వైద్య సేవలో గొప్ప దార్శనికుడు…

S S BADRINATH sankara netralaya eye hospiral service jeevana story

‘దేశం నీకు ఏం చేసిందో కాదు.. దేశానికి నువ్వు ఏం చేశావో ఆలోచించు’ అన్న పెద్దల వాక్కును ఎంతోమంది నిజం చేసి చూపిస్తుంటారు. తాము ఎంచుకున్న మార్గంలో జీవిత కాలం శ్రమిస్తారు. అలాంటివారిలో ఒకరు.. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి.. డాక్టర్‌ ఎస్‌ఎస్‌ బద్రీనాథ్‌. చూపు లేని వారికి చూపు తెప్పించాలన్న లక్ష్యంతో దేశంలో కోట్లాదిమందికి ఉచిత కంటివైద్యం అందించిన ‘శంకర నేత్రాలయ’ వ్యవస్థాపకుడుగా ఆయన పరిచయం అవసరంలేదు. ధనిక, పేద, మధ్య తరగతి తారతమ్యాలు లేకుండా కంటివైద్యం అందించడంలో ఆ సంస్థ నాలుగు దశాబ్దాలకు పైగా ఎనలేని కృషి చేస్తోంది. ‘నేను మరణించాక పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయొద్దు. నివాళులు అర్పించడం వల్ల ‘శంకర నేత్రాలయం’ సేవల్లో ఒక్క నిమిషం కూడా వృధా చేయొద్దు. చేతికి ఓ నల్లబ్యాండు ధరించి మీ సంతాపం తెలిపితే చాలు. నేనో సాధారణ వ్యక్తిని’ అని తన మరణానంతర సేవల గురించి పరితపించిన గొప్ప హృదయమున్న వ్యక్తి బద్రీనాథ్‌. ఆ జ్ఞాపకం.. చెరగని ముద్ర!చెన్నై, ట్రిప్లికేన్‌లో 1940లో పుట్టిన బద్రీనాథ్‌ పూర్తి పేరు సెంగమేదు శ్రీనివాస బద్రీనాథ్‌. బాల్యంలోనే ఆయన తన తల్లిదండ్రులను కోల్పోయారు. తండ్రి ఇన్సూరెన్స్‌ డబ్బులతో చదువును కొనసాగించారు. చూపులేకపోయిన ఓ బంధువు నిస్సహాయత చిన్నారి బద్రీనాథ్‌ హృదయంలో చెరగని ముద్రవేసింది. ‘కంటిచూపు లేని ఆ వ్యక్తి నిస్సహాయత నాలో లోతుగా పాతుకుపోయింది. బహుశా అదే నేను కంటివైద్యుడిగా మారేందుకు దోహదపడింది.’ ‘ అని ఓ సందర్భంలో ఆయన చెప్పారు. 1962 నాటికి మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో ఆప్తల్మాలజీలో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన బద్రీనాథ్‌, అమెరికా వెళ్లి న్యూయార్క్‌ యూనివర్శిటీలో పోస్టుగ్రాడ్యుయేట్‌ పూర్తిచేశారు. 1970 నాటికి భారత్‌ తిరిగివచ్చి, వివిధ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించారు. హెచ్‌ఎం ఆస్పత్రిలో ఆప్తాల్మాలజీ, విట్రోరెటినల్‌ సర్జరీ (రెటీనా, కంటిలోని విట్రస్‌ అని పిలువబడే నిర్మాణాలను ప్రభావితం చేసే పరిస్థితి)లో ప్రైవేటు ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ఎంతో నైపుణ్యంతో ఆయన చేసే కంటి శస్త్రచికిత్సలు తోటి వైద్యులను ఆశ్చర్యంలో ముంచెత్తేవి. నేత్రాలయ స్థాపన1974కి వచ్చేసరికి బద్రీనాథ్‌ జీవితం ఓ గొప్ప లక్ష్యం వైపు అడుగులు వేసింది. తన వైద్యవిద్యను ఆయన సేవామార్గం వైపు మళ్లించారు. ‘ఒకసారి కంచి మఠాధిపతికి కంటి వైద్యం చేశాను. నా చికిత్స పట్ల ఆయన చాలా సంతోషించారు. నా దృఢ నిశ్చయాన్ని, అకుంఠిత శ్రమని గుర్తించిన ఆయన వైద్య సేవ వైపు వెళ్లేలా నన్ను పురికొల్పారు.” అనిబద్రీనాథ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వైద్య సామాజికవేత్త ఎపి ఇరుంగవేల్‌ దృక్పథానికి ఆకర్షితులైన బద్రీనాథ్‌, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించే ఆస్పత్రులు దేశానికి కావాలని అనుకున్నారు. తరువాత ఎంతోమంది ప్రేరణతో 1978లో కొంతమంది వైద్యుల బృందంతో ‘శంకర నేత్రాలయ’ పేరుతో మెడికల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. కంటివైద్యం అందించడంలో లాభాపేక్ష లేని సంస్థగా ప్రారంభించిన ఇది, స్వల్పకాలంలోనే దేశం దృష్టిని ఆకర్షించింది. విరాళాల ద్వారా నిర్మించిన ఈ సంస్థ ఒకపక్క కంటి సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తూనే మరోపక్క నేత్ర వైద్య నిపుణులను అందించడంలో ముఖ్య భూమిక పోషించింది. ఎంతోమంది వైద్య విద్యార్థులకు శిక్షణ, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఉచిత చికిత్స అందించింది. దాతల పేర్లతోనే..నేత్రాలయంలో భవనాలు, గదులు, బ్లాకు, ఆపరేషన్‌ థియేటర్‌, ఇలా ప్రతి ఒక్కటి వివిధ పేర్లతో కనిపిస్తుంటాయి. దేశవిదేశాల నుండి విరాళాలు అందించిన దాతల సాయానికి కృతజ్ఞతగా వారి పేర్లతోనే వాటిని నిర్మించడం నేత్రాలయం ప్రత్యేకత. ‘ఈ రోజు ఉచిత వైద్యచికిత్సలకు నిధులు అందించిన వారు’ అంటూ ఏరోజుకారోజు అక్కడ నోటీసు బోర్డులో దాతల వివరాలు రాస్తుంటారు. ప్రముఖ న్యాయనిపుణులు, నాని ఎ పాల్ఖివాలా 1992లో ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ అందించే సేవలు చూసి చలించిపోయిన ఆయన తన యావదాస్తిని సంస్థకు విరాళంగా ప్రకటించారు. ఇప్పుడు అక్కడ ఆయన పేరుతో ఓ భవనం ఉంది.అవార్డులుదేశానికి ఇంత విశేష సేవలందించిన బద్రీనాథ్‌కి గౌరవసూచకంగా 1983లో ‘పద్మ శ్రీ’, 1991లో డాక్టర్‌ బి సి రారు అవార్డు, 1999లో పద్మభూషణ్‌ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. బద్రినాథ్‌, 2019 నుండి క్రియాశీలక పనుల నుండి విశ్రాంతి తీసుకున్నారు. అయినా ఆయన విజన్‌ ఎంతోమంది సేవల్లో ప్రతిబింబిస్తోంది. నిధుల సేకరణతో …కర్నాటక సంగీతాన్ని అమితంగా ప్రేమించే బద్రీనాథ్‌, నిధుల సేకరించేందుకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేవారు. 2016లో ఎంఎస్‌ సుబ్బలక్ష్మి శతజయంతిని పురస్కరించుకుని ఓ సంగీత కచేరిని ఏర్పాటు చేశారు. అక్కడ దాతలు ఇచ్చిన విరాళాలతో 3 వేల మందికి ఉచిత కంటి శుక్లం శస్త్రచికిత్సలు నిర్వహించారు. బద్రీనాథ్‌ ఎప్పుడు మాట్లాడినా- ఆ వ్యాఖ్యలు ఎంతో ఆధ్యాత్మికంగా సాగేవి. ఆధ్యాత్మికత అంటే ఒక మతం వారిని ప్రేమించడం, మరో మతం వారిని ద్వేషించడం కాదని ఆయన సేవతో నిరూపించారు. మనుషులను ప్రేమించడం, సేవ చేయడమే తన మార్గమని, కుల, మతాల తేడా లేకుండా సేవా మార్గం వైపు పయనించిన గొప్ప దార్శనికుడిగా గుర్తింపు పొందారు.

