బాధితుడే భరోసాగా నిలుస్తున్నాడు !

Feb 10,2024 10:56 #feature

జీవితం ఎన్నో సవాళ్లను మన ముందుంచుతుంది. ప్రతి అవరోధాన్ని అధిగమిస్తూ ముందుకు సాగిపోవాలి. ముఖ్యంగా యువతలో ఆ పోరాట పటిమ ఉండాలి. సవాళ్లను ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలి. అలాంటి కుర్రవాడే చెన్నరు గ్రామీణ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల సంజయ్. ఒకప్పుడు అతను హెచ్‌ఐవి బాధితుడు. పుట్టుకతోనే సంక్రమించిన ఆ వ్యాధి నుంచి సంజయ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. అయితే ప్రస్తుతం సంజయ్ తనకు సంక్రమించిన వ్యాధిని, అది మిగిల్చిన చేదు జ్ఞాపకాలని పదిమందికీ చెప్పే సాహోసపేత నిర్ణయంలో ముందుకు వెళుతున్నాడు. ఓ సంఘటన అతణ్ణి ఈ ప్రయాణానికి ప్రేరేపించింది.

డో తరగతి చదువుతున్న సృజన పాఠశాలకు సరిగ్గా వెళ్లడం లేదు. బాగా చదివే అమ్మాయి. ఎందుకు ఇలా చేస్తోంది? ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడే ఆ ప్రాంతంలో హెచ్‌ఐవి పాజిటివ్‌ వ్యక్తుల సమూహాలతో కొన్ని సమావేశాలు నిర్వహించింది ఓ స్వచ్ఛంద సంస్థ. అందులో వీడియో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు సంజయ్. అక్కడ ఓ సమావేశానికి హాజరైన ఆ బాలిక తన తల్లీదండ్రీ చనిపోయారని, అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నానని చెప్పింది. ‘అమ్మానాన్న ఎందుకు చనిపోయారో నాకు తెలియదు. చిన్నప్పుడే ఇక్కడికి వచ్చేశాను. బడికి వెళితే మొదట్లో బాగానే ఉంది. కానీ ఇప్పుడు స్కూల్లో టీచర్లు నన్ను దూరం పెడుతున్నారు. ఫ్రెండ్స్‌ ఎవ్వరూ నాతో మాట్లాడడం లేదు. చదువుపై శ్రద్ధ తగ్గిపోయింది. రోగం వల్ల అమ్మనాన్న చనిపోయారని అమ్మమ్మ చెప్పింది. నాకు ఏ రోగమూ లేదు. అయినా అందరూ నన్ను హేళన చేస్తున్నారు. అందుకే చదువుకోవాలని ఉన్నా స్కూలుకు వెళ్లడం లేదు’ అంటూ బోరుబోరున ఏడ్చేసింది.

ఆ దృశ్యం చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్‌ సంజయ్ చెంపలు కూడా కన్నీళ్లతో తడిసిపోయాయి. ‘దెబ్బతిన్న వాడికే నొప్పి విలువ తెలుస్తుంది’ అన్నట్లుగా ఆ క్షణం ఆ చిన్నారిలో తనను తాను చూసుకున్నాడు సంజయ్.

