స్టీల్‌ నాణ్యతను దెబ్బకొడుతున్న జిందాల్‌

Jun 30,2024 02:35 #damaging, #jindal, #quality of steel

– నాసిరకం మాంగనీసు, డోలమైట్‌ సరఫరాతో ఉత్పత్తిపై ప్రభావం
– ఉక్కు యాజమాన్య ఒప్పందాలపై అనుమానం ?
ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :’చెట్టు కొమ్మలను నరికేస్తే మిగిలేది మొండి మొదలే’.. అన్నట్టుగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిస్థితి తయారైంది. కేంద్రం ఆదేశాలతో స్టీల్‌ సిఎమ్‌డి ఉక్కు ఫ్యాక్టరీ మనుగడను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారు. ఇదివరకే బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ా1 ఆపేసి జిందాల్‌కు ఇచ్చే ఒప్పందం చేసుకున్నారు. తాజాగా నాసిరకం ముడిసరుకు తెచ్చుకోడానికి మరో ఒప్పందాన్ని చేసుకోవడం ప్లాంట్‌ మనుగడకు సవాలుగా మారింది. ప్లాంట్‌లో తయారయ్యే ఉక్కు నాణ్యత దీంతో దెబ్బతింటోంది. జిందాల్‌ సరఫరా చేసే మాంగనీసులో బూడిద అధికంగా ఉండడంతో ఒప్పందంలో రూ.కోట్లు గోల్‌మాల్‌ జరిగినట్లు రూఢ అవుతోంది. నాణ్యత లేని నాసిరకం మాంగనీసు, డోలమైట్‌ ముడిసరుకుల డీల్‌తో ‘జిందాల్‌ ా స్టీల్‌ స్కాం’ వెల్లడవుతోంది. ‘లో క్వాలిటీ’ మాంగనీసు ముడిసరుకును టన్నుల కొద్దీ జిందాల్‌ నుంచి రూ.కోట్లు పెట్టి స్టీల్‌ యాజమాన్యం కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డోలమైట్‌ సరఫరా విషయంలోనూ ఇలాంటి ఒప్పందం చేసుకుని ప్లాంట్‌ ఉత్పత్తిని యాజమాన్యమే దెబ్బకొట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్పత్తి సాధించలేక ప్లాంట్‌ విలవిల
2047 నాటికి 500 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యమైతే ఇప్పటికే 200 టన్నులు జరగాలి.. కానీ 117 టన్నుల్లోనే ప్లాంట్‌ ఉంది. నాసిరకం మాంగనీసు, డోలమైట్‌ సరఫరాతో ప్లాంట్‌లో ఉక్కు ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రధానంగా స్టీల్‌ యాజమాన్యం జిందాల్‌తో చేసుకున్న ఒప్పందాలను స్టీల్‌ కార్మికులు తప్పుపడుతూ ఆందోళనకు దిగుతున్నారు. ఇక ఉత్పత్తి విషయానికొస్తే.. ఒక హీట్‌కు సుమారు 3.5 టన్నుల కాల్‌సైనింగ్‌ డోలమైట్‌ను వినియోగిస్తారు. ఇది ఒక టన్ను రూ.13 వేలు వరకూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో రూ.36 కోట్ల విలువైన సుమారు 7500 టన్నుల కాల్‌సైనింగ్‌ డోలమైట్‌ను జెకెకె గ్రూప్‌ నుంచి స్టీల్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఇది అత్యంత నాసిరకంగా ఉన్నట్లు స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌లో రూఢ అయ్యింది. ఎస్‌ఎంఎస్‌ అవసరాలకు 10 నుంచి 40 ఎంఎం సైజు డోలమైట్‌ కావాల్సి ఉండగా జెకెకె గ్రూప్‌ నుంచి కొనుగోలు చేసిన డోలమైట్‌ అంతా పౌడరుతో కూడుకున్నది కావడంతో కార్మిక, ఉద్యోగులు నివ్వెరపోతున్నారు. కళ్లు మూసుకుని యాజమాన్యం ఎలా ఆర్డర్‌ చేసి దిగుమతి చేసుకుంటుందంటూ మండిపడుతున్నారు. రూ.కోట్ల విలువైన మాంగనీసు ముడిసరుకు విషయంలోనూ సిఎండి అతుల్‌ భట్‌ వ్యవహారం అవినీతికరంగా మారిందన్న ఆరోపణలు ముసురుకుంటున్నాయి. మాంగనీసు ఖనిజపు రాళ్లు ఒరిజనల్‌కాగా బూడిదైపోయిన మాంగనీసు నిల్వలను దిగుమతి చేసుకోవడంతో జిందాల్‌తో స్టీల్‌ యాజమాన్యం చేసుకున్న మాంగనీసు, డోలమైట్‌ సరఫరా అగ్రిమెంట్‌లో పెద్ద స్కాం జరిగిందని స్పష్టమవుతోంది. ఇప్పటికీ ప్లాంట్‌లో గుట్టలు గుట్టలుగా నాసిరకం డోలమైట్‌ నిల్వలు పడి ఉన్నాయి.
బయటపడ్డ లైమ్‌ రవాణా
రూ.లక్షలు విలువ చేసే మైనస్‌ 10 ఎంఎం సైజుగల లైమ్‌ను లారీల్లో లోడ్‌ చేసుకుని యథేచ్ఛగా బయటకు తీసుకుని వెళ్తున్నా ఎవరికీ పట్టడం లేదు. ప్లాంట్‌కు పహారా కాస్తున్న సిఐఎస్‌ఎఫ్‌ జవాన్లు ఇటీవల ప్లాంట్‌ ఆవరణలో లారీల్లో లోడుగా వెళ్తున్న విలువైన లైమ్‌ను పట్టుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ప్లాంట్‌ బ్యాక్‌ హౌస్‌ నుంచి ఇదంతా బయటకు పోతుందని గుర్తించారు. ఎంతకాలంగా ఇది సాగుతుందో విచారణ జరపాలని స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) యాజమాన్యాన్ని డిమాండ్‌ చేస్తోంది.
ప్లాంట్‌పై మరో పిడుగు
వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై తాజాగా మరో పిడుగు పడింది. జులై 1 నుంచి ప్లాంట్‌లో ఉన్న 14 క్యాంటీన్లలో ఐదు క్యాంటీన్లను మూసివేసేందుకు స్టీల్‌ యాజమాన్యం రంగం సిద్ధం చేస్తోంది. కేంద్రంలోని బిజెపి డైరెక్షన్‌ ప్రకారం చర్యలు చేపడుతుండడంతో అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికుల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కంపెనీ చట్టం ప్రకారం యాజమాన్యమే క్యాంటీన్‌లను నడపాలి. కానీ కాంట్రాక్టర్లకు రూ.లక్షలు బకాయిలు కావాలనే పెట్టి ప్లాంట్‌ను దెబ్బతీసే కుట్రలకు స్టీల్‌ యాజమాన్యం ఒడిగడుతోంది.

➡️