14 ఏళ్ల అన్నపూర్ణ అధ్యయనం మార్పుకు నాంది

Nov 27,2023 10:32 #Jeevana Stories

ఒక్కోసారి పిల్లలు చేసే పనులు మనల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేస్తుంటాయి. ముఖ్యంగా సైన్స్‌ కాంగ్రెస్‌ వంటి ప్రదర్శనల్లో పిల్లల ప్రతిభ చూసి నోరెళ్లబెడతాం. రైతులకు ఉపయోగపడే పరికరాల దగ్గర నుండి సెల్‌ఫోన్ల చార్జింగ్‌లు, మోటారు బైక్‌ల మరమ్మతులు, అంధులకు, విభిన్న ప్రతిభావంతులకు ఉపయోగపడే పరికరాలు … ఇలా ప్రతి ఒక్క అంశంపై బాల మేధావులు ఎన్నో ఆవిష్కరణలను మన ముందుంచుతారు. అలా ఒడిశాకు చెందిన 14 ఏళ్ల అన్నపూర్ణ పరిదా చేసిన ఓ సర్వే తనను ప్రత్యేకంగా నిలిపింది. తను చేసిన అధ్యయనం ప్రతిష్టాత్మక బాలల జాతీయ కాంగ్రెస్‌కు ఎంపికయ్యేలా చేసింది.

రిస్సా పురోహిత్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అన్నపూర్ణ, పంట మార్పిడి, పప్పుధాన్యాల సాగుపై అధ్యయనం చేసింది. ఇందుకోసం ఎంతోమంది రైతులను ప్రత్యక్షంగా కలిసింది. వారికి అవగాహన కల్పించింది. పప్పుధాన్యాల సాగు వల్ల నేలలో నత్రజని స్థాయి పెరుగుతుందని, తద్వారా రోగాల బారిన పడకుండా ఉంటారని వారికి అర్థమయ్యేలా చెప్పింది. అన్నపూర్ణ ఈ విషయాలు చెప్పేవరకు చాలామంది రైతులకు దీనిపై అవగాహన లేదు. దీంతో ప్రత్యక్షంగా వారికి అవగాహన కల్పించాలని జగత్సింగపూర్‌ బ్లాక్‌లోని తర్ద్‌పడా పంచాయతి, చందురా గ్రామాన్ని తన అధ్యయనానికి కేంద్రంగా ఎంచుకుంది. అక్కడ 160 మంది రైతులను కలిసింది. అన్ని వయసుల వారితో మాటామంతి కలిపింది. పంట మార్పిడి, పప్పుధాన్యాల సాగు, శాస్త్రీయ పద్ధతుల్లో పంట సాగు, భూసార పరీక్షలు వంటి వాటిపై వారి ఆలోచనలను పంచుకుంది. అక్కడ ఉన్న భూమిలో కేవలం 33 శాతం భాగంలోనే పప్పుధాన్యాల సాగు జరుగుతుందని గ్రహించింది. అలాగే మొత్తం రైతుల్లో 40 శాతం మంది రైతులు పప్పుధాన్యాల సాగు చేస్తుంటే వారిలో అత్యధికులకు పంటమార్పిడి, భూసార పరీక్షల్లో అవగాహన కొరవడింది.

రైతుల అవగాహనా లేమి అక్కడి సాగులో స్పష్టంగా కనిపించింది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా రైతులు అటువైపు దృష్టిసారించడం లేదని గుర్తించిన అన్నపూర్ణ, ఆ రైతులకు కేవలం అవగాహన కల్పించడం వరకే సరిపెట్టకుండా, నాణ్యమైన పంట ఉత్పత్తి, భూసార పరీక్షలు, సారవంతమైన భూమి కోసం పంటమార్పిడి పద్ధతులను అనుసరించేలా వారిని సంసిద్ధులను చేసింది. ఈ మొత్తం అధ్యయనాన్ని రాష్ట్ర బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో వివరించింది.

14 ఏళ్ల బాలిక పంట ఉత్పత్తులు, పంట సాగు, భూసార పరీక్షలు, మానవుల ఆరోగ్యంపై ఇంతటి పరిశోధన చేసిందని అక్కడికి వచ్చిన వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తన విశ్లేషణ, అధ్యయనానికి ముగ్ధులై ఆమెను డిసెంబరు 27న జరిగే జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌కు ఎంపిక చేశారు. చిన్న వయసులోనే అన్నపూర్ణ ఇంత పెద్ద విషయంపై అధ్యయనం చెయ్యడానికి తన కుటుంబం, టీచర్ల ప్రోత్సాహం ఎంతో ఉంది. అన్నపూర్ణ తల్లి కవితా సాహూ స్కూల్‌ టీచర్‌, తండ్రి రవినారాయణ్‌ పరిదా ఎలక్ట్రీషియన్‌. సైన్స్‌ టీచర్‌ అంజన్‌ కుమార్‌ సాహూ తనను ఈ అధ్యయనం చేసేలా ఎంతో ప్రోత్సహించారని అన్నపూర్ణ ఆ సభలో చెప్పింది. సరైన ప్రోత్సాహం ఇస్తే పిల్లలు ఎన్నో అద్భుతాలు చేయగలరని నిరూపించిన అన్నపూర్ణ ఎంతోమంది చిన్నారులకు మార్గదర్శకం.

➡️