వినియోగదారుల హక్కుల పరిరక్షణలో …

Mar 15,2024 07:30 #feachers, #jeevana, #Jeevana Stories

నిద్ర లేచింది మొదలు టూత్‌పేస్టు నుంచి మందులు, తినే ఆహార పదార్థాల వరకూ మార్కెట్లో దొరికే అన్ని వస్తువుల్లోనూ కల్తీలతో మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. ధరల్లో వ్యత్యాసాలు, తూకాల్లో మోసాలు, కల్తీ, నకిలీ వస్తువుల చెలామణి వంటివన్నీ ఈ కోవకే చెందుతాయి. కొందరు అక్రమార్కులు సిండికేట్లుగా మారి దోపిడీని విపరీతంగా కొనసాగిస్తారు. తెలిసినా మనకెందుకులే అని కొందరు వదిలేస్తున్నారు. మరికొందరు ప్రశ్నిస్తుంటారు. అలాంటి వారిలో బొబ్బిలి బంగారయ్య ఒకరు. వినియోగదారుల హక్కుల రక్షణ కోసం ఆయన మూడు దశాబ్దాలుగా అలుపెరగని కృషి చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలెంలో 1952 జులై 20న బొబ్బిలి వీరన్న, దుర్గమ్మ దంపతులకు బంగారయ్య జన్మించారు. పేదరికం కారణంగా వివిధ పనులు చేసుకుంటూనే ఇంటర్మీడియట్‌ వరకూ చదివారు. సైకిల్‌పై మరమరాలు కూడా అమ్మారు. తర్వాత ఉపాధి కోసం ఆకివీడుకు వెళ్లారు. భార్య నాగవరలక్ష్మి సహకారంతో 1975లో సహకార శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అటెండర్‌ నుంచి ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన కార్యదర్శి స్థాయి వరకూ ఎదిగారు. ఎన్నోమంది రైతుల నుంచి ప్రశంసలు పొందారు. 2010 జులైలో ఉద్యోగ విరమణ పొందారు.


వినియోగదారుల హక్కుల కోసం
చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న మోసాల గురించి పత్రికల్లోనూ, ఇతరుల ద్వారా తెలుసుకుని స్పందించేవారు. వీటికి అడ్డుకట్ట వేయలేమా? అనుకుంటున్న తరుణంలో 1986లో కేంద్రం జాతీయ వినియోగదారుల హక్కుల చట్టం తెచ్చింది. అప్పుడు మరికొంతమంది మిత్రులు కలిసి వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1991లో జిల్లాస్థాయిలో, 1992లో రాష్ట్రస్థాయిలో సంఘాల ఏర్పాటులో కీలకపాత్రలు పోషించారు. తొలుత ఆకివీడులో వినియోగదారుల సంఘాన్ని పటిష్టం చేయటంతోపాటు వందలాదిగా జిల్లా, రాష్ట్ర వినియోగదారుల సంఘాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. వినియోగదారుల ఉద్యమంలో ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.
వృద్ధుల సమస్యలపైనా కార్యాచరణ
2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన వృద్ధుల సంక్షేమ చట్టం వచ్చాక ఆ సమస్యపై దృష్టి పెట్టారు. 2012లో స్థానిక వైద్య ప్రముఖులు డాక్టర్‌ ఎంవి సూర్యనారాయణరాజు సహకారంతో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఆకివీడు మండల వృద్ధుల సంక్షేమ సంఘాన్ని స్థాపించారు. మొదట్లో 70 మంది చేరారు. వృద్ధుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర సహధ్యక్షులుగా కొనసాగుతూ ఏటేటా వందలాది మంది పేద వృద్ధులకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తున్నారు.


ఎన్నికల నిఘా వేదిక లో …
ఎన్నికల సంగ్రామంలో నీతీ, నిజాయితీ నిలబడాలి అనేది బంగారయ్య భావన. ఎవరూ ఓట్లు అమ్ముకోవద్దనీ, నిజాయితీ పరులకే ఓట్లు వేయాలని పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. 2010లో జిల్లా కలెక్టర్‌ స్వయంగా పిలిచి ఎన్నికల నిఘా వేదిక జిల్లా కోకన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. అప్పుడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ఊరూరా ప్రచారం జరిపారు. డబ్బు, అవినీతి ఓటు విలువలను ఎలా దిగజార్చుతాయో ప్రచారం నిర్వహించారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సభ్యునిగా కూడా పనిచేశారు. విచ్చిన్నమయ్యే సుమారు 60 కుటుంబాలను తాము కలపగలిగామని బంగారయ్య సంతోషాన్ని వ్యక్తంచేశారు.

62 ఉత్తమ సేవా పురస్కారాలు
వినియోగదారుల హక్కులు, వృద్ధుల సంక్షేమం కోసం చేసిన కృషికి గాను ఆయన రాష్ట్రప్రభుత్వం ద్వారా ఇప్పటివరకూ 62 సార్లు ఉత్తమ పురస్కారాలు లభించాయి. మొత్తం 129 అవార్డులు పొందారు. పలు సంస్థల ద్వారా మరో 70 వరకూ అవార్డులను అందుకున్నారు. జాతీయస్థాయి రివార్డులు సైతం ఆయన్ను వరించాయి. 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. 2001 అమెరికాలోని బయోగ్రాఫికల్‌ ఇనిస్టిట్యూట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును అందజేసింది. వినియోగదారుల ఫోరం క్యాప్మో-కార్క్స్‌ ఐదుసార్లు రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా పురస్కారాలను అందించింది.

రూ.20 కోట్లు వరకూ పరిహారం రప్పించాం 

– బొబ్బిలి బంగారయ్య -వినియోగదారుల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షులు,ఆకివీడు, పశ్చిమ గోదావరి జిల్లా.

వినియోగదారులకు సంబంధిం చిన సుమారు 3000లకుపైగా కేసులను పరిష్కారం వచ్చేలా కృషిచేశాను. ఆయా కేసుల తాలూకా బాధితులకు సుమారు రూ.20 కోట్లు వరకూ పరిహారం అందింది. వినియోగదారుల హక్కుల చట్టంపై పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాల్లో వేలాది వేదికల ద్వారా అవగాహన కల్పించాం. 2008లో ఆంధ్రా బ్యాంకు ద్వారా 315 మంది రైతులకు రూ.70 లక్షల బీమా పరిహారం మంజూరుకు కృషిచేశాం. 2012లో చినకాపవరంలో గోదావరి బ్యాంకులో ఓ ఉద్యోగి అవినీతికి పాల్పడగా రైతుల పక్షాన నిలబడి వారికి డబ్బులు ఇప్పించేలా కృషి చేశాను. తాడేపల్లిగూడెం ఆంధ్రాబ్యాంకు ద్వారా రూ.కోటి వరకూ బీమా పరిహారాన్ని ఇప్పించాం. చినమిల్లిపాడులో రైతుల తరపున వినియోగదారుల ఫోరంలో కేసు వేసి 79 మంది రైతులకు బీమాతోపాటుగా రూ.79 వేలు అదనంగా వచ్చేలా కృషిచేశాము.

– గుడిపాటి వెంకటేశ్వరరావు (వెంకన్న),
ప్రజాశక్తి ఆకివీడు విలేకరి, 97053 46818.

➡️