ఒత్తిడి మితిమీరితే ప్రమాదం

Jun 29,2024 04:05 #Jeevana Stories

పిల్లలకు తగినంత ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ, తోడ్పాటు, ప్రోత్సాహం పెద్దల నుంచి దక్కకపోతే తట్టుకోగల ఒత్తిడే ప్రమాదకరంగా మారొచ్చు. దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు. వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి ఉండే తీవ్రమైన ప్రతికూల అనుభవాల నుంచి టాక్సిక్‌ ఒత్తిడి వస్తుంది. పోషకాహార లోపం, పిల్లల పట్ల నిరాదరణ చూపటం, పిల్లల్ని విపరీతంగా తిట్టడం, కొట్టడం వంటివి ఇలాంటి సమస్యలకు దారితీయొచ్చు.
ఒత్తిడి అనేది జీవితంలో తప్పించుకోలేని అంశం. పుట్టుక ముందు నుంచే ఒత్తిడి అనేది మొదలైపోతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కొంతమేరకు ఒత్తిడి సహజం. జీవితంలో సంభవించబోయే అనేక రకాల పరిస్థితులకు ఎలా అనువుగా మారాలో ఈ ఒత్తిడి వల్ల పిల్లలు నేర్చుకుంటారు. అయితే ఈ ఒత్తిడి వల్ల శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎలా ప్రతిస్పందించాలో పిల్లలు తల్లిదండ్రుల నుంచి కానీ, ఇతర సంరక్షకుల నుంచి కానీ నేర్చుకోవాలి. ఒక పిల్లవాడు ఎంతమేరకు ఒత్తిడిని ఎదుర్కోగలడో ఆ స్థాయిని దాటాక ఇక ఒత్తిడి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు, నష్టాలు తప్ప.
తీవ్రమైన, దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యంపై స్పల్ఫకాల, దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మెదడు ఎదుగుదల, నరాల రోగ నిరోధక వ్యవస్థల పనితీరును ఈ ఒత్తిడి అడ్డుకుంటుంది. బాల్యంలో ఒత్తిడి వల్ల తర్వాతి జీవితంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు తాగుడు, డిప్రెషన్‌, తిండి సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్‌, ఇతర దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉంది.
స్వల్ఫకాల ప్రతికూల అనుభవాల వల్ల ఒత్తిడి సంభవిస్తుంది. ఇంజెక్షన్లు తీసుకున్నప్పుడు, కొత్త వ్యక్తుల్ని కలుసుకున్నప్పుడు, చివరకు వాళ్ల ఆటబమ్మని ఎవరైనా తీసుకున్నప్పుడు, అనవసరంగా తిట్టినప్పుడు కూడా పిల్లలు ఒత్తిడికి గురౌతారు. ఇలాంటి ఒత్తిడి చిన్న చిన్న శారీరక మార్పులు పిల్లల్లో కలుగుతాయి. అంటే గుండె అధికంగా కొట్టుకోవటం, హార్మోన్ల స్థాయిల్లో మార్పులు లాంటివి. ఎప్పుడూ పక్కన సంరక్షించే పెద్దలు ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు పిల్లలకు ఒత్తిడిని ఎలా అధిగమించాలో, ఎలా సమన్వయం చేసుకోవాలో నేర్పుతారు.
పాజిటివ్‌ ఒత్తిడి అనేది ఎవరికైనా సహజం. పిల్లల ఎదుగుదల క్రమంలో ఇది చాలా ముఖ్యమైన భాగం కూడా. తట్టుకోగల ఒత్తిడి కూడా తీవ్రమైనప్పుడు ప్రతికూల అనుభవాలనిస్తుంది. అయితే స్వల్ఫకాలానికే పరిమితం.
ఉదాహరణకు అత్యంత ప్రియమైన సన్నిహితుల మరణం, ప్రకృతి వైపరీత్యం, భయంకరమైన ప్రమాదం, కుటుంబంలో కలతలు లాంటివి. ఇవి మొదల్లో తీవ్ర ఒత్తిడి చూపించినా క్రమేపీ వాళ్లు దాని నుంచి బయటపడతారు. కొంతమందిలో మాత్రం పసితనంలో జరిగిన సంఘటనల వల్ల పెద్దయిన తర్వాత కూడా ఆ తీవ్ర ప్రభావం ఉంటుంది.

