ఈ అద్భుతాలకు అభినందనలు

Jan 25,2024 07:42 #feature, #jeevana

పిల్లలు తమ చిట్టి చిట్టి చేతులతో ఎన్నో పనులు చేసేస్తారు. ఒక్కోసారి తమ శక్తికి మించి కూడా చక్కబెట్టేస్తుంటారు. అలా అద్భుత ప్రతిభ చూపిన వారిని అసాధ్యులని ముద్దుగా పిలుచుకుంటుంటాం. అలాంటి పిల్లలే వీరంతా. సంగీతం, సాహిత్యం, నృత్యం, సామాజిక సేవ, విజ్ఞానం, వ్యవసాయం, సాహసం ఇలా విభిన్న రంగాల్లో విశేష ప్రతిభ చూపిన ఈ చిన్నారులు ఈ ఏడాది ‘బాల పురస్కార్‌’ అవార్డుకు ఎంపికై ఈ జనవరి 22న అవార్డులు తీసుకున్నారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌లో కూడా వీరు పాల్గొననున్నారు. ఈ జాబితాలో మొత్తం 19 మంది బాలబాలికలు ఉన్నారు. వారిలో మన తెలుగు రాష్ట్రాల చిన్నారులు ఇద్దరూ, వైకల్యం ఉన్నా ప్రతిభావంతంగా రాణిస్తున్న వారూ ఉన్నారు.

గణితంలో ఘటికుడు : ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఆరేళ్ల గడుగ్గాయి అర్మన్‌ని అందరూ ‘గూగుల్‌ బారు’ అని పిలుస్తారు. ఈ ఈడు పిల్లలంతా ఆడుతూ పాడుతూ ఉంటే అర్మన్‌ మాత్రం గణితం, సైన్స్‌లో విశేష ప్రతిభ చూపిస్తూ ఔరా అనిపించాడు. అతి తక్కువ వ్యవధిలో 100 కోఎఫీషియంట్‌లను అవలీలగా గుణించేశాడు. అంతేకాదు, పుస్తక రచయితగా కూడా రాణిస్తున్నాడు. 2022లో 16 నిమిషాల్లోనే 86 గణిత ప్రశ్నలను పరిష్కరించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఆ ఏడాదే ఆన్‌లైన్‌ పోటీలో 2 నుండి 20 ఎక్కాలను 8 నిమిషాల 3 సెకన్లలో చెప్పి హార్వర్డ్‌ వరల్డ్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రత్యేక ప్రతిభావంతుడు : ఏడేళ్ల అవినాష్‌ తివారీ, డౌన్‌ సిండ్రోమ్‌ బాధితుడు. మధ్యప్రదేశ్‌కి చెందిన అవినాష్‌ అనాథశ్రమంలో పెరిగాడు. రెండేళ్ల వయసులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన ఆదిత్య అవినాష్‌ని దత్తత తీసుకున్నాడు. 50 శాతం వైకల్యంతో బాధపడుతున్న అవినాష్‌ని ప్రతిభావంతుడిగా తయారుచేసి చూపించాలనుకున్నాడు ఆ తండ్రి. ఆ ప్రయత్నంలో భాగంగా విభిన్న ప్రతిభావంతుల కోసం నిర్వహించే ఒలింపిక్‌లో పాల్గొనేలా చేశాడు. ఆ తరువాత ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించేలా చేశాడు. ఎంతో కష్టతరమైన పర్వతారోహణని ఎన్నో అనుమతులు తీసుకుని మరీ ఈ తండ్రీ కొడుకులు ఎక్కారు. ‘ఈ ప్రయాణం అవార్డుల కోసమో, రికార్డుల కోసమో కాదు. నా అవినాష్‌ అందరిలాంటి వాడని అందరికీ చెప్పాలనుకున్నాను. ఇలాంటి బిడ్డలు కూడా ఎన్నో గొప్ప పనులు చేస్తారని ఈ ప్రపంచానికి చూపాలనుకున్నాను’ అని పర్వతారోహణ పూర్తి చేసిన సందర్భంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆకాష్‌ మాట్లాడారు. నిజమే కదా! ఇప్పుడు అవినాష్‌ ఎంతోమంది డౌన్‌ సిండ్రోమ్‌ బిడ్డల తల్లిదండ్రుల కొత్త ఆశలకు కారణమయ్యాడు.

