పక్షుల జాతి ప్రేమికుడు

Apr 11,2024 05:30 #Birds, #feachers, #jeevana, #lover

ప్రపంచంలో జరుగుతున్న పర్యావరణ మార్పులతో ఎన్నో జీవజాతులు అంతరించి పోతున్నాయి. అలాంటి అరుదైన పక్షి జాతులను గుర్తించి, వాటి రక్షణ కోసం తనవంతుగా కృషి చేస్తున్నారు మధురైకి చెందిన పర్యావరణవేత్త, పక్షుల పరిశీలకులు ఎన్‌.రవీంద్రన్‌. అరుదైన పక్షులను కెమెరాలో బంధించటం, వాటిని డాక్యుమెంట్‌ చేయటం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటం చేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రం మధురై ప్రాంతంలోని జిల్లా కేంద్రమైన రామనాథపురానికి చెందిన ఎన్‌.రవీంద్రన్‌ (56) జంతుశాస్త్రంలో పట్టభద్రులు. ఎలక్ట్రికల్‌ కంపెనీలో ఉద్యోగి. పక్షిజాతి ప్రేమికుడు. పర్యావరణ వేత్త కూడా. పక్షుల చిత్రాలను తన కెమేరాను క్లిక్‌ చేయటం, ద్వారా నిక్షిప్తం చేయటం, వాటి వివరాలు తెలుసుకోవటానికి సర్వేలు చేయటం ఆయనకు అలవాటుగా మారింది. వలస పక్షుల విధానాల గురించి లోతైన అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగానూ పర్యావరణ మార్పులు, చర్చలపైనా ఆయన ఆసక్తి చూపుతున్నారు. 2010లో పక్షి జాతులకు సంబంధించిన పాఠశాల ప్రాజెక్టు విషయమై తన బంధువుకు అధ్యయనం నిమిత్తం ఆయన సహకరించారు. పక్షులు – వాటి ఆవాసాలు – పర్యావరణం వంటి విషయాలు తెలుసుకోవడంలో సహకరించారు. ఆ తద్వారా ఆ ప్రాజెక్టు విజయవంతం కావటంతో ఆ బంధువు ఎంతో సంతోషించారు.

చిన్నప్పటి నుంచి పక్షుల పరిశీలన ఉన్న రవీంద్రన్‌కి ఆ కృషి, అభినందన గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. తన పరిశీలన, పరిశోధన కొనసాగించాలని అనుకున్నాడు. మధురైలో ‘ఇరుగుగల్‌’ అనే స్వచ్చంధ సేవా సంస్థ ద్వారా ఒక చిన్న ‘బర్డ్‌ లవర్స్‌ క్లబ్‌’ ఏర్పాటు చేశారు. ‘పక్షి జాతుల పరిరక్షణ’ ఈ క్లబ్‌ లక్ష్యం. రవీంద్రన్‌తో పాటుగా మరికొందరు మధురై, రామనాథపురానికి చెందినవారు ఈ క్లబ్‌లో చేరారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణ గురించి, అంతరించిపోతున్న పక్షి జాతుల గురించి అవగాహన కల్పించేవారు. విస్తృతంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించేవారు. ఈ క్రమంలో 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రవీంద్రన్‌ కుడి కన్నుకు దెబ్బతగిలింది. పాక్షికంగా చూపు కూడా కోల్పోయారు. అయినా, పక్షులపై అధ్యయనాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 2015 నుంచి పక్షుల అధ్యయనంపై మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. రవీంద్రన్‌ ఇప్పటివరకు మధురైలోనే 250 కంటే ఎక్కువ పక్షి జాతులను గుర్తించారు. గతంలో ఇంత మొత్తంలో ఈ ప్రాంతంలో పక్షి జాతులు ఉన్నాయనే పరిశీలన జరగలేదు. హిమాలయన్‌ గ్రిఫాన్‌, ఈజిప్షియన్‌ రాబందు, స్టోన్‌ చాట్‌తోపాటు మరికొన్ని అరుదైన జాతులు వీటిలో ఉన్నాయి. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది రామనాథపురంలో కనిపించిన ‘ఓస్టెర్‌ క్యాచర్‌’ను గుర్తించింది కూడా ఆయనే. తన కెమెరాలో కూడా ఆ పక్షిని బంధించారు. ఈ ఏడాది ప్రాదేశిక, చిత్తడి నేల పక్షుల గణనకు జిల్లా ఆటవీశాఖకు ఆయన ఎంతో సహకరించారు కూడా.

