మొక్క పెంపకం

Jun 29,2024 04:20 #jeevana

పెద్దపల్లి అనే గ్రామంలో గోపి అనే తొమ్మిదేళ్ల బాలుడు ఉన్నాడు. గోపికి చెట్లు, పూలు, పక్షులు అంటే చాలా ఇష్టం. గోపి తాతయ్య సుబ్బారావు. మనవడికి రోజూ చెట్ల గురించి, పూల గురించి కథలు చెప్పేవాడు. ఒక రోజు గోపి తాతయ్యతో కలిసి నర్సరీకి వెళ్ళాడు. అక్కడ, తాతయ్య, గోపికి ఒక చిన్న పూల మొక్క కొనిచ్చాడు. ‘ఈ మొక్కను మన ఇంటి ముందు నాటు. రోజూ దానికి నీళ్లు పోసి, ఎదిగే దాకా దాని బాగోగులు చూసుకో’ అని చెప్పాడు. గోపి మొక్కను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఖాళీ స్థలంలో మొక్కను నాటాడు. ప్రతిరోజూ పొద్దున్నే లేచి దానికి నీళ్లు పోసి, ప్రేమగా దాని ఆకుల్ని స్పృశించేవాడు. కొన్ని రోజుల్లో, ఆ మొక్క ఇంకాస్త విస్తరించింది. ఒక రోజు, గోపి పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి మొక్క విరిగిపోయి కనిపించింది. అది చూసి, గోపీ చాలా బాధపడ్డాడు. అప్పుడే తాతయ్య వచ్చి ‘రాత్రి వీచిన పెను గాలికి దాని కొమ్మ ఒకటి విరిగి, మొక్క పక్కకు వాలినట్టుంది, నువ్వు దాని చిన్న బట్ట ముక్కతో కట్టి, మట్టి సరి చెయ్యి. మళ్ళీ ఎదుగుతుంది’ అని చెప్పాడు.
తాతయ్య చెప్పినట్టుగానే గోపీ చేశాడు. ఈసారి మరింత జాగ్రత్తతో పెంచాడు. కొంత కాలానికి, మొక్క మళ్ళీ పచ్చని ఆకులతో ఎదిగింది. అయితే ఈసారి పక్కింటి పిల్లలు ఆ మొక్కను తెంపివేశారు. ఆ మొక్కని చూసి గోపికి దు:ఖం ఆగలేదు. నేలమీద పడిపోయిన మొక్కను తీసుకుని తాతయ్య దగ్గరకు పరుగుతీశాడు. ఏడుస్తున్న గోపీని ఓదార్చి, ఈసారి మొక్కను సురక్షితమైన ప్రాంతంలో నాటమని తాతయ్య చెప్పాడు. తాతయ్య చెప్పినట్టు గోపీ ఈసారి మొక్క చుట్టూ, ఇనుప కంచె లాంటిది ఏర్పాటు చేశాడు. అది ఎదుగుతున్నప్పుడు, దాన్ని ఎవరూ తుంచకుండా చూసుకోవాలని పక్కింటి పిల్లలతో స్నేహం చేశాడు.
కొన్ని నెలల తర్వాత, ఆ చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారింది. పూలు పూస్తూ, పక్షులు వాలే చెట్టుగా అవతరించింది. గ్రామంలో అందరూ ఆ చెట్టు అందాన్ని చూసి మెచ్చుకున్నారు.
– డా : చిట్యాల రవీందర్‌,
77988 91795.

➡️