డార్క్‌ వాలంటైన్‌..

Feb 17,2024 07:08 #Jeevana Stories, #Kenya, #Special Days

‘శవ పేటికలపై పూలు ఎప్పటికీ అందంగా ఉండవు’ అన్న నినాదం ధరించిన వేలాదిమంది మహిళలు అర్ధరాత్రి చిమ్మ చీకట్లో, కొవ్వొత్తుల కాంతులతో వీధుల్లో నిలబడి నిరసన తెలియజేశారు. మహిళలపై పెరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా వారంతా ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 14న కెన్యాలో జరిగిన ఈ నిరసనల్లో వెయ్యి స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. ‘డార్క్‌ వాలంటైన్‌’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం వెనుక ఎంతోమంది మహిళల వ్యథాభరిత జీవితాలున్నాయి.

ఎక్కడో ఒక చోట, ఏదో ఒక మూల కాదు, అత్యధిక శాతం మంది మహిళలు నిత్యం వేధింపులకు గురవుతున్నారు. జీవిత భాగస్వాములు, ప్రేమించిన వారు, పరిచయస్తుల చేతుల్లోనే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ దారుణాలు ఎంతకాలం? వీటికి అడ్డుకట్ట పడేదెప్పుడు? అన్న నినాదాలతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉంటాయి. కెన్యాలో కూడా అదే జరిగింది. ఏడాది ప్రారంభమైన ఈ స్వల్ప కాలంలో అక్కడ 30 మంది మహిళలు హత్యకు గురయ్యారు. హత్య చేసిన వారు ఆ మహిళలకు బాగా తెలిసినవారే. ఈ దారుణాలను ప్రశ్నిస్తూ కెన్యా వ్యాప్తంగా ‘ఎండ్‌ ఫెమిసైడ్‌ కెన్యా మూమెంట్‌’ పేరుతో ఓ ఉద్యమం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రేమికుల దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహించారు.

‘మహిళలపై ఇంతటి దారుణాలు జరుగుతుంటే పాలకులు పట్టించుకోకుండా ఉంటే ఎలా? అందుకే దేశం దృష్టికి తీసుకెళ్లాలనే మేము ఈ నిరసన చేపట్టాం’ అని చెబుతోంది 20 ఏళ్ల ఓ ఉద్యమకారిణి. పరిచయస్తుల చేతుల్లోనే మహిళలు దాడులకు గురవుతున్నారన్న వార్తలు ఆ దేశ ప్రధాన స్రవంతి మీడియాలో నిత్యం ఉంటున్నాయి. ఈ వార్తలపై కనీస స్పందన లేని పాలక యంత్రాంగం ఈ దాడులకు మహిళలే కారకులని తేల్చింది. అపరిచితులతో అతిగా మాట్లాడొద్దని హితవు పలికింది. ఈ వ్యాఖ్యలే మహిళా సంఘాలను ఉద్యమించేలా చేశాయి. జనవరి 20న కూడా 20 వేల మంది కెన్యా ప్రజలు వీధుల్లో నిరసన తెలియజేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని వారంతా వీధుల్లోకి వచ్చారు. తమపై జరుగుతున్న దాడులపై ఎంతోమంది మహిళలు తమ నిరసన గళాలు వినిపిస్తూనే ఉంటారు. అయితే ఇవి ఎక్కడో ఒక చోట కాదు, ప్రపంచం నలుమూలలా విస్తరించాల్సిన అవసరం ఉంది.

➡️