అటవీశాఖకు తోడ్పాటును అందిస్తూ …
ఈ ప్రాంతంలో ఏటా మార్చి నెలలో వలస పక్షులు రావటం, సంతానోత్పత్తి చేయడం, తరువాత తమ ప్రాంతానికి తిరిగి వెళ్లిపోవటం జరుగుతుంది. ఆ సమయంలో అటవీశాఖ కూడా పక్షుల గణన చేపడుతుంది. అటవీశాఖ సిబ్బందితోపాటుగా కొందరు వాలంటీర్లు కూడా ఈ గణనలో పాల్గొంటారు. వారికి రవీంద్రన్‌ కూడా సహకరిస్తారు. తన కెమెరాల్లో బంధించిన పక్షి జాతుల చిత్రాలతో పాటు వాటి పేర్లు, సమగ్ర సమాచారం అందజేస్తుంటారు. ఇప్పుడు ఆయన తన పూర్తి వ్యాపకం పక్షుల పరిరక్షణగానే మారిపోయింది. రాష్ట్రం అంతటా ప్రయాణిస్తూ తన స్వీయపరిశీలనను, అనుభవాలను విద్యార్థులకు, యువతీ యువకులకు బోధిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఆన్‌లైన్‌లో తన బోధనను అందించారు.

అరుదైన పక్షులకు ఆలవాలం
మధురై ప్రాంతంలోని రామనాథపురం జిల్లా ప్రకృతి అందాలకు ఆలవాలం. జీవ వైవిధ్యానికి పెట్టించి పేరు. ఈ జిల్లాలోనే ప్రపంచ కృత్రిమ జలాశయం (మడై), కంజిరంకులం, చిత్రంగుడి అలగంకుళం అభయారణ్యం, మెల్సెల్వనూర్‌- కీల్సెల్వనూర్‌ పక్షుల అభయారణ్యం ఉన్నాయి. ఇవన్నీ వివిధ పక్షి జాతుల ఆవాసాలకు నిలయాలు. దేశ, విదేశాల నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి రామనాథపురం పక్షుల కేంద్రానికి చేరుకుంటాయి. వలస పక్షులు ఇక్కడ సంతానోత్పత్తి చేసుకుని తిరిగి ఆయా దేశాలకు వెళ్లిపోతుంటాయి. నీరు పుష్కలంగా ఉండటంతో మత్స్యసంపద కూడా పెరుగుతోంది. పక్షుల ఆహారానికి కొరత లేదు. సమనాథం, అవనియాపురం, వండియూర్‌ సరస్సుల్లో విస్తృతమైన పక్షుల జాతులు చూడొచ్చు. ప్రధానంగా పెలికాన్‌, పెయింటెడ్‌ స్టాక్‌, వైట్‌ఐబీస్‌, నైట్‌ హెరాయిన్‌, నల్ల కంకణాల పిట్ట, పరజలు, పాము మెడబాతు, కామన్‌మోర్‌హెన్‌ తదితర పక్షిజాతులు ఇక్కడ కనిపిస్తాయి. మధురైలోని ఇదయపట్టి వంటి బయో-హెరిటేజ్‌ సైట్‌లను రక్షించటానికి కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని రవీంద్రన్‌ తెలిపారు.

➡️