ఇద్దరు అమ్మలు.. బోలెడు ప్రశ్నలు…

Feb 29,2024 07:36 #Hunger, #Jeevana Stories
Two moms.. lots of questions...
  • బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోతుంది తల్లి హృదయం. బిడ్డ క్షణం కంటిముందు కనిపించకపోతే తెగ కంగారు పడిపోతుంది. మరి ఆ తల్లే గుండె రాయి చేసుకుని బిడ్డను అమ్మేస్తుందంటే కారణమేంటి? ఆకలి అన్నిటికంటే బలమైనది.

‘నా కళ్లముందే బిడ్డలు ఆకలితో చనిపోతున్నారు. నేను వాళ్లకి కడుపునిండా అన్నం పెట్టలేకపోతున్నాను. పిల్లల ఆకలి తీర్చేందుకు వీధుల్లో యాచించాను. నా శరీరాన్నే వస్తువుగా చేసి అమ్ముకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డకు మంచి ఆహారం పెడతానని, విద్య నేర్పిస్తానని ఎవరైనా ముందుకు వస్తే ఎలా కాదనగలను? అందుకే కట్టలు తెచ్చుకుంటున్న దు:ఖాన్ని దిగమింగుకుని బిడ్డను అమ్మేశా’ అని చెబుతున్న అమ్మలు ఈ దేశంలో ఎందరు?

35 ఏళ్ల చుమ్కీ మలాకర్‌ది పశ్చిమ బెంగాల్‌. ఆమెకు ఆరుగురు పిల్లలు. ఆ కుటుంబానికి ఆదాయం లేదు. ఆసరా లేదు. కనీసం తల దాచుకునేందుకు ఇల్లు కూడా లేదు.

‘నా పిల్లల ఆకలి తీర్చేందుకు తిరగని వీధి లేదు. రోడ్డు మీద ఏది కనపడితే అది ఏరుకునేదాన్ని. వ్యర్థాలను ఉడకపెట్టైనా ఒక్కపూట భోజనం పెట్టాలని ఎంతలా తపించానో.. అయినా బిడ్డల ఆకలి తీరే దారి కనిపించేది కాదు. ఆరుగురు బిడ్డలతో ఎక్కని బస్సు లేదు. రైలు లేదు. ఎక్కడ బయలుదేరానో తెలియదు. ఇప్పుడు ఈ అడవికి చేరాను. ఇక్కడైతే నా బిడ్డలకు ఏదైనా కాయో, పండో దొరుకుతుందని ఆశపడ్డాను’ అంటోంది చుమ్కీ మలాకర్‌.

అస్నోసోల్‌ ప్రాంతం నుండి చుమ్కీ బంకురా అటవీ ప్రాంతానికి చేరుకుంది. ఆకాశమే ఇంటి కప్పుగా ఆ కుటుంబం రోజుల తరబడి అడవిలో నివసిస్తోంది. ‘ఒక్కోసారి మాకు వరుసగా రెండు రోజుల పాటు ఏ ఆహారమూ దొరకదు. ఆకలి బాధకు తోడు విపరీతమైన చలి. కప్పుకునేందుకు ఏ ఆచ్ఛాదన లేక కడుపులో కాళ్లు పెట్టుకుని నా బిడ్డలు నిద్రించేవారు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే నా ఆఖరి బిడ్డను అమ్మగా వచ్చిన డబ్బులతో మిగిలిన బిడ్డలకు కొన్ని రోజులైనా తిండి పెట్టొచ్చని భావించాను’ అంటోంది చుమ్కీ.

  • సిభాన్‌ది మరొక కథ

షిబాన్‌ సింగ్‌ (40). ఏడుగురు బిడ్డల తల్లి. ఆమె కుటుంబం ఫల్‌పహారీ ప్రాంతంలో కనకాబోటీ గ్రామ పంచాయతీలో ఓ గుడారంలో నివసిస్తోంది. ఆమె భర్త అమర్‌ దాస్‌, స్థిరాదాయం లేని భవన నిర్మాణ కార్మికుడు. కొన్ని రోజుల క్రితం షిబానీ తన ఏడవ బిడ్డకు జన్మనిచ్చింది. ముగ్గురు బిడ్డల తరువాత ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం స్థానిక ఆస్పత్రిని సంప్రదించింది. అయితే ఏ విధమైన గుర్తింపుకార్డు లేనందున ఆమెకు ఆపరేషను చేయలేదు. రూ.5000 చెల్లిస్తే ఆపరేషన్‌ చేయిస్తామని మధ్యవర్తులు చెప్పారు.

‘నా బిడ్డలకు రెండు పూటలా తిండి పెట్టలేని పరిస్థితి నాది. ఈ స్థితిలో అంత డబ్బు ఎక్కడ నుంచి తేగలను? మొన్న జనవరిలో ఆడబిడ్డ పుట్టింది. ఇప్పటికే నా ఆరుగురు బిడ్డలు తీవ్ర పోషకాహార లేమితో బాధపడుతున్నారు. ఏవిధమైన గుర్తింపు కార్డు లేక మాకు ఏ సంక్షేమ పథకాలూ అందడం లేదు. ఈ బిడ్డను పోషించలేక, కళ్లముందే చంపేసుకోవడం ఇష్టం లేక అమ్మేందుకు ప్రయత్నించాను’ అని చెప్పింది షిబానీ.

పేదరికంలో మగ్గిపోతున్న ఈ అమ్మలిద్దరూ దేశంలో ఎందరో తల్లులకు ప్రతినిధులు. పొట్ట కూటి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న అసంఖ్యాక వలస కార్మికుల కుటుంబాలకు ప్రతిబింబాలు. వారికి స్థిరమైన ఆదాయం ఉండదు. గుర్తింపు పత్రాలు అందవు. పిల్లలకు చదువు అబ్బదు. పోషణ ఉండదు. ఏదైనా అనారోగ్యం వస్తే చచ్చిపోవడమే వారి ముందున్న ఏకైక మార్గం. గాలికి, థూలికి పెరుగుతారు. రోడ్డు చివర కాదు, ఊరి చివరో, శ్మశానం పక్కనో, చెట్టుమీదో, గట్టుమీదో సేద తీరుతారు. ఏదేని స్వచ్ఛంద సంస్థల చొరవతో వీరికి అందే స్వావలంబన తాత్కాలికం. శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాల్సిన పాలకులు వీరున్నారన్న సంగతి గుర్తించడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తల్లులు ఏం చేయాలి? బిడ్డలను అమ్ముకోవడం ఏమాత్రమూ పరిష్కారం కాదు. అది పూర్తిగా అమానవీయం. ఒక బిడ్డ హక్కును హరించటం కూడా. మరి ఒకపూట తిండి కూడా దొరకని బతుకులు వాళ్లవి. కుటుంబ నియంత్రణ మీద అవగాహన ఉండదు. ఉన్నప్పుడు కూడా ఏవొక అడ్డంకులు ఎదురవుతాయి. దేశం అభివృద్ధి చెండం అంటే- ఇలాంటి అనామక జీవితాలకు కూడా తిండి గుడ్డా ఇల్లూ ఉపాధి సమకూరటం; బిడ్డలకు పోషకాహారం అందడం. ఆ దిశగా పాలకులు పట్టించుకోవాలి. చర్యలు చేపట్టాలి. అమ్మలు అస్సహాయులుగా నిలబడని స్థితిని సృష్టించాలి. అప్పుడు ‘బిడ్డలను అమ్ముకున్న తల్లి’ తరహా కఠినమైన వార్తలను మనం వినకుండా ఉండగలుగుతాం.

 

➡️