ఒక పిల్లవాడికి ప్రేమలో సంరక్షించే పెద్దవాళ్ల అండ ఉన్నంతకాలం ఒత్తిడిని సహజంగానే అధిమించగలుగుతారు. చాలా కేసుల్లో తట్టుకోగల ఒత్తిడే సానుకూలంగా మారుతుంది. అది పిల్లల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. టాక్సిక్‌ ఒత్తిడికి ఉదాహరణలు: పిల్లల్లో పోషకాహారంలోపం, వారి పట్ల నిరాదరణచూపటం, విపరీతంగా తిట్టడం, కొట్టడం.
ఈ రకమైన టాక్సిక్‌ ఒత్తిడిని పిల్లలు ఎదుర్కోలేరు. ఫలితంగా దీర్ఘకాలంపాటు ఒత్తిడి ప్రతిస్పందన వ్యవస్థ పనిచేయటం మొదలు పెడుతుంది. దీనిపట్ల మెదడు ఎదుగుదలలో శాశ్వతమైన మార్పులు సంభవిస్తాయి. టాక్సిక్‌ ఒత్తిడి వల్ల సంభవించే ప్రతికూల ప్రభావాలు పెద్దల ప్రోత్సాహం వల్ల తగ్గుతాయి. తగిన ప్రోత్సాహం ఇవ్వటం, పెద్దలు జోక్యం చేసుకోవటం వల్ల ఒత్తిడి ప్రతిస్పందన వ్యవస్థ మళ్లీ యథాతథ స్థితికి వస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొనే శక్తిని పసితనం నుంచే బ్రెయిన్‌ సర్క్యూట్స్‌ని, హార్మోన్‌ వ్యవస్థలు అదుపు చేస్తుంటాయి. ఒక పిల్లవాడు భయపడినప్పుడు హార్మోన్లపై కూడా ఆ ప్రభావం పడుతుంది. మెదడు, ఇంకా అనేక రకాల వినికిడి వ్యవస్థలపైనా ఆ ప్రభావం పలు విధాలుగా పనిచేస్తుంది. టాక్సిక్‌ ఒత్తిడి బ్రెయిన్‌ సర్క్యూట్స్‌ కనెక్షన్లను నిర్వీర్యం చేస్తుంది. ఈ ఒత్తిడి మరీ ఎక్కువైతే మెదడు ఎదుగుదల సక్రమంగా ఉండదు. బాల్యంలో ఎదుగుతున్నప్పుడు బ్రెయిన్‌ సర్క్యూట్స్‌ని టాక్సిక్‌ ఒత్తిడి అడ్డుకుంటుంది. దీనివల్ల మున్ముందు జీవితం మొత్తం మీద కొద్దిపాటి ఒత్తిడి కూడా తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు. స్ట్రెస్‌ హార్మోన్లు కార్టిసాల్‌తో సహా శరీర రోగనిరోధక ప్రతిస్పందనను అణచివేస్తుంది. దానివల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు రావటమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది పిల్లల్లో జ్ఞాపకశక్తిలోనూ, విషయాల్ని నేర్చుకోవటంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తర్కంతో ఆలోచించకపోవటం పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది. అందుకే పిల్లలు ఒత్తిడికి గురైనట్లు గుర్తించిన పెద్దవాళ్లు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవటం అత్యవసరం.

– పిల్లలు చేసే చిన్న చిన్న పనులను మెచ్చుకుంటే వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. దాంతో నిదానంగా మెండితనం తగ్గిస్తారు. అప్పుడప్పుడు చిన్న చిన్న కానుకలు ఇవ్వటం ద్వారా వారు చేసిన మంచి పనులు ఏంటి? తప్పులు ఏంటి? గ్రహించగలుగుతారు. దాంతో ఏది చేయకూడదో తెలుసుకుంటారు.

– పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే మంచి ఆహారం చాలా ముఖ్యం. పోషకాలతో కూడిన ఆహారం ఇస్తూ ఉండాలి. సరైన వ్యాయామాలతో పాటు విహారయాత్రలకు తీసుకెళ్లాలి. కొత్త ప్రదేశాలను చూసినప్పుడు వారిలోఉత్సాహం రెట్టింపవుతుంది. పెద్దల పట్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయి.

– డాక్టర్‌ విడియాల చక్రవర్తి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌, మచిలీపట్నం, కృష్ణాజిల్లా. సెల్‌ : 9440139025

➡️