చిన్న వయసు పెద్ద మనసు : గుజరాత్‌కి చెందిన 13 ఏళ్ల హేతవీ సెరబ్రల్‌ పాల్సీతో బాధపడుతోంది. అయితేనేం డ్రాయింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. 250 పెయింటింగ్‌లను చేతితో సునాయాసంగా వేసేసింది. అంతేకాదు, వైకల్య బాధితురాలిగా తను పొందే పింఛను సొమ్మును తనలాంటి పిల్లల పోషణ కోసం ఖర్చు చేస్తోంది. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు! ప్రతిభతో పాటు సాటివారి పట్ల ఇంత కరుణ చూపిస్తున్న ఈ చిన్నారి వైకల్యం.. ప్రతిభకే కాదు, మానవత్వానికీ అడ్డు కాదని నిరూపించింది.

ఎందరికో విద్యా ప్రకాశం : హార్యానాకు చెందిన 9 ఏళ్ల గరీమా అంధురాలు. పుట్టుకతోనే చూపు కోల్పోయిన గరీమా సామాజిక సేవలో ముందుంటోంది. పేదరికం కారణంగా, అంధత్వం కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకూడదని ‘సాక్షార్‌ పాఠశాల’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోంది. దాని ద్వారా ఎంతోమంది పిల్లలను చదివిస్తోంది. చూపు లేకపోతేనేం ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోన్న గరీమా సేవకు ఈ బాలపురస్కారం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

సామాజిక చైతన్య జ్యోత్స్న : జ్యోత్స్నది త్రిపుర. తన ప్రాంతంలో అత్యధికంగా జరిగే బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేస్తున్నందుకు 16 ఏళ్ల జ్యోత్స్నకి అవార్డు లభించింది. ‘నా కంటే రెట్టింపు వయసున్న, అప్పటికే వివాహమై పిల్లలున్న వ్యక్తితో నా పెళ్లి నిర్ణయించారు. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. ‘చదువు కోవాలి, ఉద్యోగం చేయాల’ ని ఆశపడ్డాను. అందుకే ఆ పెళ్లిని అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించాను. పోలీసులతో చెప్పాను. ఇంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు’ అంటున్న గరీమా తన పెళ్లినే కాదు, ఆ తరువాత ఎన్నో బాల్యవివాహా లను అడ్డుకుంది. వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

ఆటల్లో మేటి : ఆదిత్యా యాదవ్‌ బధిరురాలు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ 12 ఏళ్ల అమ్మాయి బ్యాడ్మింటన్‌ ఆటలో విశేష ప్రతిభ కనబరుస్తోంది. ఎన్నో టోర్నమెంట్లలో, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని నైపుణ్య క్రీడాకారిణిగా రాణిస్తోంది. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటోంది.

తెలుగు రాష్ట్రాల చిన్నారులు

మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందిన ఆర్‌ సూర్యప్రసాద్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. 9 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 5 ఏళ్ల నుండే పర్వతాలు ఎక్కడం ప్రారంభించిన సూర్య రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ ప్రతిభ సాధించిన మొదటి వాడుగా గుర్తింపబడ్డాడు. అంతేకాదు, చిన్న వయసులో కిలిమంజారోలోని ఉహ్రు శిఖరం అధిరోహించిన రెండవ భారతీయుడుగా చరిత్రసృష్టించాడు. 2021లో బెంగుళూరులో నిర్వహించిన తైక్వాండో ఒలింపిక్స్‌లో అండర్‌-20 కేటగిరీలో తల పడి బంగారు పతకం సాధించాడు. తండ్రి శివప్రసాద్‌ రైతు, తల్లి ప్రమీల గృహిణి.

