చీమలు – చిట్టెలుక

Feb 29,2024 07:45 #jeevana
Ants - Hamster

చిట్టి ఎలుక ఒక్కటి

గుంత తవ్వుకున్నది

లోపలికి, బయటకు

పరుగు పెట్టుచున్నది

 

ఆ దారిన పోయేటి

చీమల బారుని చూసి

తెలివి లేని చీమలారా

ఎందుకు ఆ యాతన?

 

ఎప్పుడు చూడు తిండికై

లేని పోని శోధన

అంటూ వెక్కిరించింది

తోకను చూపించింది!

 

నవ్వుకుంటూ చీమలన్ని

ముందుకేమో సాగెను

మోస్తున్న ఆహారంతో

పుట్టలోకి పోయెను!

 

అది శ్రావణ మాసము

మంచి వాన కాలము

బయట తిరుగ వీలులేని

జోరు వాన కురిసెను!

 

ఆహారం లేక ఎలుక

అలమటించ సాగెను

అటు నిటు తిరుగుచు

ఆకలితో ఏడ్చేను!

 

చీమలేమి చేయునో అని

పుట్టలోకి చూసెను

కమ్మని వాసన గని

దాని నోరు వూరెను.

 

రావోయి ఎలుక బావ

లడ్డు తిందువు గాని

అంటూ ఆ చీమలన్ని

ఆప్యాయత చూపెను!

 

ఇంత జోరు వానలోన

అంత తీపి వంటలెలా?

అంటూ ఆ చిన్ని ఎలుక

ఆశ్చర్య పోయెను!

 

”ప్రతిరోజూ కష్ట పడుతూ

తెచ్చి దాచుకుందుము

బయటకి పోలేని రోజు

ఇంట నుండి తిందుము”

 

అంటూ తమ రహస్యాన్ని.

చీమలన్ని చెప్పగ

మంచి మాట చెప్పిరంటు

ఎలుక సంతసించెను!

 

వెక్కిరించినందుకు

క్షమించమని కోరెను.

మీ తెలివికి దాసోహం

అంటూ వంగి మొక్కెను!

 

– కూచిమంచి నాగేంద్ర, 91821 27880

 

➡️