మార్పు కోసం మొదటి అడుగు!

May 10,2024 04:05 #Jeevana Stories

అది పేరుకే కుటుంబం. అక్కడ ఎవరికి ఎవరూ రక్తసంబంధం కాదు. వారంతా తలోదిక్కు నుంచి వచ్చినవారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఇలాంటి వాతావరణంలో నివేద డాక్టరు చదవాలని కలలు కంటోంది. కానీ, ఆ ఇల్లు చదువుకోవడానికి అస్సలు వీలుపడదు. నివేద పుస్తకాలు తెరిచేసరికి ఆ ఇంట్లో అందరూ తలో పనికి బయటికి వెళ్లిపోతారు. కొంతమంది భిక్షాటనకు వెళితే, మరికొంతమంది ఇతర పనులకు వెళతారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలనే నివేద కష్టపడి చదువుకుంటోంది. తన చదువు, తనకు మాత్రమే కాదు, తనలాంటి వాళ్ల బాగు కోసం కూడా ఉపయోగపడాలనుకుంటోంది. నివేద మామూలు అమ్మాయి కాదు. సమాజంలో గౌరవప్రద స్థానం కోసం తపిస్తోన్న ట్రాన్స్‌ఉమెన్‌.
డాక్టరు కావాలని కలలు కంటున్న విద్యార్థుల్లో ఈ సంవత్సరం తమిళనాడులో 76 వేల పైచిలుకు విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు సిద్ధమై ఉత్తీర్ణత సాధించారు. అలా నీట్‌ ప్రవేశ పరీక్షకు అర్హత సాధించిన వారిలో నివేద ఒక్కత్తే ట్రాన్స్‌ విభాగానికి చెందిన అమ్మాయి. ఈ వారంలోనే పరీక్షా ఫలితాలు వచ్చాయి. తను ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత సాధించలేకపోయినా, ఎక్కడా నిరుత్సాహపడలేదు నివేద. పైగా తన విజయాన్ని ఆమె కమ్యూనిటీ ఓ వేడుకలా చేసింది.
‘నేను 9వ తరగతి పూర్తిచేసేసరికి నా కుటుంబం నన్ను ఇంట్లోంచి గెంటేసింది. అమ్మానాన్న రోజు కూలీ చేసుకునేవారు. అలాంటి కుటుంబంలో నాలాంటి అమ్మాయిని అంగీకరించడం కత్తిమీదసామే. అందుకే బయటికి వచ్చేశాను. అప్పుడు నాకు 14 ఏళ్లు. చదువుకోవాలని ఉన్నా అర్థంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఎలాగోలా నా కమ్యూనిటీ వ్యక్తులను కలుసుకున్నాను. నన్ను చేరదీసిన అమ్మే అన్ని ఖర్చులు భరించి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించింది. అంతా బానే ఉన్నా చదువుకోవాలనుకున్న నా ఆశ చావలేదు. ధైర్యం చేసి వారితో నా చదువు కోరిక చెప్పాను. చదివిస్తామని చెప్పారు. అయితే అదంత సులభం కాదని తర్వాత అర్థమైంది. అప్పటికే చదువు ఆపేసి చాలా సంవత్సరాలు అవుతోంది. ఈ పరిస్థితుల్లో నాలాంటి వాళ్లకు స్కూలు అడ్మిషను ఎవరు ఇస్తారు? అన్న సందేహం వచ్చింది. నన్ను చేరదీసిన అమ్మ శాంభవి ఎలాగోలా నాకు స్కూలు అడ్మిషను ఇప్పించారు’ అని తన చదువు కష్టాలు గుర్తుకుతెచ్చుకుంది నివేద.
అడ్మిషను ఇవ్వడానికే సందేహపడిన ఆ స్కూల్లో ఆ తరువాత నివేదిత టీచర్లకు, పిల్లలకు తలలో నాలుకైంది. పలు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గని బహుమతులు కూడా గెలుచుకుంది. విద్యార్థి బృంద నాయకురాలిగా సమర్థవంతమైన బాధ్యతలతో నడుచుకుంది. ఆమె నిబద్ధత, పట్టుదలకి ముచ్చటపడిన స్కూలు యాజమాన్యం, తన ఆర్థిక పరిస్థితి తెలిసి, భోజనం, పుస్తకాలు, అదనపు తరగతులు వంటి సౌకర్యాలు అందించింది.
తాజాగా వచ్చిన ఫలితాలతో ఎంబిబిఎస్‌లో సీటు సాధించిన నివేదిత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్య కేటగిరీలో చదువుకోలని ఆశ పడుతోంది. ఈ అవకాశం తనలాంటి వారికి గొప్ప ఆసరాని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని బలంగా నమ్ముతోంది. ఆమె ఆశయం నెరవేరాలని మనమూ కోరుకుందాం.

➡️