పేదింటి ‘మణి’ పూస

Jan 8,2024 10:47 #feature

పేదరిక కుటుంబం ఆమెది. పెద్ద చదువులు చదివించాలని అమ్మానాన్న ఎంతో తపన పడ్డారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై ఎన్నో కలలుగన్న తండ్రి వారి ఉన్నతిని చూడకుండానే అర్ధంతరంగా చనిపోయాడు. ఇంత పెద్ద విషాదంలోనే ఆ తల్లి బిడ్డల బాధ్యత నెత్తికెత్తుకుంది. తండ్రి లేని లోటు తెలియకుండా అంగన్‌వాడీ కార్యకర్తగా అరకొరా జీతంతోనే ఇద్దరు బిడ్డలను చదివించింది. ప్రయోజకులను చేసింది. ఇప్పుడు ఆ బిడ్డల్లో మొదటి బిడ్డ గిరిజామణి 2022 నోటిఫికేషన్‌లో ఎస్‌ఐ ఉద్యోగం సాధించి ఆ తల్లి పడ్డ కష్టానికి ప్రతిఫలం అందించింది.

            రావాడ గిరిజామణి స్వస్థలం విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం. రేగ పంచాయతీలో ఓ మారుమూల గ్రామం. ఎర్రినాయుడు, వరలక్ష్మి దంపతుల తొలిసంతానం. పదేళ్ల క్రిందట అనారోగ్యం కారణంగా ఎర్రినాయుడు మృతి చెందారు. వరలక్ష్మి అంగన్వాడి కార్యకర్తగా పనిచేస్తున్నారు. గిరిజామణి చదువుతో పాటు ఆటల్లో రాణించారు. ఎన్‌సిసితో పాటు అనేక క్రీడల్లో జాతీయస్థాయి గుర్తింపు పొందారు.

విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన ఆమె, నేషనల్‌ కాడిట్‌ కాప్స్‌ (ఎన్‌సిసి)లో ఏ ,బి ,సి సర్టిఫికెట్స్‌ సాధించారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఎన్‌సిసి నేషనల్‌ టెల్‌ సైనిక్‌ క్యాంపులో సిల్వర్‌ మెడల్‌ సాధించారు. 100 మీటర్ల అథ్లెటిక్స్‌, లాంగ్‌ జంప్‌ ఇలా పలు క్రీడల్లో ప్రతిభ కనపర్చడం గిరిజామణికి చిన్నప్పటి నుండి అబ్బింది. ప్రభుత్వ రంగంలో ఏదేని ఉద్యోగం సాధించాలన్న తండ్రి కల నెరవేర్చడం కోసం 2022 బ్యాచ్‌ ఎస్‌ఐ నోటిఫికేషన్‌లో ఓపెన్‌ క్యాటగిరి నుంచి పోటీకి సిద్ధమై ఎస్‌ఐ ఉద్యోగం సంపాదించారు.

కట్నం డబ్బులతో చదివించమన్నాను

‘అమ్మ నాకు ప్రత్యక్ష దైవం. చిన్ననాటి నుంచి చదువు పట్ల ముందంజలో ఉండేదాన్ని. 9వ తరగతి చదువు తున్నప్పుడే నాన్న చనిపోయారు. ఆ దిగులుతో కొన్ని రోజులు చదవలేక పోయాను. అమ్మే నన్ను ప్రోత్సహిం చింది. ధైర్యం చెప్పింది. నాన్న లేని లోటు తెలియకుండా నన్ను, చెల్లిని చదివించింది. అయితే ఒక్కోసారి బంధువులు, ఇరుగు పొరుగు వారు అనేమాటలకు ఎంతో బాధపడేది. ‘చదువులు, ఆటలు అంటూ డబ్బులు తగలేస్తే మీకు ఎలా పెళ్లి చేయాల’ని ఏడ్చేది. అప్పుడు ‘పెళ్లికి ఇవ్వాలనుకునే కట్నం డబ్బులతో మమ్మల్ని చదివించమ’ని అమ్మకు ధైర్యం చెప్పేదాన్ని. ఇప్పుడు నాన్న ఉంటే ఎంతో సంతోషపడేవాడు. నేను సాధించిన విజయాన్ని చూడకుండానే చనిపోయాడు’ అంటూ కంటతడి పెడుతూ చెబుతున్న గిరిజామణి త్వరలో ఏడాదిపాటు శిక్షణ నిమిత్తం అనంతపూర్‌ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఎస్‌ఐ ఎంపిక ఆనందాన్నిచ్చింది

‘నాకు గిరిజామణి, జానకిదేవి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె జానకిదేవి ప్రస్తుతం డిగ్రీ చదువుతుంది. కుమార్తెలనే కుమారులుగా భావిస్తూ చదివిస్తున్నాను. గిరిజామణి చాలా పట్టుదలతో చదివి ఎస్‌ఐ ఉద్యోగం సాధించింది. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అమ్మాయి ఎస్‌ఐ ఉద్యోగం సాధించి, ఎంతోమంది ఆడపిల్లలకు ఆదర్శంగా నిలిచిందని ఇరుగుపొరుగు వాళ్ళు, నాతోటి సహౌద్యోగులు ప్రశంసిస్తుంటే గర్వంగా ఉందం’టూ బిడ్డల ప్రగతి గురించి చెబుతున్న వరలక్ష్మీ కళ్లల్లో ఆనందభాష్పాలు స్పష్టంగా కనిపించాయి.

అక్క స్ఫూర్తితో ముందుకు

‘అక్కనే స్ఫూర్తిగా తీసుకొని బాగా చదువుతున్నాను. సాఫ్ట్‌ వేర్‌ రంగంలో స్థిరపడాలన్నది నా లక్ష్యం. ఇప్పుడు మా అక్క ఎస్‌ఐగా ఎంపికై నాకే కాదు, నాలాంటి పేదింటి ఆడపిల్లలకు గొప్ప స్ఫూర్తినిచ్చింది. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న మాకు ఆయన లేని లోటును తీర్చి, ఇంత ఉన్నత స్థానంలో నిలిపిన ఘనత మాత్రం మా అమ్మదే’ అంటోంది గిరిజామణి చెల్లి జానకీదేవి.

– పి శ్రీనివాసరాజు, లక్కవరపు కోట ప్రజాశక్తి విలేకరి,94407 52657.

➡️