వడదెబ్బ

May 14,2024 05:02 #jeevana

రాము అనెడి బాలుడుండె
ఆటలంటె ఇష్టముండె
సెలవులిచ్చినారనుచును
ఎండలోన తిరుగుచుండె

తల్లి చెప్ప వినడాయెను
తండ్రి భయము లేదాయెను
మిత్రులతో వెళ్లి అతడు
మధ్యాహ్నమెంతొ ఆడెను

సూర్యుని ప్రతాపమునకును
వడదెబ్బ మిగుల తగిలెను
తల్లి తండ్రి వెంట రాగ
ఆసుపత్రికిని వెళ్లెను

మందులకు ఖర్చాయెను
అందరిచే తిట్లాయెను
అయ్యో! నా తప్పనుచును
మిగుల బాధపడసాగెను

ప్రాణి కోటి చెట్టు నీడ
విశ్రమించసాగె జూడ
ఎండ బాధ లేకుండా
దొరికె గదా మంచి జాడ.

రాము తాత వచ్చి చూసె
మౌనమంటు సైగ చేసె
ఎండలోన పోవద్దని
హితోపదేశమును చేసె

కోలుకొనెను రాము జూడ
కథలు చెప్పమనుచు వేడ
ఇంటిలోన తాత కథలు
చెప్పసాగె మంచి నీడ

రాము కథలు వినసాగెను
పొత్తములు చదవసాగెను
వాటితోని తెలివి పెరిగి
ఆనందమునూ పొందెను

బాలులార, ఎండ నుండి
మీరే కాపాడుకొండి
అమ్మ నాన్న మాట వినుచు
నీడ పట్టున నుండండి

మొక్కలు మిగుల నాటండి
నీరు పోసీ పెంచండి
చెట్లు ఎక్కువైన వేళ
వేడి ఎంతొ తగ్గునండి!

– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య,
ధర్మపురి,
99085 54535.

➡️