున్నారు.

చిత్రకారుడు తన చిత్రాల్ని వస్తుగతంగా బాహ్య గత ప్రతిబింబాలుగా మలుస్తాడు. వీటిలో ఆత్మ గతం, జీవితానికి సంబంధించిన భావాలకు రూపా న్ని ఇవ్వడాన్ని చూడొచ్చు. అంటే ప్రాకృతిక దృశ్యాల్లో జీవితాన్ని చూసుకోవడమన్నమాట! కొండలు, సెలయేర్లు, చెట్ల వంటి వీరు గీసిన చిత్రాలు ‘ఎక్స్ప్రెషనిజం’ కళా విధానం కిందకు వస్తాయి.

సహజమైన మానవ ప్రకృతి, అసంబద్ధమైన స్వాప్నిక జగత్తులో మనిషి మేధస్సులో అవ్యక్తంగా వచ్చే వింత భావాలకు అద్దం పట్టే ‘సర్రియలిజం’ కళా విధానంలోనూ కొన్ని చిత్రాలు వీరి కుంచెలోంచి మంచి ఆకృతి దాల్చి వస్తున్నాయి. ప్రధాన రంగులైన ఎరుపు, పసుపు, నీలంల శాస్త్రీయమైన కూర్పు వల్ల వర్ణ స్వచ్ఛతను చిత్రాల్లో ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యమైన ‘పోయింటలిజం’ కళా విధానానికి చెందిన చిత్రాలను కూడా గీస్తున్నారు. పోల్చుకోదగిన ఒకే రూపం గానీ, ఆలోచనలకు, భావాలకు అందని రంగులు, రేఖలు వాటి కూర్పు వల్లనే సాధ్యమయ్యే ‘ఆబ్‌ స్ట్రాక్‌ ఆర్ట్‌’ చిత్రకళా విధానంలో కూడా కొన్ని చిత్రాలు దర్శనమిస్తున్నాయి.

విద్యార్థులు గీచిన చిత్రాలతో విశ్వవిద్యాలయం సరికొత్త కళను సంతరించుకుంది. ప్రతి చిత్రం రస రమ్యంగా కనబడుతోంది. ఆధునిక చిత్రకారులుగా ఈ ‘యువ’త ప్రయాణం ఆనందదాయకం కావాలని ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సి.హెచ్‌ స్వరూపరాణి ఆకాంక్షించారు. ఈ వినూత్న ఆలోచన చేసిన అధ్యాపకులు జాన్‌ రత్నబాబుని విశ్వవిద్యాలయ అభినందిస్తున్నారు. నాగార్జున విశ్వ విద్యాలయం ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు మరెన్నో అద్భుత ఆవిష్కరణలు చేయాలని ఆశిద్దాం.

– త్రివిక్రమ్‌ సుఖవాసి

➡️