పెండ్యాల లక్ష్మీ ప్రియ : తెలంగాణకు చెందిన లక్ష్మీ ప్రియకు కూచిపూడి నృత్యంలో విశేష ప్రతిభ చూపిస్తున్నందుకు ఈ అవార్డు ప్రదానం చేశారు. 14 ఏళ్లకే 200 ప్రదర్శనలిచ్చిన లక్ష్మీ ప్రియ ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. గతేడాది జనవరిలో భువనేశ్వర్‌లో జరిగిన జాతీయస్థాయి కళా ఉత్సవాల్లో ప్రథమ బహుమతి అందుకుంది.

ఇంకా … ఢిల్లీకి చెందిన సుహానీ చౌహాన్‌ సోలార్‌తో నడిచే ‘ఎస్‌ఒ-ఎపిటి’ అనే వాహనాన్ని ఆవిష్కరించింది. దీనిద్వారా విత్తనాలు చల్లడం, పంటకు నీరు పెట్టడం వంటి వ్యవసాయ పనులు చేసేలా డిజైన్‌ చేసింది. రాజస్తాన్‌కి చెందిన ఆర్యన్‌ సింగ్‌ అధునాతన టెక్నాలజీతో ‘అగ్రోబోట్‌’ ఆవిష్కరించాడు. ‘ఎఐ’ శక్తితో నడిచే ఈ రోబోట్‌ వ్యవసాయ పనుల్లో రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. కాశ్మీర్‌ బాలుడు 13 ఏళ్ల ఇస్తాఫ్‌ హమీద్‌ సంగీతంలో, బీహార్‌కి చెందిన 16 ఏళ్ల ఎండి.హుస్సేన్‌ చేతితో అందమైన కళాకృతులు చేయడంలో విశేష ప్రతిభ కనబర్చారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకున్నారు. వెయ్యికి పైగా వీధి కుక్కలను, దాదాపు 800 పాములను రక్షించినందుకు అస్సాం బాలుడు శ్యామ్‌ ముజుందర్‌ 10 ఏళ్లకే ఈ అవార్డు అందుకుంటున్నాడు. చెస్‌లో అద్భుత ప్రతిభ చూపిస్తున్న, కర్నాటకకు చెందిన 9 ఏళ్ల చార్వీ కూడా బాలపురస్కార్‌ అందుకుంటున్నాడు. ఇంకా అరుణాచల్‌ ప్రదేశ్‌కి చెందిన బాడ్మింటన్‌ క్రీడాకారిణి జెస్సికా నేయి సారింగ్‌, మణిపూర్‌కి చెందిన 17 ఏళ్ల లింథోరు ఛానాంబమ్‌ క్రీడారంగం నుండి ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన 8 ఏళ్ల అనుష్క పాఠక్‌, పశ్చిమబెంగాల్‌ నుండి 13 ఏళ్ల అర్జిత్‌ బెనర్జీకి సాహిత్యరంగం నుండి ఈ పురస్కారం లభించింది. మొత్తం విద్యార్థులు అవార్డు కార్యక్రమానికి హాజరైతే మహారాష్ట్రకి చెందిన 12 ఏళ్ల ఆదిత్య విజరు బ్రహ్మణి అక్కడ కనిపించలేదు. సాహసబాలుడిగా ఆ అవార్డు అందుకోవడానికి అతను జీవించి లేడు. కళ్లముందే తన సోదరులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే వాళ్లని రక్షించేందుకు నదిలో దిగి ఒడ్డుకు చేర్చాడు. తను మాత్రం కొట్టుకుపోయాడు. ఈ సంఘటన వివరిస్తూనే అతని పేరు మీద బాలపురస్కారం అందించారు.

➡️