అసమానతలు

Mar 27,2024 05:30

‘అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచోట.. హంస తూలికలు ఒక చోట.. అలసిన దేహాలు ఒకచోట.. సంపద అంతా ఒకచోట.. గంపెడు బలగం ఒకచోట..’ అంటూ కొన్ని దశాబ్దాల క్రితం ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు అసమానతలపై ధర్మాగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. నేటికీ అవి పెచ్చుమీరుతూనే ఉన్నాయి. అనంతపురం కలెక్టరేట్‌కు సమీపంలోనే దళిత మహిళ అంజలి ఆకలితో అలమటిస్తూ.. కన్నుమూసింది. మరోవైపు భారత్‌ బ్రిటీష్‌ రాజ్‌ నుంచి బిలియనీర్‌ రాజ్‌గా మారిందని ప్రపంచ అసమానతల ల్యాబ్‌ నివేదిక ఎత్తిచూపింది.
ప్రభుత్వ ఆదాయమంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకే ఖర్చు చేసెస్తున్నాయని, ప్రజలను బిచ్చగాళ్లుగా చేస్తున్నారని కార్పొరేట్‌, మీడియాలో ప్రచారం నిత్యం హోరెత్తిపోతూనే ఉంది. మీడియాలో సింహ భాగాన్ని ఆక్రమించిన గోడీ మీడియా సంగతి ఇక చెప్పనక్కరేలేదు. మద్యానికి బానిసై వేధించుకుతినే భర్త, తిండి లేక అలమటిస్తూ అడుక్కుంటున్న ముగ్గురు బిడ్డలు, రోజుల తరబడి ఆహారం లేక బక్కచిక్కి ఆకలితో మరణించిన అంజలి ఉదంతం…. ఆ ప్రచారంలోనూ, నేటి సంక్షేమ పథకాల అమలులోనూ ఉన్న డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయి. అంజలి, ఆమె పిల్లలకు ఆధార్‌ కార్డే లేదు. ఇంటింటికీ సంక్షేమ పథకాలందిస్తున్నామంటున్న ప్రభుత్వాలకు, అధికారులకు, వాలంటీర్లకు ఇల్లేలేని ఆమె కనిపించనేలేదు. కనీసం బియ్యం అందినా… అంజలి ప్రాణం నిలబడేదని చెబుతున్న స్థానికుల మాటలు చేదు నిజాలను కళ్లముందుంచుతున్నాయి. 77 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో.. మరీ ముఖ్యంగా 2000 నుంచీ విపరీతంగా పెరిగిపోయిన ఆర్థిక అసమానతలు పేదల ఆకలిచావులకు, రైతుల ఆత్మహత్యలకు కారణభూతమవుతున్నాయి. 15 కోట్ల మంది నిరుపేదలు ఒక్కపూట తిండికోసం అల్లాడుతున్నారని తాజా నివేదిక ఎత్తిచూపింది. 144 కోట్ల మంది ప్రజలు నా అక్కచెల్లెల్లు, అన్నదమ్ములు అని నిత్యం ప్రధాని మోడీ వల్లెవేస్తుండగానే… ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాలకు గాను అట్టడుగున 111వ స్థానానికి మనదేశం దిగజారింది. 2015 నుంచి పురోగతి శూన్యమని గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ తేల్చిచెప్పింది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే 38 శాతం మంది పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కార్పొరేట్ల ఆదాయం, వారి దురాశే పేదరికాన్ని రోజురోజుకూ వృద్ధి చేస్తోందని ఆక్స్‌ఫామ్‌ తేల్చిచెప్పింది.
1947 నుంచి 80 వరకూ అసమానతలు తగ్గుముఖం పట్టగా, నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలుతో అసమానతలు పెరిగాయి. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపద కేంద్రీకరణ మరింత పెరిగిపోయింది. 1951లో 11.5 శాతం జాతీయాదాయం మాత్రమే వారి చేతుల్లో ఉండేది. 10 శాతం సంపన్నుల చేతిలో 1951లో 36.7 శాతం సంపద ఉండగా, 2022 నాటికి 57.7 శాతానికి పెరిగిపోయింది. అంతేలే పేదల గుండెలు.. అశ్రువులే నిండిన కుండలు అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు పేదల బతుకులు రోజురోజుకూ తీసికట్టుగా మారిపోతున్నాయి. దిగువన ఉన్న 50 శాతం మంది ఆదాయం 1951లో 20.6 శాతం ఉండగా, 2022 నాటికి 15 శాతానికి పడిపోయింది. జనాభాలో దాదాపు 40 శాతంగా ఉన్న మధ్యతరగతి ఆదాయం కూడా 42.8 శాతం నుంచి 27.3 శాతానికి తగ్గిపోయింది. 2022లో మనదేశ జాతీయాదాయంలో 22.6 శాతం, 40.10 శాతం ఆస్తి ఒకశాతం సంపన్నుల చేతిలో ఉంది. 1991లో ఒకే ఒక శతకోటీశ్వరుడు ఉంటే 2022 నాటికి 162కి పెరిగిపోయింది. ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి విషయాలలోనూ ప్రభుత్వ పెట్టుబడులు సగటు భారతీయుల స్థితిగతులను మార్చేకన్నా సంపన్నులకు కట్టబెట్టేందుకు దోహదం చేస్తున్న దుస్థితిని నివేదిక ఎత్తిచూపింది. బడా పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పెరిగిపోవడాన్ని, ఏక వ్యక్తి కేంద్రంగా నిరంకుశ పాలనకు దారితీస్తుందని హెచ్చరించింది. హిందూ మతతత్వ రాజకీయాలు, కార్పొరేట్‌ క్యాపిటల్‌ కలిసి దేశాన్ని లూటీ చేసిన పరిస్థితుల్లో ప్రముఖ ఆర్థిక వేత్తలు థామస్‌ పికెట్టి, లూకాస్‌ ఛాన్సెల్‌, నితిన్‌కుమార్‌ భారతి, అన్మోల్‌ సోమంచి తదితరులు రూపొందించిన ఈ నివేదిక ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టాయి. తాజాగా ఎన్నికల బాండ్ల విషయంలోనూ మోడీ సర్కారుకు, కార్పొరేట్లకు ఉన్న అనుబంధాన్ని తేటతెల్లం చేసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ, కార్పొరేట్‌ రాజ్‌ను మట్టికరిపించాలి. అందుకు ఉక్కు సంకల్పం తీసుకోవాలి.

➡️