రెండున్నర దశాబ్దాల క్రితం ప్రపంచాన్ని కుదేపేసిన ఎయిడ్స్‌ వ్యాధికి పెద్దలతో పాటు పిల్లలు కూడా బలయ్యేవారు. అనారోగ్యం కంటే అవగాహనా లోపంతో అశువులు బాసిన వారే ఎక్కువ. అంతలా భయపెట్టిన హెచ్‌ఐవి వైరస్‌కి అమ్మ కడుపులో ఉండగానే గురైన పసివారు కోకొల్లలు. చెన్నరు నమ్మకల్‌ ప్రాంతంలో పుట్టి పెరిగిన 21 ఏళ్ల సంజయ్ అలాంటి పిల్లవాడే. పుట్టుకతోనే సంక్రమించిన వ్యాధితో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. చుట్టూ వున్న వారు తనను ఎందుకు దూరం పెడుతున్నారో తెలియని అమాయకత్వంలోనే పెరిగాడు. వయసు పెరిగేకొద్దీ పరిస్థితులు అర్థమయ్యాయి. అమ్మ చనిపోయింది. నాన్న మంచానికే పరిమితమయ్యాడు. ‘నాతో పాటు పుట్టిన అక్కలిద్దరూ ఏ మందులూ వేసుకునేవారు కాదు. నేను మాత్రమే ఎందుకు? అని ప్రశ్నించేవాడ్ని. 3వ తరగతి నుంచే మూడు పూటలా మందులు వేసుకోవాల్సి వచ్చేది. అమ్మ చనిపోయాక కొన్ని రోజులకు మందులు వేసుకోవడం మానేశాను. దీంతో గాయాలు త్వరగా మానేవి కావు. ఎప్పుడూ అనారోగ్యంగా ఉండేవాడ్ని. స్కూలుకు వెళితే పిల్లలందరితో కూర్చొనిచ్చేవారు కాదు. దూరం పెట్టేవారు. చాలా బాధేసేది. స్కూలుకు వెళ్లబుద్ధి అయ్యేది కాదు. నేను 8వ తరగతికి వచ్చేటప్పటికి హెచ్‌ఐవి సోకినా ఆరోగ్యంగా జీవించవచ్చని తెలుసుకున్నాను. నా జీవితానికి మార్చుకోవాలంటే మందులు వేసుకోవాల్సిందేనని నిర్ణయించుకున్నాను. ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు వ్యాధి నుంచి కోలుకున్నాను’ అని చెబుతున్న సంజయ్ విజువల్‌ కమ్యూనికేషన్స్‌ పూర్తిచేసి వీడియో గ్రాఫర్‌గా కొత్త జీవితం ప్రారంభించాడు.

ఇప్పుడు తను సురక్షితమే.. కానీ తనలాంటి వారు ఎంతోమంది. ఇంకా భయంభయంగానే జీవిస్తున్నారు. వ్యాధి ఉందని తెలిస్తే సమాజం చిన్నచూపు చూస్తుందని భయపడుతున్నారు. ఎన్‌జివో తరపున వీడియో చిత్రీకరణ చేస్తున్న సంజయ్ కి ఆ పాప సంఘటన కర్తవ్యబోధ చేసినట్లైంది. ‘వ్యాధి నుంచి కోలుకున్నా నేనెప్పుడూ బాధితుడిని అని ఎవరికీ చెప్పలేదు. మొన్నీమధ్యే నా స్నేహితులకు చెప్పాను. అందరూ ఇలాగే ఉంటే సమాజ ధోరణిలో మార్పు ఎలా వస్తుంది? అందుకే ఇప్పటికీ ఎంతోమంది పిల్లలు వివక్షకు గురవుతున్నారు. చదువుకు దూరమై నిరాశనిస్పృహలలో జీవిస్తున్నారు. వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలంటే నాలాంటి వారు ముందుకు రావాలి. వ్యాధి నుంచి బయటపడవచ్చని వాళ్లల్లో ధైర్యంనింపాలి’ అంటున్న సంజరు ఆ ఆలోచన రావడంతోనే ‘హెచ్‌ఐవి అండ్‌ ఎయిడ్స్‌ నంబిక్కయుమ్‌ నలవాల్వమ్‌’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించాడు. అందులో ముందుగా తన కథను ప్రసారం చేశాడు. స్వచ్ఛంద సంస్థ మద్దతుతో హెచ్‌ఐవి అవగాహనా చర్చలు జరుపుతున్నాడు. సంస్థతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. వ్యాధిగ్రస్తుల పట్ల సమాజంలో నెలకొన్న పక్షపాతాన్ని తొలగించేందుకు నడుం బిగించాడు. తన గతం తాలూకు చేదు జ్ఞాపకాలని బహిరంగంగా చెప్పే సాహసోపేత నిర్ణయంలో ముందుకు వెళుతున్నాడు.

➡️