ఏటా వేలాది శస్త్రచికిత్సలు
ఇక్కడ శిక్షణ తీసుకుని, ఇప్పటివరకు వెయ్యిమందికి పైగా ప్రొఫెషనల్స్‌ గ్రాడ్యుయేట్‌ అయ్యారు. శంకర నేత్రాలయ దేశం నలుమూలలకు సేవలు విస్తరిస్తూ ఏడాదికి 36 వేలకు పైగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తోంది. అందులో 12 వేలకు పైగా ఉచితంగా చేస్తోంది. వీటిలో 80 శాతం ఆపరేషన్లు కాటారాక్ట్‌ చికిత్సలే. 20 శాతం అత్యంత కఠినతర శస్త్రచికిత్సలు. కంటి సమస్యల్లో క్యాటరాక్‌తో బాధపడేవారు ఎక్కువగా ఉంటారు. మనదేశంలో ఆ సమస్య మరింత ఎక్కువ. దీనిమీదే నేత్రాలయ అవిశ్రాంతంగా సేవలందిస్తోంది. రోగులకు ఉచితంగా ఆహారం, మందులు కూడా అందిస్తోంది. ఇంకా నేత్రాలయానికి వచ్చి వైద్యం చేయించుకోలేని బాధితులకు సేవలు అందించడమే లక్ష్యంగా వాడవాడలకు సేవలు విస్తరిస్తోంది. మొబైల్‌ వ్యాన్‌ ద్వారా తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, కర్నాటక మారుమూల గ్రామాలకు వెళ్లి సేవలు అందిస్తోంది. అలా దాదాపు 3 లక్షల మంది గ్రామీణులకు కంటి చికిత్సలు అందించింది. 10 వేలకు పైగా కళ్లాద్దాలు అందించింది. పిల్లల కంటి చికిత్సల్లో కూడా నేత్రాలయం కృషి చేస్తోంది. చూపు కోల్పోయిన 40 లక్షల మందికి పైగా చిన్నారులకు తిరిగి చూపును అందించింది.

దేశవ్యాప్త సేవలు
బద్రీనాథ్‌ స్వస్థలం తమిళనాడులో ‘శంకర నేత్రాలయ’ ఐదు కేంద్రాలను నిర్వహిస్తోంది. కోల్‌కత్తా, ఆంధ్రప్రదేశ్‌, అసోంలో కూడా కేంద్రాలున్నాయి. 1998లో దేశంలో అత్యధిక సంఖ్యలో కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీలు నిర్వహించి రికార్డు నెలకొల్పింది. సేకరించిన మొత్తం 536 నేత్రాలలో 402 ట్రాన్స్‌ప్లాంట్లు చేసింది. ఆ సంస్థ ఉచిత వైద్య శిబిరాలు అనేక జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహంతో దేశ నలమూలలకు వ్యాపించాయి. దేశంలో ఎంతోమందిని అంధత్వం నుంచి కాపాడాయి.

➡️