జుట్టు సమస్యలను దూరంచేసే సహజ ప్యాకులు

Jun 20,2024 05:40 #hair, #jeevana

చాలామంది జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. వీటిలోని రసాయనాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంట్లో సహజ సిద్ధమైన పదార్థాలతో వివిధ రకాల హెయిర్‌ ప్యాక్స్‌ తయారు చేసుకొని అందమైన, ఆరోగ్యమైన, జుట్టును ఎలా పొందవచ్చో చూద్దాం..

పెరుగు, ఉసిరి పొడి, మందార పొడి : కొద్దిగా మందార పొడి, ఉసిరి పొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు మర్దనా చేసి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. మందార పొడిలో సమృద్ధిగా ఉండే ఎమైనో యాసిడ్లు జుట్టు ఎదుగుదలకు తోడ్పడతాయి. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌ జుట్టు ఆరోగ్యానికి సహాయపడి, రాలడాన్ని తగ్గిస్తాయి. పెరుగులోని మంచి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

మెంతులు, పెరుగు : నాలుగు టేబుల్‌ స్పూన్ల మెంతులను ఐదు టేబుల్‌ స్పూన్ల పెరుగులో రాత్రిపూట నానబెట్టాలి. ఉదయం ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టి, తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. మెంతుల్లో ప్రొటీన్‌, ఐరన్‌, ఫేవనాయిడ్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జుట్టును దఢంగా చేస్తాయి. పెరుగు జుట్టుని ప్రకాశవంతంగా, పట్టులా మారుస్తుంది.

కరివేపాకు, మందారం, కొబ్బరి నూనె : ఒక పాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె, పది కరివేపాకులు వేసి మరిగించాలి. చల్లా రాక ఈ నూనెతో మసాజ్‌ చేసుకోవాలి. 45 నిమి షాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కరి వేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, బీటా కెరోటిన్‌, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది. కొబ్బరి నూనెలోని విటమిన్లు జుట్టును బలంగా ఉంచుతాయి.

ఉసిరి పొడి, ఇండిగో : రెండు టేబుల్‌ స్పూన్ల ఉసిరి పొడి, నాలుగు టేబుల్‌ స్పూన్ల ఇండిగో పొడి పేస్టులా కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తుండడం వల్ల జుట్టు నల్లబడుతుంది.
ఆముదం : కేశ సంరక్షణకు ఆముదం చాలా మంచిది. జుట్టుని ఒత్తుగా ఉంచుతుంది. ఆముదంలో ఫ్యాటీ యాసిడ్లు, ఇతర ప్రోటీన్లు జుట్టుని ప్రకాశవంతంగా మారుస్తాయి. చుండ్రు సమస్యను దూరం చేస్తాయి.

➡️